టాలీవుడ్ నిర్మాతలపై ఐటీ విభాగం గురి
– పుష్ప 2 లెక్కల వ్యవహారాలపై అనుమానాలు
– మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల ఇళ్లలో తనిఖీలు
– భారీ వసూళ్లు వచ్చినా ట్యాక్స్ ఎగ్గొట్టే ప్లాన్స్?
– బ్లాక్ మనీ లోగుట్టుపై అనుమానాలెన్నో?
– ఏపీ మంత్రి పెట్టుబడికి అకౌంట్స్ ఉన్నాయా?
– నష్టాల కోసం తీస్తున్న సినిమాలు అవేనా?
– అడ్వాన్సుల రూపంలో ఇచ్చిన సొమ్ము ఎంత?
– భూముల కొనుగోళ్లతో వైట్‌గా మారిన డబ్బెంత?
– ట్యాక్స్ లేని ఎన్నారై షెల్ కంపెనీల పెట్టుబడి?
– 1,500 కోట్ల లాభాల్లో చెల్లించాల్సిన పన్ను ఎంత?
– దిల్ రాజు అకౌంట్స్‌లోనూ తేడాలున్నాయా?
– వెండి తెర వెనుక నల్లధనంపై యాక్షన్‌లోకి ఐటీ
– ఐదు రోజులపాటు సోదాలు కొనసాగించే అవకాశం
– స్పేచ్ఛ ఎక్స్‌క్లూజివ్
ఉరుము లేకుండా పిడుగు పడినట్టు.. మంగళవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌లోని ప్రముఖ నిర్మాతలు, నిర్మాణ సంస్థల కార్యాలయాలపై ఆదాయం పన్ను విభాగం అధికారులు సోదాలు మొదలు పెట్టారు. ఈ సోదాలు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయని సమాచారం. గత ఏడాది డిసెంబర్‌లో విడుదలై.. పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన పుష్ప 2 కలెక్షన్లు, దానికి చెల్లించిన ఆదాయం పన్నులు.. ఎగ్గొట్టినట్టు భావిస్తున్న పన్నుల విషయంలో ఐటీ అధికారులు ఈ సోదాలకు దిగినట్టు తెలుస్తున్నది.
నిజానికి ఈ కథ పుష్ప ది రైజింగ్ నుంచి మొదలైందట! దీనికి మూలాలు గల్ఫ్ దేశాల్లోని ఒక ప్రముఖ సంస్థతోపాటు.. మైత్రి మూవీస్ సంస్థలో పెట్టుబడులు ఉన్నాయని చెప్పే ఏపీ మినిస్టర్ గొట్టిపాటి రవి పైనా ఐటీ అధికారులు దృష్టిసారించారట! ఊరూ పేరూ లేకుండా.. వచ్చాయో లేదో చాలా మందికి తెలియని మారుతీ నగర్ సుబ్రమణ్యం, త్వరలో వస్తుందని చెబుతున్న గాంధీ తాత చెట్టు.. వంటి సినిమాలకూ ఈ సోదాలతో సంబంధం ఉందట! శాటిలైట్ రైట్స్‌కు వచ్చిన రూ.500 కోట్ల లెక్క ఇంకా మిగిలే ఉందట!
ఇలా చాలా ట్విస్టులు ఉన్న ఐటీ సోదాల అసలు కథలోకి వెళదాం..
(దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809)
స్వేచ్ఛ డిజిటల్ డైలీ:
పోలీసుల కళ్లుగప్పి ఎర్ర చందనం లారీలను ఎలా సరిహద్దులు దాటించాలో, ఎలా షిప్పుల్లోకి ఎక్కించాలో పథకాలు వేయడంలో పుష్ప క్యారక్టర్ ఆ సినిమాలో ‘ఇరగదీసి’ నటించగా.. ‘తగ్గేదేల్యా’.. అంటూ ఆ సినిమా నిర్మాతలు సైతం ఆదాయం పన్ను చెల్లింపు విషయంలో అదే పుష్ప సినిమా థీమ్‌ను ఫాలో అయ్యారని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది చివరిలో వచ్చిన పుష్ప ‘ది రూల్’ ఇండియన్ బాక్సాఫీస్‌ని రూల్ చేసింది. ఈ చిత్రం సౌత్ కంటే నార్త్ జనాలకు బాగా కనెక్ట్ అయి కనక వర్షం కురిపించింది. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ముందే సంక్రాంతి పండుగ చేసుకున్నారు. కానీ, సినిమా అమ్మకం, వసూళ్లలో వచ్చిన సొమ్ముపై ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు వేసిన ప్లాన్స్‌ను అదాయపన్ను శాఖ పసిగట్టిందని సమాచారం. విదేశాల నుంచి ఫండింగ్ చేయించుకుని, సోదిలో లేని సినిమాలకు పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టినట్టు లెక్కలు చూపించి.. వచ్చిన లాభాలను గంపగుత్తగా పంచుకొని.. నల్ల డబ్బును తెల్లగా మార్చేశారని, పన్నులు ఎగ్గొట్టేందుకు ప్లాన్‌లు వేశారనేది టాక్! ఆ టాక్ అటూ ఇటూ పాకి.. ఐటీ చెవులకు తాకినట్టు తెలుస్తున్నది. దీని ఫలితమే హైదరాబాద్‌లో మంగళవారం నాటి సోదాలని చెబుతున్నారు.
హవాలా లింక్స్
పుష్ప 2 వసూళ్లకు సంబంధించి ట్యాక్స్ చెల్లింపుల్లో తేడాలు ఉన్నాయనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో కొంతకాలంగా జోరుగా వినిపిస్తున్నది. గల్ఫ్‌లోని ప్రముఖ సంస్థ నుంచి హవాలా రూపంలో డిస్టిబ్యూటర్స్‌కు డబ్బులు చేరాయని తెలుస్తున్నది. పెట్టుబడి రూపంలో ట్యాక్స్ చెల్లించకుండా 75 పైసల వడ్డీతో రూ.500 కోట్లు ఎన్నారై ఫండ్స్ రూపంలో వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల ఇళ్లలో మంగళవారం ఉదయం నుంచీ సోదాలు నిర్వహించారు. శాటిలైట్ రైట్స్‌కు వచ్చిన రూ.500 కోట్ల లెక్క ఇంకా మిగిలే ఉందని అధికారులు గుర్తించినట్లు తెలుస్తున్నది.
పంపకం ఇలా!
పుష్ప 2 మొత్తం రూ.2,300 కోట్ల వసూళ్లు చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో రూ.400 కోట్లు నిర్మాణానికి ఖర్చు అయింది. మరో రూ.400 కోట్లు థియేటర్స్‌కు, ప్రమోషన్స్‌కు పోగా రూ.1,500 కోట్ల నికర లాభం వచ్చిందని సమాచారం. ఇందులో ప్రొడక్షన్ టీం అయిన మైత్రీ మూవీ మేకర్స్ 50 శాతం, ప్రధాన నటుడు అల్లు అర్జున్ 30 శాతం, దర్శకుడు సుకుమార్ 20 శాతం వాటా తీసుకునేందుకు ఒప్పందాలు జరిగాయని చెప్పుకొంటున్నారు. పుష్ప 1కి రూ.400 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అప్పుడు హీరో, దర్శకుడు రెమ్యూనరేషన్స్ తీసుకున్నారు. పార్ట్ 2 ప్రాణం పెట్టి చేసినందుకు వాటాలే కావాలని పట్టుపట్టారని సమాచారం. ఈ మధ్యలో పిట్టకథలా.. దర్శకుడు సుకుమార్.. తన భార్యతో రెండు సినిమాలు చేయించుకున్నారు. అవే మారుతీ నగర్ సుబ్రమణ్యం, త్వరలో విడుదల కానున్న గాంధీ తాత చెట్టు. వీటి వెనుక చాలా ట్విస్టులే ఉన్నాయని విశ్వసనీయంగా తెలుస్తున్నది. నష్టాల లెక్కలు చూపించి ట్యాక్సులు చెల్లించకుండా కష్టాలు పడుతున్నట్లు కలరింగ్ ఇవ్వాలని చూసినట్టు సమాచారం. పుష్ప హిందీ వెర్షన్‌ను రవీనా టాండన్ భర్త అనిల్ దక్కించుకున్నారు. అయితే, ఇచ్చిన డబ్బులకు, చూపిస్తున్న లెక్కలకు చాలా తేడా ఉందని ఇన్‌సైడ్ టాక్. మైత్రి మూవీ సంస్థలో ఫండింగ్ పెట్టి, సినిమాకి క్లాప్ కొట్టిన ఏపీ మినిస్టర్ గొట్టిపాటి రవిపై కూడా ఐటీ దృష్టి సారించిందని తెలుస్తున్నది. ఆర్బీఐకి ఓ లేఖ ఇచ్చి ఎన్ఆర్ఐ ఫండ్స్ రూపంలో షెల్ కంపెనీల నుంచి ట్యాక్స్ లేకుండా నిధులు తెచ్చుకుని, 75 పైసలకు వడ్డీ చెల్లిస్తున్నట్లు కథలు అల్లారని సమాచారం.
