Mega Family:మెగా ఫ్యామిలీ సినీ ఇండస్ట్రీలో అతిపెద్ద ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకుంది. ఒక్క ఈ కుటుంబం నుండి దాదాపు పది మందికి పైగా హీరోలు ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు. ఇక ఈ ఫ్యామిలీలో చాలామంది హీరోలు ఉన్నారు కాబట్టి ఏడాది పొడవునా ఈ హీరోలకు సంబంధించిన సినిమాలే ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే ఏమైందో తెలియదు కానీ గత ఏడాది కాలంగా మెగా హీరోల ఖాతాలో ఒక్క హిట్ కూడా పడడం లేదు. ఈ ఏడాది రామ్ చరణ్(Ram Charan) ‘గేమ్ ఛేంజర్ ‘ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.
మెగా హీరోల మూవీలకే ఎందుకు ఈ తిప్పలు..
ఇక తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ‘విశ్వంభర’ సినిమా విడుదలపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అనుకున్నంతగా ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. అటు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా 14 సార్లు వాయిదా పడింది. కనీసం ఇప్పటికైనా విడుదలవుతుందా అంటే ప్రశ్నార్థకంగానే మారిన ప్రశ్న ఇది. ముఖ్యంగా ఈ చిత్రాలు అనుకున్న సమయానికి విడుదల కాకపోవడం పైగా ఎప్పుడూ ఏదో ఒక అవాంతరం ఎదురవుతుండడంతో అభిమానులు కూడా నిరాశకు గురి అవుతున్నారు. అయితే ఇలా మెగా బ్రదర్స్ సినిమాలు విడుదలకు నోచుకోకపోవడానికి కారణం వీఎఫ్ఎక్స్ అనే వార్త స్పష్టంగా వినిపిస్తోంది.
ఆలస్యానికి ప్రధాన కారణం..
అసలు విషయంలోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా సోషియో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కబోతోంది. సీజీ వర్క్ కి ఈ సినిమాలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు విజువల్స్ పై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. అమీర్పేట్ ఎడిటింగ్ చాలా బెటర్ అని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అందుకే వీఎఫ్ఎక్స్ విషయంలో చాలా ఫోకస్ పెట్టింది చిత్రం బృందం. దీంతో రంగంలోకి దిగిన చిరంజీవి ‘కల్కి’ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin)పర్యవేక్షణలో ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ అందించాలని ప్రయత్నం చేస్తున్నట్లు గతంలో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కడ వరకు వచ్చాయనే సమాచారం బయటకు రాలేదు. అటు ‘ఇంద్ర’ సినిమా రిలీజ్ అయిన సందర్భంగా అదే రోజున రిలీజ్ చేయాలనుకున్నారు. ఆరోజు కూడా జరిగే పనిలా కనిపించడం లేదు. ఇక చిరంజీవి మూవీ కంటే వెనుక స్టార్ట్ అయిన సినిమాలు కూడా విడుదలై అభిమానులను అలరిస్తున్నాయి. కానీ చిరంజీవి విశ్వంభర విడుదలకు మాత్రం నోచుకోలేదని చెప్పాలి.
అడుగడుగునా గండాలే..
ఇంకోవైపు హరిహర వీరమల్లు ఫిక్షనల్ హిస్టారికల్ యాక్షన్ మూవీ. ఇందులో కూడా వీఎఫ్ఎక్స్ కి మంచి స్కోప్ ఉంది. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అటు పవన్ కళ్యాణ్ కూడా తన పాత్రడబ్బింగ్ పూర్తి చేసుకున్నారు.కానీ సీజీ వర్క్ మాత్రం అనుకున్న టైం కి ఫినిష్ కాలేదని, అందుకే ఇంకా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయలేదని సమాచారం. వాస్తవానికి అటు ట్రైలర్ చూడకుండా బయ్యర్లు కూడా సినిమాపై కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేరని సమాచారం. అటు బిజినెస్ కూడా పెద్దగా జరగలేదు. సినిమా విడుదల వాయిదా పడడంతో అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా 20 కోట్లు రూపాయలు డీల్ లో కోత విధించింది. ఇలా అడుగడుగునా నిర్మాతకు కూడా నష్టాలే ఎదురవుతున్నాయి. మొత్తానికైతే ఇలా ఈ మెగా బ్రదర్స్ నటిస్తున్న ఈ రెండు సినిమాలు గ్రాఫిక్స్ కారణంగానే లేట్ అవుతున్నాయి. అభిమానులు మాత్రం మెగా హీరోలకే ఎందుకు ఈ తిప్పలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఎప్పటికీ ఈ రెండు సినిమాలు తెరపైకి వస్తాయో చూడాలి.
also read:Devika And Danny OTT Review: దేవిక అండ్ డానీ రివ్యూ.. ఆత్మతో ప్రయాణం పెళ్ళి వరకూ వెళ్ళిందా?