Ileana D’Cruz: ఇలియానా (Ileana).. కరెంట్ తీగ లాంటి నడుముతో యువతను ఉర్రూతలూగించిన ఈ ముద్దుగుమ్మ.. గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. పెళ్లయి, పిల్లలు పుట్టిన తర్వాత సినిమాలు మానేసి, తన సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తోంది. అయినా సరే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను అభిమానులకు షేర్ చేసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తాజాగా పేరేంటింగ్ పై పలు కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తల్లి ప్రేమను పొందడానికి ప్రత్యేకించి పిల్లలు ఏదో చేయాలని అనుకోవడం సరైనది కాదు అంటూ తన మనసులో మాట పంచుకుంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా పిల్లలలో తాను పెంపొందించాల్సిన విలువల గురించి, పిల్లలను దయ, ఎమోషనల్, సేఫ్టీ, అన్ కండిషనల్ లవ్ తో పెంచాలని తన మనసులో భావాన్ని పంచుకుంది. పేరేంటింగ్ అంటే అంత సులభమైనదేమీ కాదు.. కానీ మన పిల్లల్ని సరైన మార్గంలో పెంచాలి అంటే మనం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు క్రూరంగా, దుష్టంగా, స్వార్థపూరితంగా , దయ లేకుండా ఉండడం వంటిది.. అవతలి వ్యక్తిలో ప్రేమను కలగజేయవని, ఇలాంటి గుణాలు కలిగిన వ్యక్తులను ఎవరూ ప్రేమించరని, మిగతా వాటిలాగే ప్రేమను కూడా గుణం, ప్రవర్తనతోనే సంపాదించుకోవాలి అంటూ తెలిపింది.
పిల్లల్ని అలా పెంచొద్దు..
అలాగే.. పిల్లల్ని ఎప్పుడూ కూడా అలా పెంచకూడదు. ఒకరి మెప్పును లేదా ప్రేమను లేదా సమాజంలో గుర్తింపు పొందడానికి మాత్రమే పనులు చేయకూడదని తల్లిదండ్రులుగా పిల్లలకు చెప్పాలి. మనలోని పాజిటివ్ లక్షణాలు ఇతరుల చేత గుర్తింపబడాలే తప్ప ఒకరు మనల్ని గుర్తించాలని, అలా గుర్తించడం కోసం మనం ఏవేవో చేయాల్సిన పనిలేదు అని పిల్లలకు అర్థమయ్యేలా తెలియచేయాలని కూడా చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ప్రేమను పొందడానికి అన్వేషించాలని, వారిలోని పాజిటివ్ గుణాలను గుర్తించడం కన్నా వాటిని మరింత పోషించేలా ప్రయత్నం చేయించాలి.. అలా చేస్తే ఆటోమేటిక్గా ప్రజల దృష్టిని ఆకర్షించగలరు అంటూ తన ఇన్స్టా పోస్టులో రాసుకొచ్చింది ఇలియానా.. ఇక అంతే కాదు నా ప్రేమను ఎలాగైనా పొందాలని పిల్లలు అనుకోవడాన్ని నేను ఇష్టపడను. అంతకన్నా మించిన చెత్త ఫీలింగ్ ఇంకోటి ఉండదు. నేను నా పిల్లలను ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా, సంతోషంగా, దయ కలిగిన వారిగా మాత్రమే పెంచాలని అనుకుంటున్నాను. ఈ క్రమంలోనే నా బెస్ట్ ని నేను అందిస్తున్నాను. బహుశా అందరు తల్లిదండ్రులు ఇలాగే భావిస్తారని అనుకుంటున్నాను. కాకపోతే ఈ అభిప్రాయాలు పూర్తిగా నా వ్యక్తిగతం అంటూ తన వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకుంది ఇలియానా. ప్రస్తుతం ఇలియానా చేసిన ఈ కామెంట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇలియానా వ్యక్తిగత జీవితం..
అమెరికన్ నటుడైన మైఖేల్ డోలాన్ ను 2023లో పెళ్లి చేసుకుంది. కొద్ది రోజులకే తన ప్రెగ్నెన్సీ న్యూస్ ను షేర్ చేసి 2023 ఆగస్టులో కొడుకు పుట్టాక, తన భర్తను పరిచయం చేసింది. ఇక 2024 లో సెకండ్ ప్రెగ్నెన్సీని కూడా కన్ఫామ్ చేస్తూ.. ఇలియానా మరో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే.