Renu Desai: రేణూదేశాయ్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ‘బద్రి’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.. ఈ అమ్మడు. ఆ మూవీ షూటింగ్ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించి కొద్దిరోజులకు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారికి ఇద్దరు పిల్లలు పుట్టాక విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. అప్పటి నుంచి రేణూ దేశాయ్ సినిమాలకు దూరంగా ఉంటూ.. పిల్లలను చూసుకుంటూ జీవనం సాగిస్తోంది.
ఇటీవలే మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని రేణు నిర్ణయించుకుంది. రవితేజ హీరోగా వస్తోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో నటిస్తోంది. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో రేణూ అనారోగ్యం బారిన పడింది. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘‘అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. కొద్దిరోజులుగా గుండె సంబంధిత వ్యాధితోపాటు మరికొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. నాలాగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ధైర్యానివ్వడం కోసం ఈ విషయాన్ని చెబుతున్నాను. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. ధైర్యాన్ని కోల్పోకూడదు.. బలంగా ఉండాలి. మీపై.. మీ జీవితంపై ఆశను కోల్పోవద్దు. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా, నవ్వుతూ ఎదుర్కోవాలి. చికిత్స తీసుకుంటున్నాను. త్వరలోనే కోలుకొని తిరిగి షూటింగ్స్‌లో పాల్గొంటాను’’ అని చెప్పుకొచ్చింది.
ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరలవుతుండడంతో నెటిజన్లు ఆందోళనకు గురవుతున్నారు. త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
ఇక కొంతకాలంగా ఇండస్ట్రీలో హీరోయిన్లు అనారోగ్యం బారిన పడుతుండడం కలకలం రేపుతోంది. ఇటీవల స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ బారిన పడింది. ఎనిమిది నెలలుగా ఆ వ్యాధితో పోరాడుతూ.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆ తర్వాత కల్పిక గణేష్, పూనమ్ కౌర్, మమతా మోహన్ దాస్.. ఇప్పుడు రేణు దేశాయ్.. ఇలా వరుసగా హీరోయిన్లు అనారోగ్యం బారిన పడడం ఇండస్ట్రీని ఆందోళనకు గురి చేస్తోంది.