Sanal Kumar Sasidharan : మలయాళ దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ (Sanal Kumar Sasidharan) పై ప్రముఖ హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా వేధించినందుకు గానూ కేసు నమోదైంది. ఈ మేరకు ఎలమక్కర పోలీసులు ‘కాయం’ చిత్ర దర్శకుడిపై వేధింపులు, నేరపూరిత బెదిరింపు, పరువు నష్టం ఆరోపణలపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం.
నటి ఫిర్యాదుతో నిర్మాతపై కేసు నమోదు
సదరు నటి సోమవారం ఫిర్యాదు చేయడంతో మలయాళ చిత్ర నిర్మాత సనల్ కుమార్ శశిధరన్ (Sanal Kumar Sasidharan)పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల ఫేస్‌బుక్ పోస్ట్‌లో నటితో పాటు ఆమె కుమార్తె ప్రాణాలకు ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ కేసులో ఆ నటి పేరుతో తనపై వేరొకరు ఫిర్యాదు చేశారని పేర్కొంటూ సనల్ తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్ కాపీని తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇక ప్రస్తుతం సనల్ కుమార్ శశిధరన్ విదేశాల్లో ఉన్నందున, అతనిపై చట్టపరమైన చర్యలకు పోలీసులు సిద్ధం అవుతున్నారు. పరువు నష్టం కలిగించేలా నటిపై దర్శకుడు షేర్ చేసిన ఆ పోస్ట్‌ను కూడా తొలగించేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ పుట్టా విమలాదిత్య తెలిపారు.
అసలు వివాదం ఏమిటంటే?
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా బ్లాక్‌మెయిల్ చేసి, తన ప్రతిష్టను దిగజార్చారని ఆరోపిస్తూ హీరోయిన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మే 2022లో ప్రముఖ డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరన్ (Sanal Kumar Sasidharan) అరెస్టయ్యాడు. ఈ కేసులో అరెస్టయిన సనల్ కుమార్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2022లో నటి ఇచ్చిన ఫిర్యాదుతో సనల్ కుమార్ శశిధరన్ పై నమోదైన ఆ కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది. కేసు పెండింగ్ లో ఉందనే భయం లేకుండా అతను మళ్లీ నటిని వెంబడించి, వేధించడంతో ఆమె మరోసారి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది. దీంతో డైరెక్టర్ పై వివిధ సెక్షన్ల కింద ఇంకోసారి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
డైరెక్టర్ పై లుకౌట్ నోటీసులు
సనల్ కుమార్ ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. దీంతో అతనిపై లుక్‌అవుట్ నోటీసు జారీ చేయనున్నట్లు సమాచారం. కొచ్చి పోలీసులు అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని ఇప్పటికే సంప్రదించారు. ఈ లుకౌట్ నోటీసులు జారీ చేస్తే అతను విమానాశ్రయానికి చేరుకోగానే అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది.
అరెస్ట్ ఫేస్ బుక్ లైవ్
అప్పట్లో అరెస్టు జరిగినప్పుడు సనల్ బంధువులతో కలిసి తన స్వగ్రామమైన పరశాలలోని ఆలయాన్ని సందర్శించాడు. సాధారణ దుస్తులు ధరించిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించినప్పుడు, దర్శకుడు తనను ‘కిడ్నాప్’ చేస్తున్నారని, వ్యవస్థపై తనకు నమ్మకం లేదని పేర్కొంటూ ఫేస్ బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేసారు.
ఇదిలా ఉండగా, సనల్ గతంలో ‘ఎస్ దుర్గ’ అనే సినిమాతో పాపులర్ అయ్యాడు. ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డామ్ 2017లో హివోస్ టైగర్ అవార్డును అందుకుంది. అతని దర్శకత్వంలో వచ్చిన చివరి మూవీ 2022లో రిలీజైన టోవినో థామస్ ‘వజక్కు’.