Singer Kalpana: ప్రముఖ గాయని కల్పన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. రెండు రోజుల క్రితం ఆమె నిద్రమాత్రలు అధికంగా తీసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు మొదట ఆత్మహత్యాయత్నంగా అనుమానించినప్పటికీ, ఆమె భర్త ప్రసాద్ ప్రభాకర్, కూతురు దయ స్టేట్మెంట్ ఆధారంగా అది నిజం కాదని నిర్ధారించారు. కూతురి సమస్యలతో కల్పన మనస్తాపానికి గురై నిద్ర మాత్రలు వేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఆసుపత్రిలో చికిత్స – త్వరలో డిశ్చార్జ్
ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్పనకు ఆక్సిజన్ సహాయంతో చికిత్స అందిస్తున్నారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ కారణంగా మరికొన్ని రోజులు ఆక్సిజన్ అందించాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, పరిస్థితి అనుకూలంగా మారుతున్నందున మరో ఒకటి రెండు రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలిపారు.
కేరళకు తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యుల ఏర్పాట్లు
ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన అనంతరం, ఆమెను కేరళలోని వారి నివాసానికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుండడం అభిమానులకు ఊరట కలిగిస్తోందనే చెప్పాలి.