Doctor Kills Patient| ఇంటర్నెట్ డెస్క్: అతడో డాక్టర్. పేషెంట్‌ను కంటికి రెప్పలా కాపాడుతానని ప్రతిన బూని మరీ వృత్తి చేపట్టిన వ్యక్తి. కానీ, ఆర్థిక కష్టాలు అతడిని దారి తప్పేలా చేశాయి. తనను దేవుడిలా భావించే పేషెంట్‌నే పొట్టనపెట్టుకునేలా చేశాయి. నిందితుడు అత్యంత కర్కశంగా తన పేషెంట్‌ను బతికుండగానే కాల్చేశాడు. చేసిన నేరం నుంచి సులువుగానే తప్పించుకోవచ్చని దారుణానికి తెగబడ్డ అతడు చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. యూపీలో వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
రాష్ట్రంలోని భాగ్‌పత్ ప్రాంతానికి చెందిన డా. ముబారిక్ అహ్మద్ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయాడు. రూ.30 లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలీక నిత్యం సతమతమయ్యే అతడు చివరకు తను చనిపోయినట్టు నాటకమాడి ఇన్సూరెన్స్ డబ్బు తీసుకున్నాడు. తన డెత్ సర్టిఫికేట్ సాయంతో భార్యకు ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకుని వాటితో అప్పులు తీర్చి తలనొప్పి వదిలించుకోవాలనేది అతడి ప్లాన్. డాక్టర్ అయినందున అతడు తొలుత ఓ మృతదేహాన్ని వ్యాన్‌లో వేసి నిప్పంటించి తాను చనిపోయినట్టు అందరినీ భ్రమింపజేయాలని అనుకున్నాడు. అయితే, మృతదేహం కోసం ఎంత ప్రయత్నించినా లభ్యం కాలేదు. దీంతో, తలపట్టుకున్న అతడు చివరకు ఓ వ్యక్తిని హత్య చేసి అతడి మృతదేహంతో తన పథకానికి వాస్తవ రూపం ఇద్దామనుకున్నాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయి విచక్షణ మరిచిన అతడు చివరకు ప్రాణాలు పోసే చేతుతోనే ప్రాణాలు తీసేందుకు రెడీ అయ్యాడు.
Also Read: సంతానం లేని మహిళలను గర్భవతి చేస్తే రూ.10 లక్షలు.. బిహార్‌లో బంపర్ స్కామ్
చికిత్స కోసం నిత్యం తన వద్దకు వచ్చే సోనూ అనే పేషెంట్‌నే టార్గెట్ చేసుకున్నాడు.సోనూకు, ముబారిక్‌కు మూడేళ్లుగా పరిచయం ఉంది. రోజు కూలి చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. నిత్యం వైద్యం చేయించుకునేందుకు ముబారిక్ వద్దకు వస్తుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ముబారిక సోనూను మద్యం తాగేందుకు ఆహ్వానించారు. ఈ క్రమంలోనే అతడి డ్రింక్స్‌లో మరేదో మత్తుపదార్థం కలిపి సోనూ స్పృహ కోల్పోయేలా చేశాడు. ఆ తరువాత అతడిని సహారన్‌పూర్‌లోని ఓ కాలవ వద్ద ఉన్న వ్యాన్‌లో ఎక్కించి పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. దీంతో, అన్నెంపున్నెం తెలియని సోనూ మంటల్లో పడి సజీవదహనమయ్యాడు.
మూడు రోజుల తరువాత సోనూ మృతి గురించి ప్రపంచానికి తెలిసింది. సోమవారం, స్థానికులు మంటల్లో కాలిపోయిన వాహనాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కారులో మృతదేహం కూడా ఉండటంతో అప్రమత్తమైన పోలీసులు ఫారెన్సిక్ నిపుణులకు రంగంలోకి దింపారు. మరోవైపు, రోజులు గడుస్తున్నా సోనూ ఇంటికి రాకపోవడంతో కంగారు పడిపోయిన అతడి కుటుంబసభ్యులు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చూస్తుండగానే సోనూ అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలానికి దారితీసింది. ఈ క్రమంలో కొందరు సోనూను చివరిసారిగా డాక్టర్‌తో మాట్లాడుతూ కనిపించినట్టు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ముబారిక్‌ను ప్రశ్నించగా జరిగిన దారుణం బయటపడింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తానే సోనూను హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. దీంతో, పోలీసులు అతడపై హత్య, ఆధారాలు చెరిపే ప్రయత్నం చేయడం తదితర నేరాల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.