Pushpa 2 Canteen Bill Fight| దేశవ్యాప్తంగా పుష్ప 2 – ది రూల్ సంచలనం సృష్టిస్తోంది. సినిమా చూడడానికి థియేటర్ల వద్దకు ప్రేక్షకులు వరదలా వస్తున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో అన్ని రాష్ట్రాల్లో మాస్, క్లాస్ అని తేడా లేకుండా అన్ని రకాల ఆడియన్స్ నుంచి అల్లు అర్జున్ నటనకు ఫుల్ మార్కులు పడుతున్నాయి. ఈ క్రమంలో పుష్ప – 2 సినిమా ప్లే చేస్తున్న థియేటర్ల వద్ద గొడవలు కూడా జరుగుతున్నాయి. తాజాగా సినిమా చూడడానికి వెళ్లిన ఒక ప్రేక్షకుడి చెవిని ఆ థియేటర్ ఓనర్ చితకబాదాడు.. అతని చెవి కొరికేసాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన నగరమైన గ్వాలియర్ లో నివసించే షబ్బీర్ అనే 32 ఏళ్ల యువకుడు పుష్ప – 2 సినిమా చూడడానికి ఆదివారం డిసెంబర్ 8, 2024న థియేటర్ కు వెళ్లాడు. గ్వాలియర్ నగరంలోని ఇందర్ గంజ్ ప్రాంతం కైలాశ్ థియేటర్ లో పుష్ప 2 స్క్రీనింగ్ జరుగుతోంది. సాయంత్రం షోకు షబ్బీర్ వెళ్లాడు. అయితే థియేటర్ హౌస్ ఫుల్ షో పడింది. దీంతో సినిమా ఇంటర్వెల్ సమయంలో క్యాంటీన్ వద్ద భారీగా రష్ ఉంది.
సినిమా చూడడానికి వెళ్లిన షబ్బీర్ కూడా ఇంటర్వెల్ సమయంలో క్యాంటీన్ వెళ్లాడు. అక్కడ పాప్ కార్న్, స్నాక్స్ కూల్ డ్రింక్స్ తీసుకున్నాడు. కానీ క్యాంటీన్ సిబ్బంది అతడు డబ్బులు చెల్లించలేదని చెప్పగా.. షబ్బీర మాత్రం తాను ముందుగానే డబ్బులు చెల్లించేశానని.. ఆ తరువాత తనకు స్నాక్స్, కూల్ డ్రింక్స్ ఇచ్చారని చెప్పాడు. క్యాంటీన్ సిబ్బంది మాత్రం అతడిని నమ్మలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంటర్వెల్ అయిపోయినా షబ్బీర్ ని మాత్రం సిబ్బంది అక్కడి నుంచి వెళ్లనివ్వలేదు.
Also Read: భార్య పిల్లలను వదిలి ఆత్మహత్య చేసుకున్న యువకుడు.. 3 నెలల తరువాత ప్రియురాలితో
అందరూ వెళ్లాక షబ్బీర్ తాను సినిమా చూడడానికి వెళ్లాలని ప్రయత్నించినా క్యాంటీన్ సిబ్బంది అడ్డుపడి అతడిని బలవంతంగా అక్కడే నిలబెట్టారు. షబ్బీర్ దీంతో ఆగ్రహం చెందిన వారిని తోశాడు. ఈ కారణంగా క్యాంటీన్ సిబ్బందిలో ముగ్గురు వ్యక్తులు అతడిని కొట్టారు. ఈ ఘర్షణ పెద్దది కావడంతో క్యాంటీన్ ఓనర్ రాజు అక్కడికి వచ్చి.. ఏం జరిగిందని ఆరా తీశాడు. అయితే అతను కూడా తన సిబ్బంది చెప్పిందే నమ్మి.. షబ్బీర్ వెంటనే డబ్బులు చెల్లించి వెళ్లిపోవాలన్నాడు. కానీ షబ్బీర్ మాత్రం తాను ముందుగానే చెల్లించేశానని వాదించాడు. దీంతో క్యాంటీన్ ఓనర్ రాజు కూడా షబ్బీర్ ని బూతులు తిట్టి.. కొట్టాడు. దీంతో షబ్బీర్ తిరిగి దాడి చేశాడు.
ఆ సమయంలో రాజు తన ముగ్గురు సిబ్బందితో కలిసి షబ్బీర్ ని మళ్లీ కొట్టడం ప్రారంభించారు. ఈ క్రమంలో షబ్బీర్.. గట్టిగా రాజుని పట్టుకున్నాడు. దీంతో క్యాంటీన్ ఓనర్ రాజు.. షబ్బీర్ చెవిని తన పళ్లతో గట్టిగా కొరికేశాడు. షబ్బీర్ ని చితకబాది అతని జేబులో నుంచి డబ్బులు లాగేసుకొని పంపించారు.
షబ్బీర్ అక్కడి నుంచి నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. పోలీసులు షబ్బీర గాయాలు చూసి.. అతనికి వైద్య పరీక్షలు చేయించారు. షబ్బీర్ ఫిర్యాదుపై క్యాంటీన్ ఓనర్ రాజు, అతని ముగ్గురు సిబ్బందిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఇందర్ గంజ్ పోలీసులు తెలిపారు.
మరోవైపు డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప -2 సినిమా బాక్సాఫీస్ వద్ద వేయి కోట్ల కలెక్షన్లు సాధించి.. బాలీవుడ్ సినిమాల రికార్డులు బద్దలుకొడుతోంది.