BigTV English

Sambhaji Maharaj : శివాజీ మహారాజ్ కొడుకా మజాకానా – ఈ విషయాలు తెలిస్తే రోమాలు నిక్కపొడుస్తాయ్..

Sambhaji Maharaj : శివాజీ మహారాజ్ కొడుకా మజాకానా – ఈ విషయాలు తెలిస్తే రోమాలు నిక్కపొడుస్తాయ్..

Sambhaji Maharaj : ఇప్పుడు దేశంలో మరాఠ యోధుడు, హిందూ సామ్రాజ వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ, అతని కొడుకు ఛత్రపతి శంభాజీ మహారాజ్ ల గురించి తీవ్రంగా చర్చ జరుగుతోంది. మహారాష్ట్రలో మొదలై.. అఖండ భారతావనిలో తన ఉనికిని చాటుకున్న ఈ యోధుల చరిత్రను “ఛావా” పేరుతో సిల్వర్ స్క్రీన్ మీద చూస్తూ.. ప్రేక్షకులు ఉద్వేగానికి లోనవుతున్నారు. శంభాజీ జీవితంలోని కీలక ఘట్టాలు, ఆయన పాలనా తీరును, మతం మార్చుకోమంటూ విదేశీ ఇస్లాం పాలకులు పెట్టిన చిత్రహింసల ఘటనల్ని తెరపై చూస్తూ.. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చాలా విషయాల్ని తేలిగ్గా తీసుకునే ఈతరం యువత.. శంభాజీ జీవితం గురించి తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకోవడం అంటే మాటలు కాదు.


“గణపతి, భూపతి, ప్రజాపతి, గజపతి, అశ్వపతి, జలపతి, సువర్ణరత్న శ్రీపతి..
అష్టావధాన జాగృత, అష్ట ప్రదాన దేష్టిత, న్యాయాలంకార మండిత॥
శతత్ర శత్ర శత్రు పరంగాత, రాజనీతి దురంధర, ప్రౌఢప్రతాప పురందర॥
క్షత్రియ కులావతంస, సింహాసనాదీశ్వర్, శ్రీశ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి.. జై!”

ఒకప్పుడు మరాఠా ప్రజలు మాత్రమే చెప్పుకునే ఈ శ్లోకం.. ఇప్పుడు జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. థియేటర్లల్లో సినిమా అయిపోయిన తర్వాత.. యువత ఈ శివాలి, శంభాజీల గొప్పదనాన్ని, వాళ్ల పాలనా దక్షతను వివరించే ఈ శ్లోకాన్ని ఆలపిస్తూ.. ఆ యోధులకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయా వీడియోలు.. ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి కూడా. విదేశాల నుంచి దేశంపైకి దురాక్రమణకు వచ్చిన జౌరంగజేబు.. యుద్ధం తర్వాత ముస్లిం మతం స్వీకరించమని శంభాజీ మహారాజ్ కు అడుగుతాడు. అందుకు నిరాకరించిన శంభాజీపై యుద్ధ నీతికి, రాజనీతజ్ఞతకు విరుద్ధంగా.. దారుణంగా వ్యవహరిస్తారు. అతని కళ్లను సలసల కాగే ఇనుప చువ్వలతో పొగుస్తారు. అతని శరీరాన్ని ఒలిచి.. గాయాలకు కారం అద్దుతారు. అలాంటి సందర్భంలో సైతం శంభాజీ తాను నమ్మిన ధర్మాన్ని విడిచిపెట్టేందుకు అంగీకరించరు. మరాఠా యోధుడైన ఛత్రపతి శివాజీకి నిజమైన వారసుడని నిరూపించుకుంటాడు.. శంభాజీ మహారాజ్. అలాంటి వీరుడి జీవితంలోని ముఖ్య ఘట్టాలు ప్రతీ ఒక్కరు తెలుసుకోవాల్సిందే..


తన తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణం తర్వాత ఎనిమిది సంవత్సరాలు మరాఠా సామ్రాజ్యాన్ని పాలించిన ఛత్రపతి శంభాజీ మహారాజ్‌కు సంబంధించిన అనేక కథలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అటువంటి పరిస్థితిలో, చరిత్ర పుస్తకాలలో శంభాజీ గురించి కనిపించే వర్ణనను పరిశీలిద్దాం.

చిరుప్రాయం – తల్లికి దూరం

శంభాజీ రాజే 1657 మే 14న మహారాష్ట్రలోని పూణే నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని పురందర్ కోటలో జన్మించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇద్దరు కుమారులలో శంభాజీ పెద్దవాడు. ఇతనితో పాటు మరో సోదరుడు, ఆరుగురు అక్కచెల్లెల్లు ఉన్నారు. పెద్ద కుమారుడైన శంభాజీకి అతని తమ్ముడు రాజారాం మధ్య 13 ఏళ్ల వయస్సు తేడా ఉంది. వివిధ రాజకీయ కారణాలతో ఛత్రపతి శివాజీకి అనేక పెళ్లిళ్లు అయ్యాయి. అందులో.. మహారాజ్ మొదటి భార్య అయిన సాయిబాయి దంపతులకు శంభాజీ రాజే జన్మించాడు. శంభాజీకి రెండేళ్ల వయసులో ఉన్నప్పుడే అతని తల్లి చనిపోయింది, దాంతో.. తన నానమ్మ, శివాజీ తల్లి జీజాబాయి దగ్గరే పెరిగాడు. మహారాజ శివాజీని ఉన్నత విలువలు, ధైవభక్తి యుక్తంగా పెంచిన జీజాబాయి.. శంభాజీ రాజేను అలాగే పెంచిపెద్ద చేసింది. చదువు విషయంలోనూ శంభాజీ కోసం శివాజీ మహారాజ్ చాలా మంది పండితులను ఏర్పాటు చేశారు. ప్రస్తుత సినిమాకు “ఛావా” అని ఎందుకు పెట్టారనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే.. శంభాజీని ముద్దుగా “ఛావా” అని పిలుస్తుంటారు.

నానమ్మ చూపిన దారిలో విశేష ప్రతిభ

ఆయనను సమర్థుడిగా తీర్చిదిద్దేందుకు శంభాజీకి విశేష శిక్షణ అందించారు. సంస్కృతం, మరాఠీ, ఫార్సీ, హిందీ భాషల్లో ప్రావీణ్యం సాధించారు. శివాజీ మహారాజ్ విద్య, ధర్మశాస్త్రం, రాజకీయ వ్యూహాలను ప్రత్యేకంగా బోధించారు. ఈ కుర్రాడికి.. అపారమైన ప్రతిభ అలవడగా, సంస్కృతంపై బలమైన పట్టు ఉండేది. ఈ కారణంగానే.. భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలను శంభాజీ పూర్తిగా అధ్యయనం చేశారు.

తొమ్మిదేళ్లకే పెళ్లి – రాజ్యవిస్తరణే లక్ష్యం

నిత్యం మరాఠా రాజ్యాన్ని విస్తరించేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఛత్రపతి శివాజీ.. వివాహాల ద్వారాను తన రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే..
1664 చివరలో నైరుతి మహారాష్ట్రలోని తాల్-కొంకణి ప్రాంతంలోని శక్తివంతమైన దేశ్‌ముఖ్ కుటుంబంతో సంబంధాలు ఏర్పరుచుకున్నారు. షిర్కే వంశానికి చెందిన పిలాజీ రావు షిర్కే కుమార్తె యశుబాయితో వివాహం చేశారు. దీంతో.. శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని కొంకణ్ ప్రాంతానికి విస్తరించడానికి సహాయపడింది.

