Balachandra Menon : సీనియర్ నటుడు, దర్శకుడు బాలచంద్ర మీనన్ (Balachandra Menon) లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఊరట లభించింది.
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారనే ఆరోపణ నేపథ్యంలో జస్టిస్ హేమ కమిటీ నివేదిక సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో ఎంతోమంది ప్రముఖుల ముసుగులో అమ్మాయిలతో అనుచితంగా వ్యవహరిస్తున్న పెద్ద మనుషుల పేర్లు బయటకు వచ్చాయి. హేమ కమిటీ నివేదిక అలా బయట పడిందో లేదో, చాలామంది నటీమణులు గతంలో తమకు కూడా వేధింపులు ఎదురయ్యాయి అంటూ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే 2007లో ఓ సినిమా షూటింగ్ సందర్భంగా డైరెక్టర్ బాలచంద్ర మీనన్ (Balachandra Menon) తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఓ నటి రీసెంట్ గా కంప్లైంట్ చేసింది. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదయింది.
దీంతో డైరెక్టర్ బాలచంద్ర మీనన్ (Balachandra Menon) 2007లో జరిగిన ఘటనకు సంబంధించి 17 ఏళ్ల తర్వాత కంప్లైంట్ చేశారని గుర్తు చేస్తూ, తన ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ డైరెక్టర్ వాదనలో బలం ఉందంటూ ఊహించని కామెంట్స్ చేశారు. “40 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన… ఇప్పటికే రెండు జాతీయ అవార్డులు అందుకోవడంతో పాటు, ఆయనను ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించిందని గుర్తు చేశారు. అయితే 17 ఏళ్ల తర్వాత మహిళ కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు అయిందని చెబుతూనే, దానిపై విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు న్యాయమూర్తి. అయితే కేవలం గౌరవ, మర్యాదలు అనేవి మహిళలకు మాత్రమే కాదు… పురుషులకు కూడా ఉంటాయనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి” అని ఈ సందర్భంగా న్యాయమూర్తి చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా న్యాయ ప్రయోజనాల దృష్ట్యా పిటిషనర్ బాలచంద్ర మీనన్ (Balachandra Menon) కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నామంటూ న్యాయ స్థానం తీర్పునిచ్చింది. అలాగే కేసుకు సంబంధించిన విచారణకు హాజరు కావాలని ఈ సందర్భంగా మీనన్ ను కోర్టు ఆదేశించింది. ఈ విచారణ తర్వాత ఒకవేళ మీనన్ ను అరెస్టు చేయాలని సంబంధిత అధికారి ప్రతిపాదిస్తే… రూ. 50 వేల బాండు, ఇద్దరు పూచికత్తుతో అతనిని రిలీజ్ చేయాలని ఆదేశించడం సంచలనంగా మారింది. ఏదేమైనా లైంగిక వేధింపుల కేసులో డైరెక్టర్ కు కేరళ హైకోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పుతో భారీ ఊరట లభించినట్టుగా అయింది.
ఇదిలా ఉండగా నటి ఇచ్చిన కంప్లయింట్ ఆధారంగా బాలచంద్ర మీనన్ (Balachandra Menon) పై సెక్షన్ 354 (నటిని అగౌరవపరిచే ఉద్దేశ్యంతో నేరపూరితంగా, బలవంతంగా దాడి చేయడం), 509 (మహిళను అవమానించేలా మాటలు, చేష్టలు), 506 (నేరపూరిత బెదిరింపు) కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. నిజానికి మీనన్ ను అక్టోబరు 30న అరెస్టు చేయాల్సి ఉంది. కానీ ఆయన మధ్యంతర బెయిల్ తెచ్చుకుంటూ కేసును ఇప్పటి వరకు పొడిగించారు.
కాగా 2017లో నటిపై దాడి కేసు తర్వాత కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసింది. చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఫిర్యాదులపై ఆ కమిటీ పూర్తి నివేదికను కేరళ హైకోర్టు ముందు ఉంచింది.