Manushi Chhillar : గత సంవత్సరం అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ సంగీత్ లో మానుషి చిల్లర్ (Manushi Chhillar), వీర్ పహరియా (Veer Pahariya) స్టేజ్ పర్ఫామెన్స్ ఇచ్చి, అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని పుకార్లు వచ్చాయి. అంతేకాదు మానుషి – వీర్… తన సోదరుడు శిఖర్ పహరియా (Sikhar Pahariya) – జాన్వి కపూర్ (Janhvi Kapoor)తో డబుల్ డేట్‌లో పాల్గొన్నారని కూడా వార్తలు విన్పించాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో మాజీ మిస్ వరల్డ్ మానుషి వీర్ పహరియాతో డేటింగ్ రూమర్లను ఖండించింది. ఈ మేరకు డేటింగ్ రూమర్లపై ఫస్ట్ టైమ్ స్పందించిన ఆమె ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది.
ప్రైవేట్ గా ఉంటే వచ్చే నష్టం ఇదే
ఓ నేషనల్ మీడియాతో మానుషి మాట్లాడుతూ “నా వ్యక్తిగత జీవితం గురించి రాసిన చాలా విషయాలు కంప్లీట్ గా అబద్దాలే. నా పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుందో అనే విషయంపై ప్రజలకు కొంత వరకు ఆసక్తి ఉంది. నాకు అబ్బాయిలు, అమ్మాయిల్లో కూడా స్నేహితులు ఉన్నారు. నేను నా స్నేహితురాళ్ళతో ఎక్కువగా తిరుగుతుంటే, అబ్బాయిల పట్ల ఆసక్తి లేనట్టా? అలాగని ఒకవేళ నేను అబ్బాయిలతో తిరిగితే డేటింగ్ చేస్తున్నామని అనుకుంటారు. ఇది నా జీవితం. నేను నా జీవితాన్ని నాకు నచ్చినట్టు గడపబోతున్నాను. అవతలి వ్యక్తిని అర్థం చేసుకోలేనంత వెనకబడిపోయి ఉంటే అక్కడితో వదిలేయడం మంచిది. అలాగే ఒక అబ్బాయి, అమ్మాయి స్నేహితులుగా లేదా సాధారణ ఆసక్తులు, అభిరుచులను పంచుకోగలిగితే… మీరు మంచి ఎంటర్టైన్మెంట్ ను ఆస్వాదించవచ్చు” అంటూ అమ్మాయి, అబ్బాయి కలిసి ఉండడం గురించి చెప్పుకొచ్చింది.
“అవతలి వ్యక్తి జీవితంలో కల్పించుకోవడం, ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాగే నేను కూడా ఎవ్వరి గురించి పట్టించుకోను. నా జీవితంలో ఏం జరుగుతుంది ? అన్నది బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అలా ఉండడం వల్ల వచ్చే నష్టం ఏమిటంటే… మనం ఎక్కువగా బయట పర్సనల్ విషయాలను చెప్పనప్పడు, గాసిప్స్ ఎక్కువై, కథలు కథలుగా చెప్పుకుంటారు. అలాగే నా వ్యక్తిగత జీవితం గురించి రాసిన చాలా విషయాలు పూర్తిగా అబద్ధమని నేను చెప్పగలను. అది కొంచెం ప్రైవేట్‌గా ఉండటం వల్ల కలిగే నష్టం అంతే” అని మానుషి క్లారిటీ ఇచ్చింది.
వీర్ తో డేటింగ్ పుకార్లకు ఫుల్ స్టాప్
వీర్ తో డేటింగ్ చేస్తున్నారనే పుకార్ల గురించి మానుషిని నేరుగా అడిగినప్పుడు, ఆమె స్పందిస్తూ “ఓ మై గాడ్, పాపం వీర్. మేము డేటింగ్ చేయడం లేదు. అతను ఒక మంచి స్నేహితుడు. నాకు ఎవ్వరూ తెలియని పెళ్లిలో ఆయన నాకు కాసేపు సరదాగా కంపెనీ ఇచ్చాడంతే. ఆ అబ్బాయితో నేను ఫస్ట్ టైమ్, చివరగా మాట్లాడింది అప్పుడు మాత్రమే” అని క్లారిటీ ఇచ్చింది.
ఇదిలా ఉండగా మానుషి చిల్లర్ 2022లో అక్షయ్ కుమార్ సరసన సామ్రాట్ ‘పృథ్వీరాజ్’ అనే హిస్టారికల్ డ్రామాలో నటించింది. ఆమె 2023లో ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’, 2024లో ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘బడే మియాన్ చోటే మియాన్’ చిత్రాలలో నటించింది. ఆమె చేసిన అన్ని సినిమాలు కూడా ఘోరంగా డిజాస్టర్ అయ్యాయి. మరోవైపు వీర్ పహరియా ఈ సంవత్సరం ప్రారంభంలో అక్షయ్ కుమార్ తో కలిసి ‘స్కై ఫోర్స్’ అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి కాలు పెట్టాడు. ఆ చిత్రం హిట్టయిన సంగతి తెలిసిందే.