Indian student in US : ఇస్లామిక్ ఉగ్ర సంస్థ హమాస్‌కు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలపై భారతీయ విద్యార్థిని అమెరికాలో అరెస్టు చేశారు. ఇటీవల ఓ విద్యార్థిని అదుపులోకి తీసుకున్న అక్కడి పోలీసులు ఇప్పుడు మరొకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తి.. జార్జ్‌టౌన్ యూనివర్శిటీలోని బదర్ ఖాన్ సూరిగా (Badar Khan Suri) వెల్లడించారు. అతని వీసాను రద్దు చేసి, విచారణ నిమిత్తం అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లుగా వెల్లడించారు. పొలిటికోలో కోర్టు ఎదుట హజరు పరిచిన అధికారులు.. ఇతని గురించి సంచలన విషయాల్ని ప్రస్తావించారు. భారత్ నుంచి ఉన్నత విద్య కోసం యూఎస్ వచ్చిన బదర్ ఖాన్ సూరి పోస్ట్‌డాక్టోరల్ ఫెలో గా ఉన్నాడు. ఇతను.. ఇజ్రాయిల్ పై దాడులకు తెగబడుతున్న ఉగ్రవాద సంస్థ హమాస్‌తో సంబంధాలు కలిగి ఉన్నాయని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది.
పాలస్తీనాకు మద్ధతుగా ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న వారిపై ట్రంప్ యంత్రాంగం గట్టి చర్యలకు పాల్పడుతోంది. వారిలో.. కొలంబియా విశ్వవిద్యాలయ విద్యార్థిని రంజని శ్రీనివాసన్ ఒకరు. ఇతని విద్యార్థి వీసాను డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. మార్చి 11న, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE)అరెస్టుకు భయపడి శ్రీనివాసన్ “స్వీయ బహిష్కరణ” ఎంచుకున్నాడు. పాలస్తీనా అనుకూల విద్యార్థుల ప్రదర్శనకారులపై ట్రంప్ యంత్రాగం దృష్టి పెట్టిన నేపథ్యంలో.. శ్రీనివాస్ కేసు అందరి దృష్టిని ఆకర్షించింది. ట్రంప్ పరిపాలనకు ముందు.. అంటే 2024లో కొలంబియా యూనివర్శిటీ సహా, ఇతర US క్యాంపస్‌లలో పాలస్తీనా అనుకూల నిరసనలలో పాల్గొన్న అనేక మంది విద్యార్థులు, కార్యకర్తలపై గత వారం రోజులుగా ట్రంప్ చర్యలకు దిగారు. అందులో భాగంగానే.. తాజా అరెస్టు చోటుచేసుకుంది.
విదేశాంగ విధాన కారణాల వల్ల ఇస్లామిక్ టెర్రరిస్టులకు మద్ధతిస్తున్న సూరి వీసాను రద్దు చేయాలని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఆదేశాలు జారీ చేశారని.. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ధృవీకరించింది. సూరి పాలస్తీనా వారసత్వం ఉన్న మహిళను వివాహం చేసుకున్నారు. ఈ ప్రభావంతోనే.. నిందితుడు సూరి జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో.. హమాస్ ప్రచారాన్ని చురుగ్గా వ్యాప్తి చేస్తూ సోషల్ మీడియాలో యూదు వ్యతిరేకతను ప్రచారం చేస్తున్నాడ అతనిపై ఆరోపణలున్నాయి. సూరికి అనుమానిత ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సూరి జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలోని అల్వలీద్ బిన్ తలాల్ సెంటర్ ఫర్ ముస్లిం-క్రిస్టియన్ అండర్‌స్టాండింగ్‌లో పోస్ట్-డాక్టోరల్ ఫెలోషిప్‌తో పరిశోధకుడు. 2020లో దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియాలోని నెల్సన్ మండేలా సెంటర్ ఫర్ పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ నుంచి పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ చేశారు. కాగా.. కోర్టులో సూరి విడుదల కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో.. అతనిపై ఎటువంటి నేర చరిత్ర లేదని, ఇప్పటికీ అతనిపై ఎటువంటి నేరం మోపలేదని తెలిపారు. సూరి భార్య కు పాలస్తీనా వారసత్వం ఉన్న కారణంగానే.. అతను, అతని భార్య ఇజ్రాయెల్ పట్ల అమెరికా విదేశాంగ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని ప్రభుత్వం అనుమానిస్తుందని అంటున్నారు. సూరిని అన్యాయంగా అరెస్టు చేశారంటూ సూరి న్యాయవాది హసన్ అహ్మద్ వాదించారు. సూరి ప్రస్తుతం లూసియానాలోని అలెగ్జాండ్రియాలో నిర్బంధంలో ఉన్నాడు, అతను ఇమ్మిగ్రేషన్ కోర్టులో హాజరు పరచనున్నారు.
Also Read : Trump World Center: ఇండియాలో ట్రంప్ వరల్డ్ సెంటర్.. ఏ సిటీలో ఏర్పాటు
కాగా.. కొలంబియా విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్ విద్యార్థి, క్యాంపస్‌లో పాలస్తీనా అనుకూల నిరసనలకు నాయకత్వం వహించిన గ్రీన్ కార్డ్ హోల్డర్ మహమూద్ ఖలీల్‌ను ట్రంప్ యంత్రాంగం బహిష్కరించింది. ఇందుకోసం..వలస చట్టంలోని అరుదుగా ఉపయోగించే నిబంధన కింద చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం.. బదర్ ఖాన్ సూరి బహిష్కరణ సైతం ఇదే నిబంధన కింద అమలు చేయనున్నాట్లు తెలుస్తోంది.