పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశంలో కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏడాదిలోపే పడిపోతుందంటూ శాపనార్థాలు పెట్టిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం ఉండదంటూ జ్యోతిష్యం చెప్పిన ఆయన.. ఇప్పుడు ఐదేళ్లపాటు ప్రభుత్వానికి ఛాన్స్ ఇద్దామని అంటున్నారట. ఐదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటే ప్రజలే వారి తప్పులు తెలుసుకుని బీఆర్ఎస్ కి ఓటేస్తారని చెబుతున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వంలో లుకలుకలు రావని, ప్రభుత్వాన్ని కూలదోయడం సాధ్యం కాదని తేలిన తర్వాత కేసీఆర్ డైలాగులు మార్చారు. తన వల్లకాదన తేలడంతో తానేదో ఉదారంగా కాంగ్రెస్ కి ఐదేళ్లు పాలించే అవకాశమిచ్చినట్టు మాట్లాడుతున్నారు.
కాంగ్రెస్ రివర్స్ అటాక్..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అనే భ్రమల్లో ఉన్న ఆ పార్టీ నేతలు చివరకు కాంగ్రెస్ విజయంతో తత్వం బోధపడింది. కానీ కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్.. అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా ఏడాది కూడా పాలన కొనసాగించలేదని జోస్యం చెప్పారు. కొంతమంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని కూడా లీకులిచ్చారు. బీఆర్ఎస్ కేవలం రెచ్చగొట్టింది, కానీ కాంగ్రెస్ ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. నిజంగానే బీఆర్ఎస్ నేతల్ని ఇటువైపు ఆకర్షించింది. ఇంకేముంది, ఏడాదిలోపే అని సన్నాయి నొక్కులు నొక్కిన వారు నోరెళ్లబెట్టారు. మా పార్టీ నేతల్ని లాగేసుకుంటారా అంటూ నీతి సూత్రాలు చెప్పారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్న నేతలు.. ఇప్పుడు ఫిరాయింపులు తప్పు అని చెప్పడం హాస్యాస్పదం కాక ఇంకేంటి..?
ఇది అయ్యేలా లేదు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాదు కదా, చివరి ఏడాదిలో కూడా కూలిపోయేలా లేదు అనే విషయం కేసీఆర్ కి అర్థమైంది. దీంతో ఆయన ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. తాజాగా.. బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశాల్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పతనాన్ని మనం కోరుకోవొద్దంటూ ఆయన బీఆర్ఎస్ శ్రేణులకు ఉపదేశమిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల పూర్తికాలం అధికారంలో కొనసాగితేనే.. మనం చేసిన మంచి ఏమిటో ప్రజలకు తెలుస్తుందని అంటున్నారు కేసీఆర్. కాంగ్రెస్ పనితీరుపై ప్రజలు ఇప్పటికే విసిగిపోయారని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు ఖాయంగా వస్తాయని, ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని అంటున్నారు కేసీఆర్. కాంగ్రెస్ హామీలు అమలు చేయకపోవడంతో జనంలో తిరుగుబాటు మొదలైందని చెబుతున్నారాయన.
ప్రజల్లో ఉండండి..
బీర్‌ఎస్ నేతలు అనునిత్యం ప్రజాక్షేత్రంలో అందుబాటులో ఉండాలని ఉపదేశమిచ్చారు కేసీఆర్. అప్పుడే పార్టీపై సానుకూలత పెరుగుతుందని అంటున్నారాయన. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఆయన వెర్షన్ మరోలా ఉండేది. నేతల్ని చూసి కాకుండా, కేవలం తనను చూసి ప్రజలు ఓట్లు వేస్తారనేది ఆయన ప్రగాఢ విశ్వాసం. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన ఆయన, ఒకచోట దారుణంగా ఓడిపోవడంతో.. ఆయనకు కూడా కాస్తో కూస్తో జ్ఞానోదయం అయినట్టుంది. అందుకే పార్టీ నేతల్ని ప్రజల్లో ఉండండి అంటూ ఉపదేశిస్తున్నారు. కాంగ్రెస్ పదవీకాలం పూర్తయ్యే వరకు అసెంబ్లీ ఎన్నికలు రావనే విషయంలో మాత్రం ఆయన క్లారిటీతో ఉన్నారు.