Mohan Babu:ప్రముఖ సీనియర్ నటుడు మోహన్ బాబు(Mohan Babu) కుటుంబంలో గత రెండు మూడు రోజులుగా ఆస్తుల తగాదాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. వేలకోట్ల ఆస్తులు ఉన్న వీరు ఇలా ఆస్తి కోసం గొడవపడడం ఏంటి? అంటూ అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. కలెక్షన్ కింగ్ గా నటనా సామ్రాజ్యాన్ని విస్తరించిన మోహన్ బాబు, ఒకవైపు వ్యాపారంలో పెట్టుబడులు పెడుతూనే, మరొకవైపు విద్యాసంస్థలు నడిపిస్తూ వేల కోట్లకు అధిపతి అయ్యారు. ఇక ప్రస్తుతం ఈయనకు ముగ్గురు పిల్లలు.. ఇద్దరు కొడుకులు, ఒక అమ్మాయి. అందరికీ సమానంగా ఆస్తులు పంచుతానని గతంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో మళ్లీ ఈ ఆస్తుల గొడవలేంటి? అంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు.
జల్పల్లిలో మోహన్ బాబు నివాసం వద్ద ఉద్రిక్తత.
రెండు రోజుల క్రితం అటు మంచు మనోజ్(Manchu Manoj), ఇటు మోహన్ బాబు ఇద్దరూ పరస్పర కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఎదుటివారి నుంచి తమకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ చేయడంతో పోలీసులు ఇరువురి వాంగ్మూలాలు సేకరించి కేస్ ఫైల్ చేశారు. ఇకపోతే మంచు విష్ణు(Manchu Vishnu)దుబాయ్ నుంచి జల్పల్లిలో ఉన్న ఇంటికి చేరుకోగానే.. వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో.. ముందే ఆలోచించిన విష్ణు నలభై మంది బౌన్సర్లను ఇంటి దగ్గర కాపలాగా పెట్టారు. మరొకవైపు అదే ఇంట్లో ఉంటున్న మంచు మనోజ్ కూడా తన తరఫున 30 మంది బౌన్సర్లును తీసుకొచ్చారు. అయితే పోలీసులు మాత్రం మనోజ్ తీసుకొచ్చిన బౌన్సర్లను లోపలికి అనుమతించలేదు. దీంతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తనకు న్యాయం జరగాలి అని డీజీపీ, డీజీ లను కలిపి ఇంట్లో ఉన్న ఏడు నెలల పాపను తీసుకోవడానికి మనోజ్ ఇంటికి రాగా.. మోహన్ బాబు సెక్యూరిటీ వీరిని బయటే ఆపేశారు. బ్రతిమలాడినా ఒప్పుకోకపోవడంతో గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లారు మంచు మనోజ్.
మోహన్ బాబు దాడిలో జర్నలిస్ట్ కి గాయలు..
ఇక సమయంలో మీడియా మిత్రులు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించగా ఆక్రోషంతో ఊగిపోయిన మోహన్ బాబు జర్నలిస్టుల దగ్గర ఉన్న మైక్ లాక్కొని వారి బుర్రలు పగలగొట్టారు. ఆ సమయంలో జర్నలిస్టుకి చాలా దారుణంగా గాయాలయ్యాయి. మోహన్ బాబు చేసిన దాడిలో గాయపడ్డ జర్నలిస్టుకి ముక్కుకి చెవికి మధ్య ఉన్న సున్నితమైన ఎముక ఏకంగా మూడు చోట్ల ఫ్రాక్చర్ అయిందని వైద్యులు నిర్ధారించారు. ఇక ఆ ఎముకలు ఫ్రాక్చర్ అయ్యాయి అంటే మోహన్ బాబు ఎంత బలంగా వారిపై దాడి చేశారో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే తమకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా.. పోలీసులు మోహన్ బాబు పై సెక్షన్ 118 బీఎన్ఎస్ కింద కేస్ ఫైల్ చేశారు.
హాస్పిటల్లో చేరిన మోహన్ బాబు..
గొడవ అనంతరం కోపం కారణంగా బీపీ డౌన్ అవడంతో అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయారు మోహన్ బాబు. ఇక వెంటనే మంచు విష్ణు తన తండ్రిని తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సంఘర్షణలో రాచకొండ సిపి పోలీసులు మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశారు. ఈరోజు 10:30 గంటలకు విచారణకు రావాలని కోరారు. మరి వీటన్నింటినీ మోహన్ బాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.