Junaid Khan: ఒక స్టార్ హీరో వారసుడు కూడా స్టార్ హీరో అవ్వడం పెద్దగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమీ కాదు. కానీ అలా వారసులుగా వచ్చిన వారిలో చాలా తక్కువమంది మాత్రమే ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకోగలుగుతారు. కానీ చాలావరకు నెపో కిడ్స్ అనే ట్యాగ్‌తో నెగిటివిటీనే దక్కించుకుంటారు. ఇప్పుడు ఆ నెపో కిడ్స్ కేటగిరిలో నుండి మరొక వారసుడు హీరోగా బాలీవుడ్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. తనే అమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్. ఇప్పటికే ఒక వెబ్ ఫిల్మ్‌తో హీరోగా పరిచయమయిన జునైద్.. మొదటిసారి హీరోగా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యాడు. తాజాగా తను నెపో కిడ్ కావడంతో తనపై వచ్చే నెగిటివిటీపై స్పందించాడు జునైద్.
ప్రమోషన్స్‌లో బిజీ
నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా విడుదలయిన ‘మహారాజ్’ అనే మూవీతో హీరోగా పరిచయమయ్యాడు అమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్. ఈ మూవీతో హీరోగా డెబ్యూ చేసినా కూడా తనను ప్రేక్షకులు వెండితెరపై చూడలేదు. అందుకే ‘లవ్‌యాపా’ (Loveyapa) సినిమాతో మొదటిసారి థియేటర్లలో సందడి చేయనున్నాడు. జునైద్ ఖాన్ (Junaid Khan), ఖుషి కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘లవ్‌యాపా’ మూవీ ఫిబ్రవరీ 7న విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం కోసం జునైద్, ఖుషి బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో వీరిద్దరూ నెపో కిడ్స్ అవ్వడంపై స్పందించారు జునైద్, ఖుషి.
నా కుటుంబం వల్లే
‘‘నాకు ఎవరూ ఏదీ నెగిటివ్‌గా మొహం మీద చెప్పలేదు. నేను సోషల్ మీడియాలో లేను. కాబట్టి నాకు అసలు ఐడియానే లేదు. నేను పబ్లిక్‌లో కనిపించకపోయినా నిర్మాతలు నాపై నమ్మకంతో నన్ను క్యాస్ట్ చేసుకుంటారు. ఎక్కువమంది యాక్టర్లకు అలాంటి అవకాశం లేదు. దానికి నా కుటుంబం కూడా కారణం అయ్యిండొచ్చు’’ అంటూ తనపై నెగిటివ్ కామెంట్స్ వచ్చినా సోషల్ మీడియాలో అకౌంట్ లేకపోవడం వల్ల అవి తన వరకు రావడం లేదని చెప్పేశాడు జునైద్ ఖాన్. ఇక ఖుషి కపూర్ (Khushi Kapoor) కూడా జునైద్ మాటలతో అంగీకరించింది. ‘‘మేము చాలా కృతజ్ఞత చూపించే స్థానంలో ఉన్నాం. అందుకే దేని గురించి ఫిర్యాదు చేయాలని అనుకోవడం లేదు. నాకు ఇలా సంతోషంగానే ఉంది’’ అని తెలిపింది.
Also Read: స్టేజ్‌పైనే ఏడ్చేసిన సోనమ్ కపూర్.. అతడి జ్ఞాపకాలను మర్చిపోలేక.!
హిట్ రీమేక్
జునైద్ ఖాన్‌కు మాత్రమే కాదు.. ఖుషి కపూర్‌కు కూడా థియేటర్లలో ఇదే మొదటి సినిమా. హీరో, హీరోయిన్‌గా వీరిద్దరూ వెబ్ సినిమాల్లో నటించారు. కానీ థియేటర్లలో మాత్రం వీరి సినిమాలు విడుదల కాలేదు. అలా మొదటిసారి వీరిద్దరూ కలిసి ‘లవ్‌యాపా’తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలయిన టీజర్, ట్రైలర్, పాటలు కాస్త పరవాలేదనిపించాయి. తమిళంలో సైలెంట్‌గా వచ్చి బ్లాక్‌బస్టర్ అందుకున్న ‘లవ్ టుడే’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిందే ‘లవ్‌యాపా’. యూత్‌కు బాగా కనెక్ట్ అయిన సినిమాను రీమేక్ చేస్తున్నారు కాబట్టి ‘లవ్‌యాపా’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.