NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ (Narne Nithiin) కూడా హీరోగా రానిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడే నార్నే నితిన్. ఆయన కెరీర్ గురించి మాట్లాడుకుంటే, తెలుగు సినిమా పరిశ్రమలో చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023లో “మ్యాడ్” (Mad) సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు నితిన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత 2024లో వచ్చిన “ఆయ్” (Aay) సినిమా కూడా విజయం సాధించింది. దీంతో నితిన్ వరుస హిట్స్‌తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ (Mad Square)తో కెరీర్ బ్లాక్ బస్టర్ కొట్టాడు నితిన్. ఈ హ్యాట్రిక్ హిట్ జోష్‌లో నెక్స్ట్ సినిమాలు చేస్తున్నాడు. అయితే.. తన సినీ ప్రయాణంలో నితిన్ స్వతంత్రంగా ఎదగాలని భావిస్తాడు ఎన్టీఆర్. అందుకే.. నితిన్ ప్రాజెక్ట్‌లలో ఎన్టీఆర్ జోక్యం చేసుకోడు, అవసరమైతే మాత్రమే సలహాలు ఇస్తాడని నితిన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. నితిన్ కూడా ఎన్టీఆర్ బావమరిది కదా అని ఎలా పడితే అలా సినిమాలే చేయడం లేదు నితిన్. దానికి ముఖ్య కారణం ఎన్టీఆర్ సలహాలే అని తెలుస్తోంది. నితిన్ కూడా ఎన్టీఆర్ చెప్పినట్టే.. పక్క ప్లానింగ్‌తో సినిమాలు ఎంచుకుంటున్నాడట. ఇంతకీ ఎన్టీఆర్ ఇచ్చిన సలహా ఏంటి?
ఎన్టీఆర్ సలహా ఇదే?
మ్యాడ్, ఆయ్, మ్యాడ్ స్క్వేర్ వంటి హ్యాట్రిక్ తర్వాత నితిన్ తన కెరీర్‌లో తదుపరి అడుగులు జాగ్రత్తగా వేయాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఒక కీలక సలహా ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతానికి నితిన్‌ను కేవలం రొమాంటిక్ ఎంటర్‌టైనర్ జోనర్‌పైనే ఫోకస్ చేయమని సూచించాడట. ఇప్పట్లో మాస్ లేదా యాక్షన్ జోలికి వెళ్లడం రిస్క్ అవుతుందని, తనకు బాగా సూటైన లవ్ స్టోరీలు మరియు యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లతోనే కెరీర్‌ను కొనసాగించాలని చెప్పాడట టాక్. ఈ సలహా మేరకు నితిన్ కూడా అలాంటి సినిమాలే ఎంచుకుంటు ముందుకెళ్తున్నాడు. నితిన్ ప్రస్తుతం “శ్రీశ్రీశ్రీ రాజవారు” (Sri Sri Sri Raja Vaaru) అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సతీష్ వేగేస్న డైరెక్ట్ చేస్తున్నారు. ఇది కూడా రొమాంటిక్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కతోంది. అలాగే.. ఇటీవల ఒక కొత్త ప్రేమకథకు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా అధికారిక వివరాలు బయటకు రాలేదు, కానీ ఇది కూడా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ జోనర్‌లోనే ఉంటుందని సమాచారం. మొత్తంగా.. నితిన్ కథల ఎంపికలో ఎన్టీఆర్ సలహా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్‌కు ఎన్టీఆర్!
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన మ్యాడ్ స్వ్కేర్ సినిమా. మార్చి 28న రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో.. థియేటర్ల దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 80 కోట్లు క్రాస్ చేసి వంద కోట్ల దిశగా దూసుకుపోతోంది. దీంతో.. మ్యాడ్ స్వ్కేర్ చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేసింది. మ్యాడ్ స్క్వేర్ విజయాన్ని సెలబ్రేట్ చేసేందుకు ఏప్రిల్ 4, 2025 సాయంత్రం, అంటే ఈరోజు సాయంత్రం ఈ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది, ఈ సినిమాలో నటించిన నార్నే నితిన్ ఎన్టీఆర్ బావమరిది కావడం.. రెండవది, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత నాగ వంశీతో ఎన్టీఆర్‌కు ఉన్న సాన్నిహిత్యం. గతంలో “టిల్లు స్క్వేర్” సక్సెస్ ఈవెంట్‌కు కూడా ఎన్టీఆర్ హాజరైన సంగతి తెలిసిందే. ఇప్పుడు “మ్యాడ్ స్క్వేర్” విజయంలో భాగం అవుతున్నాడు.