మైత్రీ.. కథలెన్నో!
వైట్‌లో డబ్బులు చెల్లిస్తే టీడీఎస్, జీఎస్టీతో పాటు పర్సనల్‌గా స్లాబ్‌లో వారి ఆదాయానికి 30 శాతం వరకు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. వందలో 30 రూపాయలు ప్రభుత్వానికి ఎందుకు చెల్లించాలని బ్లాక్ మనీ హవాలా రూపంలో తీసుకున్నారని తెలుస్తున్నది. ఆ మొత్తంతో నటులకు అడ్వాన్స్ రూపంలో వందల కోట్లు మైత్రీ సంస్థ చెల్లించినట్టు సమాచారం. ఇక భూములపైనా ఈ నిర్మాతలు డబ్బులను తెగ పెట్టేస్తున్నారు. హైదరాబాద్ నగర శివార్లతో పాటు, అమరావతి, వైజాగ్‌లో రిజిస్ట్రేషన్ విలువతో భూములు వైట్‌గా చూపించి, బ్లాక్‌లో కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారని అగ్రిమెంట్స్ చేసుకున్న పత్రాలు చెబుతున్నాయి. కొత్త చట్టాలు ఎన్ని వచ్చినా, ఈ ట్యాక్స్ ఎగవేత, లెక్కలు చెప్పకుండా తప్పించుకోవడం మాత్రం ఆగడం లేదు.
లెక్కలు పక్కాగా లేకుంటే ఊరుకుంటారా?
మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు ఐటీ అధికారులు హైదరాబాద్‌లో సోదాలు చేసేందుకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. 50 టీమ్స్‌గా విడిపోయి అధికారులు 8 చోట్ల సోదాలు చేశారు. ఒక్క పుష్ప 2 సినిమాకే 15 వందల కోట్ల రూపాయల నికర లాభాలకు 18 నుంచి 30 శాతం వరకు వివిధ స్లాబ్స్‌లో పన్నులు చెల్లించాలి. వీరికి డబ్బులు వచ్చినా, తీసుకున్నా కొత్త చట్టాల ప్రకారం కనీసం 25 శాతం ఇవ్వాలి. కానీ ఆ ట్యాక్స్‌ను తప్పించుకునేందుకు లెక్కలు పక్కాగా లేకుండానే తప్పుడు, అధిక లెక్కలతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని చర్చలు నడుస్తున్నాయి. గల్ఫ్ దేశాల నుంచి దండిగా హవాలా రూపంలో కరెన్సీ వచ్చిందనే వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నది.
దిల్ రాజు సంగతేంటి?
మరోవైపు.. సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ మూవీల లెక్కల్లో ఎలాంటి చేంజేస్ లేవని నిర్మాత దిల్ రాజు నుంచి సమాధానం వస్తున్నది. అన్ని లెక్కలూ సరితూగేలా రికార్డుల కలెక్షన్స్‌తో పాటు, వందల కోట్ల చిక్కులపై ఇప్పుడు ఐటీ గురి పెట్టడంతో ఈ వ్యవహారం ఎటు టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.