Jyoti poorvaj: తెలుగు బుల్లితెరపై ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో జగతి మేడమ్‌గా అద్భుత నటనతో ఆకట్టుకున్న జ్యోతి రాయ్, ఇప్పుడు సినిమాల్లో సంచలనం సృష్టిస్తోంది. సీరియల్‌లో తల్లి పాత్రలో అలరించిన జ్యోతి, తాజాగా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’ సినిమా గ్లింప్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ గ్లింప్స్‌లో ఆమె స్టైలిష్ లుక్, గ్లామర్, యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులను అవాక్కయ్యేలా చేశాయి. అంతేకాదు, ఇటీవల విడుదలైన ‘కిల్లర్’ బిహైండ్-ది-సీన్స్ వీడియో జ్యోతి రాయ్ ఫైటింగ్ సీన్స్‌ను హైలైట్ చేస్తూ సినిమాపై హైప్ మరింత పెంచింది.
సీరియల్‌కి మధ్యలో గుడ్‌బై చెప్పి…
‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో జగతి పాత్రలో జ్యోతి రాయ్ చూపిన నటన అందరి మనసులనూ గెలుచుకుంది. హీరో తల్లి పాత్రలో నటించినప్పటికీ, ఆమె వయసు, గాంభీర్యం, నటనా నైపుణ్యం సీరియల్‌కి ప్రత్యేక ఆకర్షణను తెచ్చాయి. సీరియల్ హిట్ కావడానికి జగతి పాత్ర కీలకం కాగా, జ్యోతి రాయ్ కూడా తెలుగు ఆడియన్స్‌లో భారీ క్రేజ్ సంపాదించింది. అయితే, సీరియల్‌కి మధ్యలో గుడ్‌బై చెప్పి, సినిమాలు, వెబ్ సిరీస్‌లపై దృష్టి సారించింది. సీరియల్స్ చేస్తూ సినిమా షూటింగ్‌లకు డేట్స్ కేటాయించలేకపోవడమే ఈ నిర్ణయానికి కారణమని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
తాజాగా విడుదలైన ‘కిల్లర్’ సినిమా గ్లింప్స్ సినీ ప్రేమికులను, జ్యోతి రాయ్ అభిమానులను ఆకట్టుకుంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జ్యోతి రాయ్ లవర్ సుకు పూర్వజ్ డైరెక్ట్ చేస్తున్నారు. జ్యోతి రాయ్ పాత్రను “రాయ్… ఒక సాధారణ మనిషి, కానీ అసాధారణంగా మారబోతుంది” అంటూ పరిచయం చేసిన విధానం చాలా ఆకర్షణీయంగా ఉంది. గ్లింప్స్‌లో ఆమె మొదట సాధారణంగా కనిపించినా, తర్వాత వయలెంట్ మోడ్‌లోకి మారి కారులో ఎవరినో పొడిచే సన్నివేశం షాకింగ్‌గా ఉంది. గన్స్ పట్టుకొని ఫైట్స్ చేస్తూ, స్టైలిష్ లుక్‌లో జ్యోతి రాయ్ అదరగొట్టింది. చివర్లో సుకు పూర్వజ్ “మొదలెడదామా?” అంటూ గ్లింప్స్‌ను ముగించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
బిహైండ్-ది-సీన్స్ వీడియో.. జగతి ఫైటింగ్ సీన్స్‌తో సంచలనం
‘కిల్లర్’ సినిమా గ్లింప్స్‌తో అభిమానులను ఆకర్షించిన జ్యోతి రాయ్, ఇప్పుడు విడుదలైన బిహైండ్-ది-సీన్స్ (BTS) వీడియోతో మరోసారి సంచలనం సృష్టించింది. ఈ BTS వీడియోలో జ్యోతి రాయ్ చేసిన ఫైటింగ్ సీన్స్‌కు సంబంధించిన షూటింగ్ విశేషాలను చూపించారు. గన్స్‌తో యాక్షన్ సీక్వెన్స్‌లు, కారు చేజింగ్ సన్నివేశాలు, స్టంట్స్‌ను జ్యోతి ఎంత కష్టపడి చేసిందో ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. జగతి మేడమ్‌గా సాంప్రదాయ లుక్‌లో కనిపించిన జ్యోతి, ఈ యాక్షన్ సీన్స్ కోసం తీవ్రమైన శిక్షణ తీసుకున్నట్లు BTS వీడియో ద్వారా తెలుస్తోంది.
వీడియోలో డైరెక్టర్ సుకు పూర్వజ్ జ్యోతి రాయ్‌తో కలిసి సన్నివేశాలను చర్చిస్తూ, షాట్స్‌ను ఎలా ప్లాన్ చేశారో చూపించారు. ఒక సన్నివేశంలో జ్యోతి గన్‌తో ఫైట్ చేస్తూ, అదే సమయంలో స్టైలిష్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం అభిమానులను ఆకట్టుకుంది. BTS వీడియోలో జ్యోతి రాయ్ కఠినమైన షూటింగ్ పరిస్థితుల్లోనూ నవ్వుతూ, ఉత్సాహంగా పనిచేసిన తీరు ఆమె డెడికేషన్‌ను తెలియజేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, “జగతి ఆంటీ ఫైట్స్‌లో రియల్ కిల్లర్!” అంటూ ఫ్యాన్స్ కామెంట్స్‌తో హోరెత్తిస్తోంది.