Jayalalitha:ఒకప్పుడు తన అందచందాలతో తెలుగు రాష్ట్రాలలోనే కాదు తమిళ్, కన్నడ భాషలలో కూడా నటించి మెప్పించింది జయలలిత (Jayalalitha). సినిమాల ద్వారా తన నటనతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిన ఈమె, ఆ తర్వాత తమిళనాడుకు ముఖ్యమంత్రిగా మారి ప్రజలకు అండగా నిలిచింది. ఇప్పటికీ అక్కడి ప్రజలు అమ్మగా అని చాలా ఆప్యాయతగా పిలుచుకుంటున్నారు అంటే అక్కడి ప్రజల గుండెల్లో జయలలిత ఎంత స్థానాన్ని సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇక నేడు ఆమె మన మధ్య లేకపోయినా ఆమె స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆమె ద్వారా లబ్ధి పొందిన ప్రజలు ఇప్పటికీ ఆమెను ఆరాధ్య దేవతగా భావిస్తున్నారు.
తమిళనాడు ప్రభుత్వానికే జయలలిత ఆస్తులు..
ఇకపోతే జయలలితకు వివాహం కాలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె ఆస్తులు ఎవరికి చెందుతాయి? అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఆస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈమె ఆస్తులు ఎవరికి చెల్లుతాయి అని బెంగళూరులోని ప్రత్యేక కోర్ట్ లో కేసు వేయగా.. ప్రత్యేక కోర్టు ఇప్పుడు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వానికి జయలలిత ఆస్తిని అప్పగించడానికి స్పెషల్ కోర్టు చర్యలు తీసుకోవడం గమనార్హం. ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో వాటిని అప్పగించాలని ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి హెచ్ ఏ మోహన్ అధికారులను ఆదేశించడం జరిగింది.
జయలలిత ఆస్తుల వివరాలు..
జయలలిత విషయానికి వస్తే సుమారుగా 1562 ఎకరాల భూమికి సంబంధించిన భూపత్రాలతో పాటు 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, పదివేలకు పైగా చీరలు, 750 కి పైగా జతల చెప్పులు, గడియారాలు, ఇతర వస్తువులను కర్ణాటక ప్రభుత్వం.. తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించనున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ ఆస్తులు, వస్తువులు తమకు చెందాలి అంటూ.. కొన్ని రోజులుగా జయలలిత వారసులుగా చెబుతున్న జే దీపక్, జే.దీప వేసుకున్న అర్జీని కర్ణాటక హైకోర్టు కొట్టు వేసింది. ఇక సుమారుగా పదేళ్ల క్రితం తమిళనాడు సర్కారు స్వాధీనం చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువ రూ.913 కోట్లు అయితే ఈ పదేళ్లలో వాటి విలువ సుమారుగా రూ.4000 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనాలు వేస్తున్నారు. ఏది ఏమైనా ఇంత ఆస్తిని ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతోంది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారిందని చెప్పవచ్చు.
జయలలిత కెరియర్..
తెలుగు, తమిళ్ ,కన్నడ భాషలో సుమారుగా 140కి పైగా సినిమాలలో నటించిన ఈమె 1961 నుండి 1980 వరకు హీరోయిన్ గా వైవిద్య భరితమైన పాత్రలతో కూడా మెప్పించింది. ముఖ్యంగా బెస్ట్ డాన్సర్ గా పేరు దక్కించుకుంది. ఇక రాజకీయాలలోకి వచ్చిన తర్వాత తన గొప్ప మనసు చాటుకుంది. ఎంతోమంది పేదవారిని ఆదుకోవడమే కాకుండా అటు విద్యార్థులకు, యువతకు కూడా అండగా నిలిచింది. ఇక సినిమాల పరంగా, రాజకీయపరంగా ఉన్నత స్థాయిని చేరుకున్న జయలలిత 2016 డిసెంబర్ 5 రాత్రి 11:30 గంటలకు చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించింది. అంతకుముందు సుమారుగా రెండున్నర నెలలు ఆమె అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలోనే ఉండగా.. డిసెంబర్ 6వ తేదీన ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.