చెడు ప్రవర్తన – జైలు శిక్ష

విశ్వాస్ పాటిల్ రాసిన మహాసామ్రాట్ పుస్తకం, కమల్ గోఖలే రాసిన శివపుత్ర సంభాజీ పుస్తకంలో.. శంభాజీ మహారాజ్ జీవితంలోని కీలక ఘట్టాల్ని ప్రస్తావిస్తాయి. 1674 లో శివాజీ మహారాజ్ పట్టాభిషేకం చేసినప్పుడే.. శంభాజీ అతని వారసుడు అవుతాడని అంతా భావించారు. అయితే.. ఈ కాలంలో, చావా గురించి అనేక పుకార్లు వ్యాపించాయి. వాటిలో.. అతని చెడు ప్రవర్తనకు సంబంధించినవి కొన్ని అయితే.. శంభాజీ ‘తిరుగుబాటు’ చేయనున్నాడనే ఆరోపణ మరొకటి. రాజ్యంలో.. ఈ పుకారు బలంగా వ్యాపించింది. అయితే.. ఈ వార్త వ్యాప్తి చేయడం వెనుక శంభాజీ సవతి తల్లి సోయరాబాయి హస్తం ఉందని, ఆమె కుమారుడు రాజారాంను శివాజీ వారసుడిగా ప్రకటించాలని ఆమె కోరుకున్నారని చెబుతుంటారు.

1674 లోనే శంభాజీకి పెద్దదిక్కుగా, అతడిని వెన్నంటి నిలిచే.. నాయనమ్మ జీజాబాయి కన్నుమూశారు. దాంతో.. శంభాజీ తీవ్రంగా కలత చెందారని చెబుతుంటారు. ఆ సమయంలోనే అతను చెడు ప్రవర్తనలకు అలవాటు అయ్యాడని అంటుంటారు. ఈ విషయం శివాజీకి తెలిస్తుంది. పైగా.. 1678లో ఒక పొరపాటు కారణంగా శివాజీ మహారాజ్ శంభాజీ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అతడిని పన్హాలా కోటలో నిర్బంధించమని ఆదేశిస్తారు. కొన్ని నెలలు జైలు శిక్ష తర్వాత 1678లో శంభాజీ తన భార్యతో కలిసి పారిపోయాడు.

తండ్రి నుంచి తప్పించుకుని – శత్రువుల దగ్గరే ఏడాది

తన నాయనమ్మ దగ్గర ఉన్నప్పుడే పూర్తి సైనిక శిక్షణ పొందిన శంభాజీ, శివాజీ నేతృత్వంలో మరింత రాటు తేలాడు. అలా.. అద్భుత సైనికుడిగా, పోరాట యోధుడిగా మారిన శంభాజీ.. 21 ఏళ్ల వయసులో ఔరంగాబాద్‌లో ఉన్న మొఘల్ గవర్నర్ దిలేర్ ఖాన్‌ దగ్గరకు చేరాడు. అలాంటి పరిస్థితిలో, మరాఠా సామ్రాజ్యంలో శంభాజీ స్థానం, నైపుణ్యాల గురించి దిలేర్ ఖాన్‌కు బాగా తెలుసు. శంభాజీ మొఘలులతో దాదాపు ఏడాది పాటు పని చేశారని చెబుతుంటారు. ఆ సమయంలో శంభాజీ.. మొఘలుల క్రూరమైన వైఖరిని ఇష్టపడలేదని, దాంతో అతను దిలేర్ ఖాన్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు చరిత్ర తెలుపుతోంది.

1679లో భూపాల్‌గఢ్ కోటపై దాడి జరిగిన సమయంలో.. దిలేర్ ఖాన్, అతని సైన్యం స్థానిక ప్రజలపై క్రూరంగా ప్రవర్తించి మహారాష్ట్రలోని అనేక గ్రామాలను బానిసలుగా చేసుకున్నారు. జిజాబాయి, శివాజీ దగ్గర పెరిగి, వారి విలువలు తెలిసిన వ్యక్తిగా శంభాజీకి అది నచ్చలేదు. ఇది మాత్రమే కాదు, తనను బంధించి దిల్లీకి పంపాలనే ఔరంగజేబు ఆదేశం గురించి కూడా ఛావాకు సమాచారం అందింది. దాంతో.. 1679 నవంబర్ లో, మొఘలులను తప్పించుకుని తన భార్య యషుబాయితో కలిసి బీజాపూర్ కు, అక్కడి నుంచి పన్హాలా చేరుకున్నాడు.

శివాజీ మరణం – రాజ్యంలో అధిపత్యం

మొదటి నుంచి శంభాజీ మహారాజ్ తిరుగుబాటు చేస్తాడనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో శివాజీ.. ప్రస్తుత కర్ణాటక ప్రాంతాన్ని శంభాజీకి అప్పగించి, మరాఠా ప్రాంతాన్ని రెండో కుమారుడైన రాజారాంకు అప్పగించాలని అనుకున్నట్లుగా చెబుతుంటారు. కానీ.. అనేక కారణాలతో అది సాధ్యం కాలేదు. అలా.. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏప్రిల్ 3, 1680న తుది శ్వాస విడిచారు. అప్పటికి.. తన వారసుడిని ప్రకటించకపోవడంతో.. ఆయన మరణ వార్త మొదట్లో శంభాజీకి చేరలేదు. దీనికి కారణం సోయరాబాయి ఆదేశాలేనని చెబుతారు. ఆమె తన కుమారుడు రాజారామ్‌ను తదుపరి ఛత్రపతిగా చేయాలని కోరుకుంది. ఏప్రిల్ 21, 1680న, రాజారాంను శివాజీ మహారాజ్ వారసుడిగా నియమించి, ఛత్రపతిగా ప్రకటిస్తారు.

ఈ విషయమై శంభాజీకి కొంతమంది మరాఠా మిత్రుల నుంచి సమాచారం అందుతుంది. దాంతో.. 22 ఏళ్ల శంభాజీ కోట ప్రధాన భద్రతాధికారిని చంపి పన్హాలా కోటను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. కోట సైనికులు కూడా శంభాజీ ఆదేశాలను పాటిస్తుంటారు. అలా… జూన్ 18, 1680న, శంభాజీ తన సైన్యంతో కలిసి రాయ్‌గడ్ కోటను తన తమ్ముడి నుంచి బలవంతంగా తన ఆధీనంలోకి తీసుకుంటాడు. ఛావా అధికారికంగా జూలై 20, 1680న ఛత్రపతిగా సింహాసనాన్ని అధిష్టించాడు. ఈ సమయంలో.. 10 ఏళ్ల రాజారాం, అతని భార్య జానకి బాయి, సవతి తల్లి సోయారాబాయిని జైలులో పెట్టిస్తారు.. ఛత్రపతి శంభాజీ మహారాజ్. ఆ తర్వాత.. శివాజీ మహారాజ్‌కు విషం ఇచ్చి చంపేశారంటూ.. తన సవతి తల్లి సోయారాబాయికి మరణశిక్ష విధిస్తారు.

1681-1689 : మొఘలులతో ఘర్షణ

ఛత్రపతి అయిన వెంటనే శంభాజీ తన తండ్రిలాగే మొఘలులతో యుద్ధం కొనసాగించాడు. 1682లో.. ఔరంగజేబు నాయకత్వంలో మొఘలులు దక్కన్‌ను స్వాధీనం చేసుకోవడానికి వేగంగా ప్రయత్నించారు. దీని కోసం, వారు మరాఠా సామ్రాజ్యాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టడానికి సిద్ధమయ్యారు. అయితే, శంభాజీ తనదైన వ్యూహాలతో యుద్ధ సన్నాహాలు చేసి.. తన కంటే చాలా పెద్దదైన మొఘల్ సైన్యాన్ని గెరిల్లా యుద్ధ పద్ధతుల ద్వారా అనేక యుద్ధాలలో ఓడించాడు. ఈ కాలంలో, మరాఠా సైన్యాలు మొఘల్ సైన్యాలు ఉన్న బుర్హాన్‌పూర్‌పై భారీ దాడి చేస్తాయి. మరాఠాలు దాడి చాలా ఘోరంగా ఉండటంతో మొఘలులు భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.

1689 : శంభాజీ కుట్రకు బలయ్యాడు

శంభాజీ మహారాజ్ పాలనలో, మొఘల్ దళాలు మరాఠా సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాయి. కానీ బీజాపూర్, గోల్కొండ తప్ప, ఇతర ప్రదేశాలను స్వాధీనం చేసుకోలేకపోయారు. అలా.. 1687లో మరాఠా సైన్యం మొఘలుల మరొక దాడికి తగిన సమాధానం ఇచ్చి విజయం సాధించింది. అయితే, శంభాజీ నమ్మకస్థుడు, కమాండర్ హంబీర్‌రావు మోహితే ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోతాడు. ఇది మరాఠా సైన్యాన్ని గణనీయంగా బలహీనపరుస్తుంది. ఈ బలహీనత మధ్య, మరాఠా సామ్రాజ్యంలోని శంభాజీ శత్రువులు అతనిపై కుట్రలు పన్ని, అతనిపైనే గూఢచర్యం చేస్తారు.

ఇస్లాం స్వీకరించమని హింస

1689లో మరాఠా నాయకుల సమావేశం కోసం శంభాజీ సంగమేశ్వర్ చేరుకుంటాడు. అప్పుడు మొఘల్ సైన్యం ఆయనపై మెరుపుదాడి చేసి.. శంభాజీని బహదూర్‌గఢ్‌కు బంధీగా పట్టుకెళ్తారు. అక్కడ ఔరంగజేబు ఇస్లాం స్వీకరించమని ప్రతిపాదిస్తాడు. అందుకు ఛత్రపతి ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించడు. దాంతో.. శంభాజీ రెండు చేతు, మెడను చెక్క పలకకు కట్టి, సంకెళ్లలో బంధింస్తారు. ఈ సందర్భంగానే.. తన ముందు కళ్లు దించమని ఔరంగజేబు అడిగితే.. శంభాజీ ధిక్కారంగా చూసిన చూపులు, అతని కళ్లల్లోని పౌరుషం, వీరత్వాన్ని చూసిన ఔరంగజేబు.. శంబాజీ కళ్ళను పీకించేస్తాడు. ఆ తర్వాత ఏ తీరుగా ప్రవర్తించాడో.. సినిమాలో కొంచెం చూపించగా.. అంతకు ఎన్నో రెట్లు బయట మొగల్ రాజులు  ప్రవర్తించారని చరిత్రకారులు చెబుతుంటారు.

శివాజీ మహారాజ్ చరిత్రతో సినిమా 

ఇప్పటి వరకు తెలుగులోనే కాదు ఏ భాషలోనూ శివాజీ చరిత్రతో సమగ్రంగా ఎలాంటి సినిమాను నిర్మించలేదు. దీంతో.. ఛావా సినిమా తర్వాత శంభాజీ గురించే కాకుండా.. ఆయన తండ్రి, మరాఠా యోధుడైన శివాజీ గురించి తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తిని కనబర్చుతున్నారు. ఈ ఆసక్తిని గమనించిన బాలీవుడ్ మేకర్స్.. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథను తెరకెక్కించే పనిలో పడ్డారు. ఇందుకోసం ఇప్పటికే.. ఓ ప్రాజెక్టు పట్టాలెక్కినట్లుగా చెబుతున్నారు. ఇందులో.. ఛత్రపతి మహారాజ్ గా కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నట్లు ఒక పోస్టర్ ను రిలీజ్ చేయడంతో పాటు.. టెక్నీషియన్స్ ను కూడా అనౌన్స్ చేసేశారు.

ది ప్రైడ్ అఫ్ భారత్ – ఛత్రపతి శివాజీ మహారాజ్

శివాజీ మహారాజ్ ధీరత్వాన్ని, రాజరికాన్ని, ఆయన పాలనా దక్షతను భారతీయులకు చేరువ చేసేందుకు ది ప్రైడ్ అఫ్ భారత్ – ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే టైటిల్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ మూవీకి సందీప్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ సినిమా 2027 జనవరి 21 న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఈ మూవీ మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. తెలుగులో జై హనుమాన్.. హిందీలో ఛత్రపతి శివాజీ పాత్రలతో మెప్పించడానికి రిషబ్ రెడీ అవుతున్నాడు. మరి ఈ సినిమా.. ఛత్రిపతి విజయ గాథల్ని ఎలా తెలుపుతుందో.. వేచి చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×