Tollywood..ఈమధ్య కాలంలో ప్రేక్షకుడిని థియేటర్కు రప్పించాలి అంటే దర్శక నిర్మాతలు ఎంత కష్టపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోలైతే సరికొత్త స్ట్రాటజీలు ఉపయోగిస్తూ.. ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే ప్రేక్షకులు మాత్రం థియేటర్ కి వెళ్లడానికి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు.. పెరిగిన టికెట్ ధరలు, ఆకాశాన్ని అంటుతున్న స్నాక్స్ ధరలతో పాటు ఇతర కారణాలవల్ల థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలంటేనే సామాన్యుడు భయపడుతున్నాడు. అందుకే థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లకపోవడంతో థియేటర్ యాజమాన్యానికి భారీగా నష్టం చేకూరుతోంది. ఈ నేపథ్యంలోనే థియేటర్లను లీజుకు తీసుకున్న యాజమాన్యం కూడా సకాలంలో అద్దె చెల్లించలేక సతమతమవుతున్న నేపథ్యంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
జూన్ 1 నుండి సినిమా థియేటర్లు బంద్..
అసలు విషయంలోకెళితే.. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాలలో సినిమా థియేటర్లు బంద్ చేయాలి అని ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ లో తెలంగాణ, ఆంధ్ర ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం జరగగా.. ఈ సమావేశానికి నిర్మాతలు దిల్ రాజు (Dilraju ), సురేష్ బాబు (Sureshbabu)తో పాటు మొత్తం 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పేశారు. అంతేకాదు పర్సంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ఇకపై థియేటర్లలో ప్రదర్శిస్తామని, నిర్మాతలకు లేఖ రాయాలని కూడా ఎగ్జిబిటర్లు తీర్మానించుకున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుంది అనడంలో సందేహం లేదు. మరి దీనిపై నిర్మాతల మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ALSO READ: Payal Rajput: అలాంటి సమస్యతో బాధపడుతున్న పాయల్.. ఏమైందంటే..?
నష్టాల్లో మునిగిపోయిన ఎగ్జిబిటర్లు..
సినిమాను భారీ ధరకు కొనుగోలు చేసిన ఎగ్జిబిటర్లు పూర్తిస్థాయిలో నష్టపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక సినిమాను పూర్తి చేశాక ఆ సినిమా హక్కులను ఎగ్జిబిటర్లకు అమ్మేసి.. నిర్మాతలు చేతులు దులుపుకుంటున్నారని.. ఇక పెట్టిన పెట్టుబడిని వెనక్కి పొందాలి అంటే ఎగ్జిబిటర్లు.. ప్రేక్షకులను థియేటర్ కి రప్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రేక్షకుడు థియేటర్ కి వచ్చి సినిమా చూడడానికి సముఖత చూపించడం లేదు. టికెట్టు, స్నాక్స్ ధరలతో పాటు పార్కింగ్ కి ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. పైగా కంటెంట్ బాగుంటేనే సినిమా థియేటర్ కి రావడానికి ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికి తోడు ఫ్యామిలీతో సినిమా చూడాలి అంటే 2000కు పైగా ఖర్చు అవుతుంది. ఇక ఇవన్నీ ఆలోచించి సామాన్యుడు థియేటర్ కి వెళ్లాలంటేనే వెనకడుగు వేస్తున్నారు. ప్రేక్షకుడు తీయటానికి రాకపోవడం.. సినిమా థియేటర్లలో ఆడకపోగా.. నష్టం భారీగా వాటిల్లుతోంది. అటు అద్దె కూడా చెల్లించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే థియేటర్లను మూసివేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లు మూసేస్తే నిర్మాతలకు భారీ నష్టం చేకూరుతుంది. మరి ఇలాంటి సమయంలో అటు ఎగ్జిబిటర్లు నష్టపోకుండా ఇటు ప్రేక్షకుడు థియేటర్ కి వచ్చేలా నిర్మాతలు ఏదైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి.