Mahanati Savitri: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దొరికిన ఆణిముత్యాలలో మహానటి సావిత్రి (Mahanati Savitri) ఒకరు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అబ్బురపరిచారు. ముఖ్యంగా ఒక కంట్లో కన్నీరు తెప్పించాలంటే.. అందులోనూ ఒక కంటిలో రెండే చుక్కల కన్నీటిని తెప్పించి, నటనపై తనకున్న ఇష్టాన్ని అందరికీ తెలిసేలా చేశారు. ముఖ్యంగా పాత్రతో సంబంధం లేకుండా ఎలాంటి పాత్ర అయినా సరే లీనమైపోయి మరీ నటించేవారు సావిత్రి. అందుకే మహానటి సావిత్రి తర్వాత ఆమె స్థానాన్ని ఎవరు కూడా ఇప్పటికీ భర్తీ చేయలేకపోవడం గమనార్హం. 1960 – 70 సంవత్సర కాలంలో మహానటి సావిత్రి కెరియర్ పీక్స్ లో ఉండేది. ఏడాదికి 10 నుండి 20 సినిమాలు ఆమె నుండి వచ్చేవి. ముఖ్యంగా ఆమె సినిమా వస్తుందంటే చాలు అభిమానులు ఎడ్ల బండ్లు కట్టుకొని మరీ థియేటర్ కు వెళ్లేవారు. దీన్ని బట్టి చూస్తే ఆమె ఎంత విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
జెమినీ గణేషన్ తో ప్రేమ, పెళ్లి..
ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజ నటులతో సినిమాలు చేసిన ఈమె.. ఒక నటనలోనే కాదు ఇతరులకు సహాయం చేయడంలో కూడా ఈమె చేయి పెద్దదే అని చెబుతారు సినీ ప్రముఖులు. ఇకపోతే సావిత్రి నేడు మన మధ్య లేకపోయినా ఆమె నటించిన ఎన్నో చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి.ఇక సావిత్రి వ్యక్తిగత జీవిత విషయానికొస్తే.. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే తమిళ నటుడు జెమినీ గణేషన్ ను (Jemini Ganeshan) ప్రేమించి, రహస్యంగా వివాహం చేసుకుంది. ఇక జెమినీ గణేషన్ కి అప్పటికే వివాహం జరిగి, పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఈ విషయం సావిత్రికి తెలియదు. అతడితో కొంతకాలం జీవితాన్ని గడిపిన తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన సావిత్రి, ఆ తర్వాత నిజం తెలుసుకొని మధ్యానికి బానిసై, కోమాలోకి వెళ్లిపోయి చివరికి ఎవరూ లేని అనాధలా స్వర్గస్తురాలు అయ్యింది.
డూప్ ను చూసి తన లోపాన్ని గుర్తించిన సావిత్రి..
ఇకపోతే సాధారణంగా ఒక హీరో యాక్షన్ సన్నివేశాలు లేదా ఆ హీరో చేయలేని సన్నివేశాలు సినిమాలో ఉంటే మాత్రం ఖచ్చితంగా దర్శక నిర్మాతలు వారికోసం ఒక డూప్ ని సృష్టిస్తూ ఉంటారు. అయితే ఈ డూప్ ల గురించి ఈమధ్య ఎక్కువగా వినిపిస్తోంది. కానీ మహానటి సావిత్రి కాలం నుంచి ఈ డూప్ లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతే కాదు ఈ డూప్ ని చూసిన తర్వాతే తనలో ఉన్న లోపాన్ని కూడా పసిగట్టారట సావిత్రి. సావిత్రి సినిమాలోకి వచ్చిన కొత్తలో చాలా నాజూగ్గా ఉండేవారట. వివాహానికి ముందు వరకు కూడా తన అందంతో ఆమె ఆకట్టుకునేవారట. కానీ జెమినీ గణేషన్ తో వివాహం జరిగిన తర్వాత ఆమె బరువు పెరిగిపోయారు. దీనికి తోడు ఆమె మంచి భోజనం ప్రియురాలు కూడా..ఇదిలా ఉండగా ఒకరోజు సినిమా సెట్ లో అచ్చం సావిత్రి లాగే ఒక లావుగా ఉండే మహిళ గెటప్ వేసుకుని నడుచుకుంటూ వెళ్తుందట. ఆమెను చూసిన సావిత్రి ఎవరు ఆమె.. ఎందుకలా గెటప్ వేసుకుంది అని అడగగా..ఆమె మీ డూప్ అండి. నైట్ కి చేయాల్సిన షూటింగ్ మొత్తం ఆమెతోనే చేయిస్తున్నాము అని చెప్పారట. అయితే ఆమెను చూసిన తర్వాత సావిత్రి ఒక్కసారిగా ఆశ్చర్యపోయిందట. అప్పుడే తన లోపాన్ని గుర్తించిందట. తాను బరువు పెరగానని గమనించిందని సమాచారం. వాస్తవానికి సావిత్రి స్టార్ నటి కావడంతో ఆమెతో ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం ఎవరూ చేయలేదు. అందుకే ఆమె తనకు తెలియకుండానే బరువు పెరిగిపోయింది. కానీ తన డూప్ ను చూసుకున్న తర్వాత తనలో ఉన్న లోపాన్ని గుర్తించి మళ్లీ సరిచేసుకున్నట్లు సమాచారం.