Tanikella Bharani: తనికెళ్ల భరణి (Tanikella Bharani).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు పలు కీలక పాత్రలు చేసి మెప్పించిన ఈయన.. ఆ తర్వాత విలన్ గా నటించి ఆకట్టుకున్నారు. నటుడుగానే కాకుండా తన పాటలతో శివతత్వాన్ని సరికొత్తగా భక్తులకు పరిచయం చేసిన ఘనులు కూడా అని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా ఈయన మరొకసారి తన భక్తిని చాటుకున్నారు. అందులో భాగంగానే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ (Anudeep dev) మ్యూజికల్స్ లో ఆవిష్కరించిన ‘కైలాసవాసా శివ’ పాటను ఆవిష్కరించారు. హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ వేదికగా సోమవారం జరిగిన ఆడియో లాంచ్ లో పాల్గొని, ఈ పాటను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తనికెళ్ల భరణి, సినీతారలు నిహారిక కొనిదెల (Niharika konidela) , శ్రీనివాస్ అవసరాల (Srinivas avasarala) కూడా పాల్గొన్నారు.
ఈ పాట వింటే మళ్లీ కాశీకి వెళ్ళాలనిపిస్తుంది – తనికెళ్ల భరణి
ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. “ఈ పాట వింటే భావోద్వేగానికి లోనయి కచ్చితంగా కాశీకి వెళ్లాలనిపిస్తుంది. ఈ పాట విన్న తర్వాత నాకే మళ్లీ ఒకసారి కాశీకి వెళ్లాలనిపించింది. ఆసియాలోని అత్యంత ప్రాచీన నగరం కాశీ . ఎలాంటి మార్పు లేకుండా అలాగే ఉంటుంది. అక్కడికి వెళ్లి చూసి తరిస్తేనే కాశీని మనం ఆస్వాదించగలం. కాశీ సాహిత్యానికి సంబంధించి తెలుగులో మొదటిసారిగా ‘కాశీయాత్ర చరిత్ర’ ను ఏనుగుల వీరస్వామి రాశారు. కాశీ వెళ్లాలి అంటే శివుడి ఆజ్ఞ, మన సంకల్పం రెండు ఖచ్చితంగా ఉండాలి. ‘శభాష్ రా శంక’ అని నేను శివ తత్వాన్ని రాసినట్టుగా.. కాశీ పోవడం అంటే మనలోని మలినం, అహం కాలిపోవడమే. అటు అనుదీప్ సంగీత దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా బాగా చేశారు. నాకే తనతో సినిమా తీయాలనిపించింది” అంటూ అనుదీప్ పై ప్రశంసల వర్షం కురిపించారు తనికెళ్ల భరణి.
శివుడి అనుమతి ఉంటేనే కాశీ – వారణాసి వెళ్తాము – అనుదీప్ దేవ్
అనుదీప్ దేవ్ మాట్లాడుతూ.. ఈ పాటను మూడేళ్ల క్రితమే కంపోజ్ చేశాను. ఇలా అద్భుతమైన పాట చిత్రీకరించి విడుదల చేసే మంచి సమయం కోసమే ఇన్ని రోజులు ఎదురు చూశాను. కైలాసవాసా శివ అంటూ వచ్చిన ఈ పాట అందరి హృదయాలను దోచుకుంటుంది. నిజానికి ఈ పాటను కుంభమేళాకు వెళ్లి చేద్దామనుకున్నాను. కానీ జనాలు ఎక్కువగా ఉండడంతో నెలరోజుల తర్వాత వెళ్లి షూట్ చేసాము. శివుడి అనుమతి ఉంటేనే కాశీ – వారణాసి వెళ్తామనే విషయాన్ని మరొకసారి ఈ పాట ప్రతిబింబించేలా రూపొందించడం జరిగింది. ఇక తెలుగు ప్రైవేట్ ఆల్బమ్స్ పాటల్లో ఈ పాట కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను.. ఈ పాటను తెలుగు , హిందీ భాషల్లో విజయ్ ప్రకాష్ ఆలపించారు. లిరిక్స్ కిట్టు మంచి మంచి తెలుగు పదాలు వాడి రాయడంలో ఆయనకు ఆయనే సాటి. మా ప్రయత్నానికి ఎస్ఆర్డి సంస్థ ఆర్థిక సహాయం అందించింది” అంటూ తెలిపారు.
ఈ పాటతో ఒక కథ చెప్పాము.. డైరెక్టర్
ఇక ఈ పాట డైరెక్టర్ నాగ్ అర్జున్ రెడ్డి మాట్లాడుతూ.. నువ్వే దిక్కని శివుడిని నమ్ముకున్న వారు నిత్యజీవితంలో ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారందరికీ ఈ పాట కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఈ పాటను నాలుగు రోజుల్లో చేశాము. ఈ పాటలతో ఒక కథ చెప్పాము. దానిని చూసి తరించాలని అనుకుంటున్నాము అంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో హర్షిత రెడ్డి, కమిటీ కుర్రోళ్ళు సినిమా బృందం తో పాటు యదు వంశీ, మాలిక్ రామ్, బివిఎస్ రవి తదితరులు పాల్గొన్నారు.
ALSO READ:Honeymoon Murder Case : హనీమూన్‌లో భర్తను చంపేసిన భార్య.. ఈ కథతో సినిమా చేస్తున్న స్టార్ హీరో!