Kiran Abbavaram: ఈమధ్యకాలంలో చాలావరకు సినిమాలు చెప్పిన తేదీకి విడుదల అవ్వడం లేదు. షూటింగ్ మొదలవ్వగానే ఫలానా రోజు ఈ మూవీ విడుదల అవుతుందని మేకర్స్ ముందుగానే ప్రకటిస్తున్నారు. కానీ చివరి నిమిషంలో ప్రతీ మూవీ పోస్ట్‌పోన్ అవ్వక తప్పడం లేదు. సీనియర్ హీరో, యంగ్ హీరో అని తేడా లేకుండా ప్రతీ హీరో సినిమా చెప్పిన తేదీకి విడుదల అవ్వదు అనే విషయాన్ని ప్రేక్షకులు బలంగా ఫిక్స్ అయిపోతున్నారు. ఇక చెప్పిన తేదీకి కాకుండా విడుదల తేదీని వాయిదా వేసుకునే హీరోల లిస్ట్‌లో కిరణ్ అబ్బవరం కూడా యాడ్ అవ్వనున్నాడు. వాలెంటైన్స్ డేకు విడుదల కావాల్సిన తన అప్‌కమింగ్ మూవీ వాయిదా పడనుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
వాలెంటైన్స్ డే స్పెషల్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ముందుగా ‘రాజావారు రాణిగారు’ అనే ప్రేమకథతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కానీ ఆ తర్వాత పెద్దగా ప్రేమకథల వైపుకు వెళ్లలేదు. ఎక్కువగా కమర్షియల్ సినిమాలతోనే ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నించాడు. పైగా బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ సినిమాలతోనే రావడంతో ఆడియన్స్‌కు కూడా కిరణ్ సినిమాలంటే బోర్ కొట్టేశాయి. అందుకే టైమ్ తీసుకున్నాడు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘క’తో వచ్చి మంచి హిట్ కొట్టాడు. ఇప్పుడు అదే జోష్‌లో ఒక ప్రేమకథతో అందరినీ మెప్పించడానికి సిద్ధమయ్యాడు. అదే ‘దిల్‌రుబా’. వాలెంటైన్స్ డే సందర్బంగా ‘దిల్‌రుబా’ విడుదల కానుందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు.
వారం రోజులు లేటు
వాలెంటైన్స్ సందర్భంగా ఒక మంచి లవ్ మూవీ విడుదలయ్యి, దానికి కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా మంచి కలెక్షన్స్ రావడం ఖాయం. ‘దిల్‌రుబా’ (Dilruba) మేకర్స్ కూడా అదే ప్లాన్ చేశారనుకుంటా. అందుకే ఈ మూవీ ఫిబ్రవరి 14న విడుదల అవుతుందని ప్రకటించారు. కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న కథనాల ప్రకారం ‘దిల్‌రుబా’ మూవీ ఫిబ్రవరి 14న విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ముందు అనుకున్న దానికంటే ఒక వారం రోజులు.. అంటే ఫిబ్రవరి 21న ఈ మూవీ రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. మొత్తానికి ఈ సినిమా వాలెంటైన్స్ డేకు వస్తుందా రాదా అనే విషయాన్ని మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Also Read: థియేటర్‌లో ఏడ్చేశాను, ఇంకొక్క సినిమా కూడా చేయకూడదు అనుకున్నా.. హీరోయిన్ కామెంట్స్
యూత్‌ను ఆకట్టుకునేలా
విశ్వ కరుణ్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన సినిమానే ‘దిల్‌రుబా’. ఇందులో కిరణ్‌కు జోడీగా రుక్సర్ ధిల్లోన్ (Rukshar Dhillon) నటించింది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలయిన టీజర్, పాటలు.. అన్నీ యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. కిరణ్ అబ్బవరంను మళ్లీ లవర్ బాయ్‌గా చూడాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ‘దిల్‌రుబా’ గురించి అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ మూవీ వాలెంటైన్స్ డేకు విడుదల అయ్యింటే కచ్చితంగా చాలా ప్లస్ అయ్యేదని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్‌పోన్ అయ్యిందని వార్తలు వైరల్ అవుతున్నా మూవీ టీమ్ మాత్రం దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.