Manchu Manoj: చాలారోజుల క్రితం మంచు ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయి. అన్న – అమ్ముడు, తండ్రి – కొడుకు.. ఇలా వారిలో వారికే మనస్పర్థలు వచ్చాయనే విషయం బయటికొచ్చింది. మామూలుగా ఏ కుటుంబంలో అయినా మనస్పర్థలు, గొడవలు అనేవి కామన్. కానీ మంచు ఫ్యామిలీ గొడవలు మాత్రం వేరే లెవెల్‌కు చేరుకున్నాయి. అందుకే మంచు మనోజ్, మోహన్ బాబు పలుమార్లు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. కొన్నిరోజులుగా మంచు ఫ్యామిలీ అంతా సైలెంట్ అయిపోయింది. దీంతో గొడవలు కాస్త సర్దుకున్నాయని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ వారి అంచనాలను తారుమారు చేస్తూ మంచు మనోజ్ మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు.
దొంగతనం చేశారు
నార్సింగి పోలీస్ స్టేషన్‌లో అన్న మంచు విష్ణుపై ఫిర్యాదు చేశాడు మంచు మనోజ్. ఇప్పటికే తండ్రి, అన్నపై పలు కేసులు నమోదు చేశాడు మనోజ్. వారి కుటుంబం వల్ల తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ, తనపై దాడి చేశారంటూ, తన ఇంట్లోకి వచ్చి వాహనాలు ధ్వంసం చేశారంటూ.. ఇలా ఇప్పటికే తండ్రి, అన్నపై ఎన్నో ఆరోపణలు చేశాడు. ఇప్పటికీ ఆ కేసులను వెనక్కి తీసుకోలేదు. ఇంతలోనే మంచు విష్ణుపై మరో కేసు నమోదు చేసి షాకిచ్చాడు. మంచు విష్ణు (Manchu Vishnu) దాదాపు 150 మందితో తన ఇంట్లోకి చొరబడ్డాడు అంటూ మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారుతో పాటు ఇతర వస్తువులను కూడా దొంగతనం చేశారని ఆరోపించాడు.
విధ్వంసం సృష్టించారు
ఇటీవల మంచు మనోజ్, భూమా మౌనిక కలిసి తన కూతురి మొదటి పుట్టినరోజును జరుపుకోవడానికి రాజస్థాన్‌కు వెళ్లామని, అదే సమయంలో మంచు విష్ణు తన అనుచరులతో కలిసి తన ఇంట్లోకి చొరబడ్డారని మంచు మనోజ్ ఆరోపణలు చేశాడు. జల్‌పల్లిలోని తన ఇంట్లోకి వచ్చి విధ్వంసం సృష్టించారని అన్నాడు. పలు విలువైన వస్తువులతో పాటు కార్లను కూడా ఎత్తుకెళ్లారని తెలిపాడు. ఇక తన ఇంట్లో చోరీ అయిన వస్తువులు మంచు విష్ణు ఆఫీసులో లభ్యమయ్యాయని కూడా అన్నాడు మంచు మనోజ్ (Manchu Manoj). ఇక ఈ విషయంపై తన తండ్రితో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాడట మనోజ్. అంతే కాకుండా విష్ణు చేస్తున్న పనుల గురించి కూడా మోహన్ బాబు చెప్పాలని అనుకున్నాడట.
Also Read: రాజమౌళి తర్వాత నువ్వే గ్రేట్.. ‘పెద్ది’ గ్లింప్స్‌పై ఆర్జీవీ రివ్యూ
అందుబాటులోకి రాలేదు
ఇదంతా జరిగిన తర్వాత మోహన్ బాబు (Mohan Babu)ను సంప్రదించాలని తాను ప్రయత్నించానని చెప్పుకొచ్చాడు మంచు మనోజ్. కానీ ఆయన మాట్లాడడానికి అందుబాటులోకి రాలేదని తెలిపాడు. అలా మరోసారి తన తండ్రి నుండి న్యాయం చేయమని విజ్ఞప్తి చేశాడు మనోజ్. దీన్ని బట్టి చూస్తే మంచు ఫ్యామిలీలో మొదలయిన గొడవలు ఇప్పట్లో సర్దుకునేలా లేవని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంచు మనోజ్‌తో జరుగుతున్న గొడవలపై మంచు విష్ణు, మోహన్ బాబు పెద్దగా స్పందించకపోయినా వారి వల్ల తనకే చాలా నష్టం జరుగుతుందని మంచు మనోజ్ మాత్రం ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు.