Martin.. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ (Arjun sarja) మేనల్లుడు ధ్రువ సర్జ (Dhruva sarja) హీరోగా తెరకెక్కుతున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం మార్టిన్ (Martin). అర్జున్ కథ అందించిన ఈ చిత్రానికి అయ్యో పాపం అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. వైభవీ శాండిల్య ఇందులో హీరోయిన్ గా ఎంపిక అవ్వగా, అన్వేషి జైన్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే అక్టోబర్ 11వ తేదీన సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా విడుదల తేదీ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ట్రైలర్ అదుర్స్..
ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేసి సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది చిత్ర బృందం. ముఖ్యంగా ఈ ట్రైలర్ అతి తక్కువ సమయంలోనే 72 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాబట్టి రికార్డు సృష్టించింది. అంతేకాదు తాజాగా ఈ సినిమా నుంచి అందంతలే అంటూ వచ్చిన పాట కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ సినిమాకి అదిరిపోయే సంగీతాన్ని అందించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారని తెలిసినప్పటి నుంచి సినిమా పాటలపై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందులో భాగంగానే సినిమా నుంచి విడుదలైన ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
మార్టిన్ సినిమా విడుదల వాయిదా..
ఇదిలా ఉండగా కన్నడ బాషా చిత్రంగా వస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం సహ మొత్తం 13 భాషలలో విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ తో సహా చిత్ర బృందం విడుదల చేసింది. హాలీవుడ్ రేంజిలో ఈ సినిమా లో యాక్షన్స్ సన్నివేషాలను తీర్చిదిద్దారు. ఇలా భారీ హంగుల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆర్థిక కారణాలవల్ల సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. నిజానికి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నప్పటికీ చివరిగా కాస్త ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ప్రస్తుతం ఈ సినిమా విడుదలను ఆపి వేస్తున్నట్లు సమాచారం. మరి తదుపరి విడుదల తేదీని చిత్ర బృందం ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి. మొత్తానికైతే సినిమా విడుదల తేదీ వాయిదా పడింది అంటూ వస్తున్న వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయాలు తెలిసి అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ధ్రువ సర్జ కెరియర్..
ధ్రువ సర్జ కెరియర్ విషయానికి వస్తే, 2012లో విడుదలైన అద్దూరి అనే చిత్రం ద్వారా కన్నడ ఇండస్ట్రీకి నటుడిగా పరిచయమైన ఈయన యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాకు స్వయానా మేనల్లుడు. అంతేకాదు స్వర్గీయ నటుడు చిరంజీవి సర్జాకి తమ్ముడు కూడా.. 1988 అక్టోబర్ 6న బెంగళూరులో జన్మించిన ధ్రువ సర్జ బంధువులంతా కూడా ఇండస్ట్రీలోనే ఉండడం గమనార్హం. ఇక ఈయన మేనమామలు అర్జున్ సర్జ, కిషోర్ సర్జాతో పాటు తాతయ్య శక్తి ప్రసాద్ ,మరదలు ఐశ్వర్య సర్జ, వదిన మేఘన రాజ్ ఇలా వీరంతా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండడం గమనార్హం.