Kamal Haasan : ‘లోక నాయకుడి’గా పేరు సొంతం చేసుకున్న కమలహాసన్(Kamal Haasan) 38 ఏళ్ల తర్వాత ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం(Maniratnam ) దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘థగ్ లైఫ్’. జూన్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో శింబు(Simbu ), త్రిష (Trisha) తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో గత నెల ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈవెంట్ లో భాగంగా కమల్ హాసన్ కన్నడ భాష గురించి చులకన చేసి మాట్లాడి వివాదంలో ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే. “తమిళం నుండి కన్నడ భాష పుట్టింది” అని చెప్పి కన్నడిగుల కోపానికి బలయ్యారు.దీంతో కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా మూవీని విడుదల చేసేదే లేదు అని, కన్నడ ఫిలిం ఛాంబర్ ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెబుతోంది. అంతేకాదు కన్నడ భాషను తక్కువ చేసి మాట్లాడినందుకు కమల్ హాసన్ క్షమాపణలు చెబితేనే సినిమాని కన్నడలో రిలీజ్ చేయిస్తామని, లేకపోతే సినిమాని కన్నడలో రిలీజ్ చేయడానికి ఒప్పుకోమని కన్నడ సినీ పెద్దలు స్పష్టం చేశారు.దీంతో మరో రెండు రోజుల్లో థగ్ లైఫ్ మూవీ విడుదల కాబోతున్న నేపథ్యంలో.. కన్నడలో థగ్ లైఫ్ సినిమాని విడుదల చేయకపోతే చిత్ర నిర్మాతలకు దాదాపు రూ.20 కోట్ల వరకూ నష్టం వస్తుంది అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
థగ్ లైఫ్ వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన కమల్ హాసన్
ఇలాంటి నేపథ్యంలో కమల్ హాసన్ తాజాగా కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టుని ఆశ్రయించి కన్నడలో తన సినిమా విడుదల అయ్యేలా చూడాలని, అలాగే తనకు రక్షణ కల్పించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక ఈ ఫిర్యాదులో ప్రతి వాదులుగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కన్నడ ఫిలిం ఛాంబర్ అలాగే ఇతర సంస్థలను కూడా చేర్చారు. అంతేకాకుండా తన సినిమా విడుదలయ్యే ముందు తగిన భద్రత కూడా కల్పించేలా సిటీ పోలీస్ కమిషనర్ కు,డిజిపి కి కూడా సూచనలు జారీ చేయాలని కమల్ హాసన్ తన ఫిర్యాదులో కోరారు. అయితే కమల్ హాసన్ హైకోర్టును ఆశ్రయించినా కూడా కన్నడ సినీ పెద్దలు తగ్గడం లేదు. కమల్ హాసన్ కన్నడ భాషని కించపర్చినందుకు క్షమాపణలు చెబితేనే సినిమా విడుదల చేసుకోవడానికి అనుమతి ఇస్తామని, లేకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని తేల్చి చెబుతున్నారు.
ఈగో పీక్స్ కి చేరింది.. న్యాయం జరిగేనా?
ఇక కమల్ హాసన్ తాను మాట్లాడిన ఈ మాటలపై ఇప్పటి వరకు క్షమాపణలు చెప్పలేదు. క్షమాపణలు చెప్పలేదు సరి కదా నేను కన్నడ భాష మీద ప్రేమతోనే అలా అన్నానని ప్రేమతో మాట్లాడిన మాటలకి క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదు అంటూ స్పందించారు. మరి కమల్ హాసన్ సినిమా కోసం వెనక్కి తగ్గి క్షమాపణలు చెబుతారా? లేదా? అనేది చూడాలి. అయితే దేశవ్యాప్తంగా జూన్ 5న థగ్ లైఫ్ మూవీ విడుదల కాబోతున్న నేపథ్యంలో కర్ణాటకలో ఈ సినిమాపై బ్యాన్ విధించడంతో చిత్ర యూనిట్ ఇబ్బందుల్లో పడింది. అలాగే ఈ విషయంపై హైకోర్టుని కమల్ హాసన్ ఆశ్రయించడంతో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందా అనే ఉత్కంఠ కూడా చాలామందిలో ఉంది. మొత్తానికైతే ఒక్క ఈగో కారణంగా క్షమాపణ చెప్పకుండా ఇప్పుడు హైకోర్టుని ఆశ్రయించిన కమలహాసన్ కి ఎలాంటి న్యాయం లభిస్తుంది చూడాలి.
ALSO READ:Rajendra Prasad : ‘దాన్ని’ అని తిట్టినా.. నో అబ్జెక్షనా? రోజా మౌనం వెనక మర్మం ఏంటి?