Mohan Babu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు మోహన్ బాబు (Mohan Babu). సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు దక్కించుకున్నా.. కుటుంబ కలహాల కారణంగా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. వాస్తవానికి మంచు సోదరులైన మంచు మనోజ్ (Manchu Manoj), మంచు విష్ణు(Manchu Vishnu) మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. అందుకు తగిన పోస్టులు కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. అయితే ఇదంతా కేవలం అన్నదమ్ముల ఇద్దరి మధ్య అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇందులో మోహన్ బాబు కలగజేసుకోవడంతో ఈ విషయం కాస్త సంచలనం సృష్టించింది.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు..
ఇకపోతే జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన ఉద్రిక్తతలో జర్నలిస్టులపై దాడి చేశారు మోహన్ బాబు. దీంతో ఆయనపై పోలీస్ కంప్లైంట్ నమోదయింది. దీని కారణంగానే పోలీసులు విచారణకు రావాలి అని, దాదాపు రెండు మూడు సార్లు నోటీసులు పంపించినా ఆయన విచారణకు హాజరు కాలేదు.. దీంతో మళ్లీ నోటీసులు పంపించారు. అరెస్టు చేస్తారని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆయన మాత్రం ఎక్కడ కనిపించలేదు. అయితే ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పైన తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయగా.. జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ని కూడా హైకోర్టు నిరాకరించింది. దీంతో మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్మానం ఇస్తుందో చూడాలి.
జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం..
అసలు విషయంలోకి వెళ్తే.. జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఫామ్ హౌస్ లో మంచు మనోజ్ ఫ్యామిలీ.. తమ తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న విషయం తెలిసిందే. అయితే అటు ఆస్తుల విషయంలో.. తన తండ్రి మనోజ్ తనకు అన్యాయం చేశాడనే వాదనలు గతంలో వినిపించాయి. ఇదిలా ఉండగా తిరుపతిలో మోహన్ బాబుకు అత్యంత ఆదాయ వనరుగా నిలిచిన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల బాధ్యతను మంచు విష్ణు చేపట్టారు. అయితే విద్యాసంస్థలలో అవకతవకలు ఏర్పడ్డాయని మనోజ్ మోహన్ బాబుతో చెబితే.. ఆయన సహచరుడు వినయ్ దాదాపు పది మంది రౌడీలతో మంచు మనోజ్ పై దాడి చేశారు. దీంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు మనోజ్. ఆ తర్వాత మోహన్ బాబు కూడా వాట్సాప్ ద్వారా తన కొడుకు మనోజ్, కోడలు మౌనిక వల్ల ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇచ్చారు. అలా ఇద్దరు కూడా పరస్పర కంప్లైంట్లు ఇచ్చుకున్నారు.
జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబు..
ఇక రెండు రోజుల తర్వాత మంచు మనోజ్ , తన భార్య మౌనికతో కలిసి తనకు రక్షణ లేదని, తన కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని డీఎస్పీ, డీజీలను కలిసి వస్తున్న క్రమంలో జల్ పల్లిలో ఉన్న మోహన్ బాబు నివాసంలోకి వీరిని ప్రవేశించకుండా మోహన్ బాబు సెక్యూరిటీ అడ్డుకున్నారు. లోపల తన 7 నెలల కూతురు ఉందని, లోపలికి వెళ్లాలని మనోజ్ బ్రతిమలాడినా వినలేదు. దీంతో మనోజ్ కోపంతో గేట్లు బద్దలు కొట్టుకొని మరీ లోపలికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మోహన్ బాబును మీడియా మిత్రులు ప్రశ్నించే ప్రయత్నం చేయగా.. వారి దగ్గర ఉన్న టీవీ మైక్ తీసుకొని వారిపై దాడి చేశారు మోహన్ బాబు. ఇక దాంతో ఆ జర్నలిస్టులు ఇద్దరూ కూడా గాయపడ్డారు. దీంతో మోహన్ బాబు నుండి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు.