Siddique : మలయాళ సినిమా ఇండస్ట్రీలో హేమ కమిటీ (Hema Committee) సృష్టించిన ప్రకంపనలు ఇంకా తగ్గట్లేదు. చిత్ర పరిశ్రమలో పని చేసే మహిళలపై జరిగే వేధింపులను హేమ కమిటీ బయట పెట్టిన సంగతి తెలిసిందే. అందులో ఇండస్ట్రీలో పెద్దలుగా చెప్పుకునే ఎంతోమంది పేర్లు బయటపడ్డాయి. ఆ పేర్లలో ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిఖీ పేరు కూడా ఉంది. ఓ మహిళ అవకాశాల ఆశ చూపి సిద్ధిఖీ (Siddique) తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని కంప్లైంట్ ఇవ్వడంతో, ఆయనపై కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సిట్ అధికారులు ఆయనకు వ్యతిరేకంగా సాలిడ్ ఎవిడెన్స్ ను సంపాదించారని సమాచారం.
గత ఏడాది అరెస్ట్
2024 డిసెంబర్ 6న సిద్ధిఖీ లైంగిక వేధింపుల కేసులో అరెస్టయ్యాడు. 2016లో ఒక నటి తనపై అతను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించిన నేపథ్యంలో ఆగస్టు 2024లో కేసు నమోదయింది. అతనిపై సెక్షన్ 376 అత్యాచారం, 506 క్రిమినల్ బెదిరింపు వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. ఈ ఆరోపణ తర్వాత సిద్ధిఖీ అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. అయితే జస్టిస్ హేమా కమిటీ నివేదిక తర్వాత సిద్ధిఖీ కేసు నమోదు అయింది.
రంగంలోకి దిగిన సిట్…
ఈ నేపథ్యంలోనే సిద్ధిఖీ కేసును పరిశీలించడానికి సిట్ ను నియమించారు అధికారులు. తాజా సమాచారం ప్రకారం పోలీసులు సిద్ధిఖీకి వ్యతిరేకంగా బలమైన ఆధారాలను సేకరించినట్టు తెలుస్తోంది. ఛార్జ్ షీట్ ప్రకారం సిద్ధిఖీ సినిమా చర్చల ముసుగులో సదరు నటిని తిరువనంతపురంలోని మస్కాట్ హోటల్ కి రప్పించాడు. దురుద్దేశంతో ఉన్న సిద్ధిఖీ హోటల్ గదిలోనే లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. తాజా రిపోర్ట్ లో కూడా ఇదే వాదన ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
నిజానికి జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ బయటకు రాకముందే సదరు నటి తనపై జరిగిన దాడి గురించి మాట్లాడిందని చూపించే ఆధారాలను సిట్ బయట పెట్టినట్టు తెలుస్తోంది. కానీ ఆమెకు సినిమా ఇండస్ట్రీలో పెద్దగా పేరు లేకపోవడం వల్ల సిద్ధిఖీ ఆమెకు అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించాడని తెలుస్తోంది. ఇక సిట్ తమ పరిశోధన ఫలితాలను కోర్టుకు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారని, కానీ క్రైమ్ బ్రాంచ్ ఉన్నతాధికారుల అనుమతి కోసమే ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి సిద్ధిఖీ దోషి అని సిట్ నమ్ముతున్నట్టు సమాచారం.
జరిగింది ఇదే
ఘటన 2016 జనవరి 28న జరిగింది. అదే టైంలో ‘సుఖమైరికట్టే’ ప్రీమియర్ కోసం తిరువనంతపురంలో ఉన్నప్పుడు సిద్ధిఖీ ఆ హోటల్లో బస చేసినట్టు నిర్ధారించే సాక్ష్యాలు, డిజిటల్ ఆధారాలు రెండిటినీ ఛార్జ్ షీట్ లో దాఖలు చేశారు. అంతేకాకుండా ఈ ఘటన జరిగిన తర్వాత నటి కొచ్చిలోని ఓ హాస్పిటల్ లో వైద్య సహాయం కోరిందని, ఆ డాక్టర్ కూడా ఇప్పుడు తన స్టేట్మెంట్ ను ఇచ్చినట్టు కన్ఫర్మ్ చేసింది సిట్.
మరోవైపు సిద్ధిఖీ న్యాయవాదులు అప్పుడే అఘాయిత్యం జరిగి ఉంటే, ఆ నటి 8 సంవత్సరాలు ఎందుకు మౌనంగా ఉండి పోయిందని ప్రశ్నిస్తున్నారు. హేమ కమిటీ నివేదిక తర్వాత ఆమె ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిందని వాదిస్తున్నారు. అయితే సిద్ధిఖీ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.