Wife Harrassment Husband Suicide | మహిళల సంరక్షణ కోసం తీసుకువచ్చిన చట్టాలను కొందరు దుర్వినియోగం చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఒక భార్య తన భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టడంతో, తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. వరకట్న నిషేధ చట్టాన్ని మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని, వెంటనే ఈ చట్టాలను సవరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. తన భార్య పెట్టిన తప్పుడు కేసుల వల్ల తీవ్ర అన్యాయానికి గురైనట్లు సూసైడ్ నోట్‌లో రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన నితిన్ పడియార్ (28) వృత్తి రీత్యా ఒక ఫొటోగ్రాఫర్. నితిన్‌పై ఇటీవల అతని భార్య రాజస్థాన్‌లో వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది. ఈ కేసులో పోలీసులు, కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి నితిన్‌కు సహనం నశించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నితిన్ జనవరి 20న ఆత్మహత్య చేసుకున్నాడు. అతని గదిలో లభించిన సూసైడ్ నోట్‌లో అనేక ఆసక్తికరమైన అంశాలు ప్రస్తావించాడు. తన భార్య రాజస్థాన్‌లో అతనిపై వరకట్న వేధింపుల కేసు పెట్టిందని, ఆమె తల్లిదండ్రులు తన వద్దకు వచ్చి కేసును ఉపసంహరించుకోవడానికి డబ్బు డిమాండ్ చేశారని అందులో తెలిపాడు. తన భార్య పెట్టిన తప్పుడు కేసుల వల్ తాను మానసిక వేదన అనుభవించానని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. అంతేకాకుండా.. మహిళలు వరకట్న నిషేధ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి ప్రభుత్వం ఆ చట్టాలను సవరించాలని కోరాడు.
Also Read: 5 పెళ్లిళ్లు చేసుకున్న నకిలీ వైద్యురాలు.. సోషల్ మీడియాతో ఆటకట్టు
మహిళా చట్టాలను సవరించకపోతే, ప్రతిరోజూ తన మాదిరిగానే ఎంతో మంది పురుషులు, వారి కుటుంబాలు నాశనమవుతాయని విజ్ఞప్తి చేశాడు. దేశంలోని యువత ఎవ్వరూ పెళ్లి చేసుకోవద్దని సూసైడ్‌లో పిలుపునిచ్చాడు. ఒక వేళ వివాహం చేసుకుంటే, తన మాదిరిగానే బెదిరింపులకు గురవుతారని యువతకు సందేశం ఇచ్చాడు. ఈ విషయాలన్నీ బంగంగా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) సియారామ్ గుర్జార్ మీడియాకు తెలిపారు. దీంతో మృతుడి భార్య, ఆమె తల్లి, ఆమె ఇద్దరు సోదరులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది.
భార్య పోరుతో తండ్రిని చంపిన కొడుకు
కనిపెంచిన తండ్రి అతనికి భారమయ్యాడు.. వృద్ధాప్యంలో కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన కుమారుడు తండ్రి పాలిట కాలయముడయ్యాడు.. బతికుండగానే కాల్వలో పడేసి కడతేర్చాడు. పల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రుపాలెం వద్ద గురువారం ఈ దారుణం జరిగింది. నూజండ్లకు చెందిన గంగినేని కొండయ్య (85) తనకున్న పొలం అమ్మేసి, ఆ డబ్బును పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావుకు ఇచ్చి మూడేళ్లుగా భార్య శిరోమణితో కలిసి అతని వద్దే ఉండేవారు. కొద్దికాలం క్రితం శిరోమణి చనిపోయింది. కుమారుడు వెంకటేశ్వరరావుకు గ్రామంలో పాలు, శీతల పానీయాలు, సిమెంట్ దుకాణాలు ఉండగా, వృద్ధాప్యంలోనూ తండ్రి అతడికి చేదోడుగా ఉండేవాడు. అయినా కొడుకు, కోడలు అతడిని భారంగా భావించేవారు. ఈ విషయమై తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. గురువారం కూడా గొడవపడ్డారు.
తర్వాత వెంకటేశ్వరరావు ఒక కారు అద్దెకు మాట్లాడుకున్నాడు. తండ్రి కొండయ్యకు ఏదో చెప్పి, నమ్మించి కారులో కూర్చోబెట్టుకుని సాగర్ కాల్వ వంతెన వద్దకు తీసుకెళ్లి కిందకు దిగమన్నాడు. తర్వాత ఉన్నపళంగా అతడిని పైకెత్తి కాల్వలో పడేశాడు. దూరం నుంచి ఇదంతా చూసిన భద్రుపాలెం గ్రామస్థులు పరుగున వచ్చారు. కాల్వలో కొట్టుకుపోతున్న కొండయ్య తనను కాపాడాలంటూ కేకలు వేశాడు. ఈత వచ్చినవాళ్లు ఎవరూ లేకపోవడంతో అందరూ చూస్తుండగానే ఆ వృద్ధుడు నీట మునిగి మృతిచెందాడు. వెంకటేశ్వరరావు కారెక్కి పారిపోతుండగా గ్రామస్థులు అతడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు.
ముసలి తండ్రిని ఎందుకు కాల్వలో పడేశావని ప్రశ్నిస్తే.. తన భార్య పోరు పడలేక ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పాడు. గ్రామస్థులు అతడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కొండయ్య మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.