Sai Kumar:సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ మంది మాత్రమే చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి, ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు అంటే ఇక ఇండస్ట్రీతో వారికున్న అనుబంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా , సినీ పరిశ్రమ ఆయనను అత్యంత గౌరవంగా సత్కరించింది. ఇప్పుడు ఆ జాబితాలోకి విలక్షణ నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, హీరోగా కూడా మంచి పేరు దక్కించుకున్న సాయికుమార్ (Sai Kumar) కూడా చేరిపోయారు. తాజాగా ఆయన 50 వసంతాలు పూర్తి చేస్తున్న సందర్భంగా.. ఆయన గురించి ఒక ప్రత్యేక కథనం మీ కోసం..
కన్నడ ఇండస్ట్రీతో సినీ ప్రయాణం..
సాయికుమార్.. అద్భుతమైన డైలాగ్ డెలివరీతో, ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునే సాయి కుమార్.. 1961 జనవరి 27వ తేదీన జన్మించారు. ఈయన తండ్రి పీ.జే.శర్మ (PJ.Sharma) ప్రముఖ నటుడు.. తల్లి కృష్ణ జ్యోతి(Krishna Jyothi) నట వారసత్వాన్ని ఉణికి పుచ్చుకున్నారు సాయికుమార్. జ్యోతి ఒకప్పుడు కన్నడ చిత్ర రంగంలో నటిగా మంచి పేరు దక్కించుకున్నారు. అలా ఆయనకు కన్నడ మాతృభాష అయింది. కానీ సాయికుమార్ మాత్రం సౌత్ ఇండస్ట్రీపై తనదైన మార్క్ వేసుకున్నారు. తొలిసారి 1972 అక్టోబర్ 20వ తేదీన ‘మయసభ’ నాటకంలో దుర్యోధనుడి పాత్రలో నటించారు. ఆ తర్వాత నటుడిగా ఆయన వెను తిరిగి చూడలేదు. బాల నటుడుగా, సినీ రంగ ప్రవేశం చేసిన సాయికుమార్ “దేవుడు చేసిన పెళ్లి” సినిమాతోనే తన కెరీర్ ను ప్రారంభించారు. 1975 జనవరి 9వ తేదీన విడుదల అయింది ఈ సినిమా. అలా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.
తెలుగులో కూడా భారీ పాపులారిటీ..
తెలుగు, కన్నడ సినిమాలలో నటించి ఎవర్ గ్రీన్ నటుడిగా పేరు దక్కించుకున్న సాయికుమార్.. కన్నడలో పోలీస్ స్టోరీ 2, అగ్ని ఐపీఎస్, కుంకుమ భాగ్య , లాకప్ డెత్ , సర్కిల్ ఇన్స్పెక్టర్, మనే మనే రామాయణ, సెంట్రల్ జైల్ తదితర చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. ఆ తర్వాత తెలుగులో అమ్మ రాజీనామా, అంతఃపురం, కర్తవ్యం, ఈశ్వర్ అల్లా, ఎవడు, పటాస్, భలే మంచి రోజు, సరైనోడు ,జై లవకుశ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన కెరియర్లో ఎన్నో చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి.
ఎన్నో అవార్డులు ఆయన సొంతం..
ఇక 2006లో సామాన్యుడు చిత్రంలోని పాత్రకు ఏకంగా ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందుకున్నారు. 2017లో ప్రస్థానం చిత్రంతో సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అంతేకాదు పలు ఫిలింఫేర్ అవార్డులతో పాటు పలు అవార్డులు అందుకున్నారు. ఇకపోతే సాయికుమార్ నటుడి గానే కాకుండా ‘వావ్’ అనే గేమ్ షో కి హోస్ట్ గా కూడా వ్యవహరించారు. అంతేకాదు ఎంతోమంది స్టార్ హీరోలకు వాయిస్ కూడా అందించి, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పేరు దక్కించుకున్నారు. అలా మొత్తానికి అయితే 50 ఏళ్ళు కెరియర్ లో ఎన్నో మైలురాళ్లు దాటి నేడు స్టార్ సెలబ్రిటీగా మంచి పేరు సొంతం చేసుకున్నారు సాయికుమార్. ఇక మునుముందు కూడా ఇలాగే మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.
With all ur blessings Nana has completed 50 years as and actor today thank u all 🙏 pic.twitter.com/lxIk6S4DVX
— Aadi Saikumar (@iamaadisaikumar) January 9, 2025