గత రెండు రోజులుగా మంచు ఫ్యామిలీ(Manchu Family)లో గొడవలు చర్చనీయాంశంగా మారాయి. తన భార్య, కూతుర్ని కూడా ఇబ్బంది పెట్టడమే కాకుండా దొంగతనం చేశారంటూ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు మీడియా ముందుకి వచ్చారు మంచు మనోజ్ (Manchu Manoj). కన్నీళ్లు పెట్టుకుంటూ తాను ఎన్నో రోజులుగా పడిన వేదనను ఒక్కసారిగా బయట పెట్టడంతో ఈ వీడియో చూసిన సామాన్య ప్రజలు సైతం కంటతడి పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా అన్ని ఆధారాలతో సహా సాయంత్రం 5:00 గంటలకు ప్రెస్ బీట్ పెట్టి మరీ అన్ని బయట పెడతాను అంటూ చెబుతున్నారు మంచు మనోజ్.
ప్రెగ్నెంట్ అని కూడా చూడలేదు..
ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతూ మంచు మనోజ్ కన్నీటి పర్యంతమయ్యారు.. జర్నలిస్ట్ ప్రతినిధులు నాకోసం వచ్చి నిలబడినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా మీకు ఇలా జరగడం చాలా బాధాకరం. మా నాన్న, అన్నయ్య తరఫున నేను క్షమాపణలు చెబుతున్నాను. మా నాన్న దేవుడు. ఇప్పుడున్న మా నాన్న.. మా నాన్న కాదు. మా నాన్నను వినయ్, అన్న విష్ణు భారీగా బ్రెయిన్ వాష్ చేశారు. నాన్న దగ్గర నన్ను తప్పుడు మనిషిగా చిత్రీకరించారు. నేను ఏ రోజు కూడా మా నాన్నను ఆస్తులు అడగలేదు. అన్న ఫ్యామిలీతో సహా దుబాయ్ కి షిఫ్ట్ అవడంతో ఇక్కడ అమ్మానాన్న ఒంటరిగా ఉన్నారు. ఇక నేను నా భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్య ప్రెగ్నెంట్ అయింది. మౌనిక 7 నెలల ప్రెగ్నెంట్ అప్పుడు.. విజయవాడలో ఉండే మా అంకుల్ ఒకరు , అలాగే ఇక్కడ ఉండే మా బంధువులు.. అమ్మా నాన్నకు తోడుగా ఉండాలి. ప్రస్తుతం మౌనికకి కూడా తల్లిదండ్రులు లేరు కదా.. ఈ సమయంలో వారే అండగా ఉంటారు. దయచేసి అమ్మ నాన్నల దగ్గరకు వెళ్ళండి అని బలవంతం పెడితేనే, నేను నా భార్యను తీసుకొని అమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్లాను. అయితే ఆ సమయంలో కూడా నా భార్య ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. డెలివరీ సమయంలో మా ఇంట్లో పది కార్లు ఉన్నాయి. ఏదో ఒక కారు ఉపయోగించాలి కదా.. కానీ మా ఇంటికి ఆరోజు 108 వచ్చింది. ఇక దీన్ని బట్టి చూడండి మా ఇంట్లో మాకు ఎలాంటి విలువ ఇచ్చారో.. ఇలాంటివన్నీ బయటకు రావు. కేవలం మా ఏరియా ఎస్ఐకి మాత్రమే తెలుసు.. ఇవన్నీ కూడా వారు దాచి పెట్టారు.
కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయిన మంచు మనోజ్..
నేను ఏ రోజు కూడా దొంగతనం చేయలేదు. కానీ మా అన్న వ్యాపార భాగస్వామి విజయ్ నా దగ్గర ఉన్న కొన్ని సాక్షాలను నాశనం చేశాడు. అలాగే నా బిడ్డ దగ్గరకు వెళ్లడంతో నాకు భయం వేసింది. ఎవరికైనా సరే పిల్లల దగ్గరికి వస్తే భయం వేస్తుంది కదండీ.. అందుకే ఇప్పుడు నేను, నా భార్య, పిల్లల కోసం స్టాండ్ తీసుకున్నాను. ఇప్పుడు కూడా నేను నిలబడకపోతే రేపు పొద్దున నా పిల్లల ముందు నేను నిల్చోలేను. దొంగతనం చేసిన డబ్బుతో నా పిల్లల కడుపు నింపలేదు. నా కష్టార్జితంతోనే నేను ఈ స్థాయికి వచ్చాను. మా అన్న కోసం ఎన్నో కష్టాలు పడ్డాను. సినిమా షూటింగులు చేశాను. రికార్డింగ్ లు చేశాను. అన్న కోసం ఒక గొడ్డు లాగా పని చేశాను. కానీ అన్న నన్ను ఇలా మానసికంగా ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా విద్యా సంస్థలలో చాలామంది ఉండేది మా వాళ్లే. మా వాళ్ల కోసం నేను నిలబడ్డాను. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చాను. పొమ్మంటే పోయాను. అలాంటి వాళ్ల కోసం అండగా నిలబడినందుకు ఇప్పుడు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా సాయంత్రం ఐదు గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని ఆధారాలతో సహా బయట పెడతాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు మంచు మనోజ్.