Mad Square : ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న యంగ్ హీరోలు నార్నే నితిన్ (Narne Nithiin), సంగీత్ శోభన్ (Sangeeth Sobhan), రామ్ నితిన్ (Ram Nithin) మరోసారి ‘మ్యాడ్ స్క్వేర్’తో థియేటర్లో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. కె.వి అనుదీప్, ప్రియాంక జవాల్కర్ ఈ సినిమాలో కీలకపాత్రను పోషిస్తున్నారు. రెబా జాన్ స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఈ మూవీని మార్చ్ 28న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. అయితే మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా నిర్మాత సూర్యదేవర నాగ వంశీ (Naga Vamsi) మాట్లాడుతూ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాత తమ సినిమాను తొక్కేయాలనుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
మైత్రి నిర్మాతపై సూర్యదేవర నాగ వంశీ కామెంట్స్
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఇటీవల రిలీజైన ‘లక్కీ భాస్కర్’, ‘డాకు మహారాజ్’ సినిమాలు వరుసగా హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మార్చ్ ఎండింగ్లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ ‘మ్యాడ్ స్క్వేర్’ థియేటర్లలోకి రాబోతోంది. ఈ మూవీని శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా మూవీ ప్రమోషన్లలో సంతోష్ శోభన్, సూర్యదేవర నాగ వంశీ ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. అందులో భాగంగా సంతోష్ శోభన్ “పోయిన రెండు మూడు ఫెస్టివల్స్ కి మీకు ఆపోజిట్ గా కొన్ని సింపతి కార్డులు వర్కౌట్ అయ్యాయని చాలామంది మిమ్మల్ని అడిగారు. అవన్నీ పట్టించుకోను అని చెప్పారు మీరు. వేరే సినిమాలతో కంపేర్ చేస్తే, ఇప్పుడు మనది అంత పెద్ద సినిమా కాదు. మనమేమన్నా సింపతి కార్డుని వాడుకోవచ్చా?” అని అడిగాడు.
నాగ వంశీ స్పందిస్తూ “నేను కూడా ఏదైనా సింపతీ కార్డు ట్రై చేద్దామా అని అనుకున్నాను. కానీ నిన్న మొన్న మైత్రి రవన్న విజయవాడ వెళ్లి మా సినిమానే చూడండి అని చెప్పారు. చూసారా? మా మైత్రి రవన్న మాకు ఎంత అన్యాయం చేశాడు? మా సినిమాను చూడొద్దు అని చెప్పాడు. వాళ్ల సినిమానే చూడమని చెప్పాడు. మీరందరూ ఇదంతా సీరియస్ గా తీసుకొని మా చిన్న సినిమాను ఆయన తొక్కేయకుండా, మీరు కూడా మా మూవీని చూడాలనుకుంటున్నాను. దీనికి ఏమైనా సింపతి జనరేట్ అవుతుందేమో చూడాలి” అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
‘మ్యాడ్ స్క్వేర్’ వర్సెస్ ‘రాబిన్ హుడ్’
ఇదిలా ఉండగా నితిన్ హీరోగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ‘రాబిన్ హుడ్’. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ మూవీని నిర్మిస్తోంది. అయితే ‘మ్యాడ్ స్క్వేర్’తో పాటే ‘రాబిన్ హుడ్’ మూవీని కూడా మార్చి 28న రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇరు చిత్రాల బృందాలు సరికొత్తగా ప్రమోషన్స్ చేస్తున్నారు.