Kasthuri Arrested:సినీ నటి కస్తూరి శంకర్ (Kasthuri Shankar)సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియా వేదికగా తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాలపై స్పందిస్తూ.. వివాదాల్లో ఇరుక్కుంటుంది. అలాగే మరొకవైపు సినిమా విషయాలతో పాటు ఇతర విషయాలపై కూడా స్పందిస్తూ.. వివాదాస్పద నటిగా పేరు దక్కించుకుంది. ఇలా నిత్యం వివాదాల ద్వారా వార్తల్లో నిలిచే కస్తూరి శంకర్ గత వారం క్రితం తెలుగు వారి పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలుగు సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.
తెలుగువారిపై కస్తూరి శంకర్ అనుచిత వ్యాఖ్యలు..
తెలుగువారిని తక్కువ చేసి మాట్లాడడంతో సహించలేకపోతున్న తెలుగు సంఘాలు.. ఈమెపై పలుచోట్ల పోలీస్ కేసు కూడా పెట్టారు. ఈనెల 3న చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన కస్తూరి శంకర్..” 300 సంవత్సరాల క్రితం ఒక రాజు వద్ద.. అంతఃపురంలోని మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు ఇక్కడికి వలస వచ్చారు. ప్రస్తుతం మాది తమిళజాతి అంటున్నారు. ఎప్పుడో ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరు..? అంటూ ద్రవిడ సిద్ధాంత వాదులపై అనుచిత వ్యాఖ్యలు చేసింది కస్తూరి శంకర్.. ఒక రకంగా చెప్పాలి అంటే ఈమె తెలుగు బ్రాహ్మణులకు అండగా నిలిచింది కానీ తెలుగువారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపైనే తెలుగు సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతూ ఈమె పట్ల పోలీస్ కేసు నమోదు చేశారు.
క్షమాపణలు కోరిన కస్తూరీ శంకర్..
అయితే వెంటనే స్పందించిన కస్తూరీ..తన ఉద్దేశం అది కాదని, బహిరంగంగా క్షమాపణలు చెప్పినప్పటికీ ఈమె పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కస్తూరి ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసినా.. హైకోర్టు ఈమె బెయిల్ నిరాకరించింది. దీంతో చెన్నైలో ఉన్న ఇంటికి తాళం వేసి ,ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉంది. అయితే తాజాగా ఈమె కోసం గాలింపు చేపట్టిన పోలీసులు నిన్న హైదరాబాదులో అరెస్టు చేశారు. హైదరాబాదులో అరెస్ట్ అయిన కస్తూరి శంకర్ ను పోలీసులు చెన్నై తీసుకెళ్లారు. ఇక చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు ఈనెల 29 వరకు రిమాండ్ విధించింది. అంటే మొత్తం 13 రోజులు ఈమెను రిమాండ్ లో ఉంచ బోతున్నారు అన్నమాట. ప్రస్తుతం కస్తూరి శంకర్ ను ఫుఝల్ సెంట్రల్ జైలుకి తరలించారు. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాలే కాదు సీరియల్స్ కూడా..
కస్తూరి శంకర్ విషయానికొస్తే.. నాగార్జున (Nagarjuna)హీరోగా నటించిన ‘అన్నమయ్య’ సినిమా ద్వారా సెకండ్ హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది కస్తూరీ శంకర్. ఇందులో రమ్యకృష్ణ (Ramya Krishna) హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే అందరి మనసులు దోచుకున్న ఈమె, ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి మెప్పించింది. కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి.. తెలుగులో స్టార్ స్టేటస్ ను అందుకొని, ఇప్పుడు తెలుగు వారిపైనే ఇలాంటి కామెంట్ చేయడంతో తెలుగు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇకపోతే సినిమాలే కాదు సీరియల్స్ లో కూడా నటిస్తూ తెలుగు బుల్లితెర ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది.