Vangaveeti Radha: ఎన్నికల సమయంలో సీట్లు త్యాగం చేసి.. పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించేందుకు సిద్ధమవుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మొన్న నాగబాబుకు కేబినెట్ హోదా ఇస్తున్నట్లు ప్రకటిస్తే.. ఇప్పుడు వంగవీటి రాధా కూడా ఎమ్మెల్సీ కట్టబెడుతున్నట్లు తెలుస్తోంది. నిన్న ఏపీ సీఎం చంద్రబాబుతో వంగవీటి రాధా భేటీ అయ్యారు. సచివాలయానికి వచ్చిన రాధా.. సీఎంతో జరిగిన భేటీలో కీలక చర్చలు చేసినట్టు సమాచారం. వంగవీటికి టీడీపీ నుంచి MLC పదవి ఆఫర్ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో రాధా భేటీ ప్రాధాన్యత సంతచించుకుంది. ఇటీవల రాధాతో మంత్రి నారా లోకేశ్ సైతం భేటీ అయ్యారు.
ఇక, వంగవీటి రాధాకు 2019 ఎన్నికల ముందే టీడీపీ నుంచి ఎమ్మెల్సీ సీటు పైన హామీ ఉంది. నాడు వైసీపీ నుంచి టీడీపీలో చేరే సమయంలో ఎమ్మెల్సీ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. దీంతో, టీడీపీ లో చేరిన రాధా ఆ ఎన్నికల్లో పార్టీ కోసం ప్రచారం చేశారు. పార్టీ అధికారంలోకి రాకపోవటంతో హామీ అమలు కాలేదు. 2024 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అలాంటిది ఏమి జరగలేదు. కోరుకున్న నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సీటు వస్తుందంటి నిరాశే ఎదురైంది. అయినా కూడా కూటమికి మద్దతుగా రాధా ప్రచారంలో పాల్గొన్నారు. ఇక, ఇప్పుడు చంద్రబాబు తో సమావేశంలో ప్రస్తుతం ఖాళీ అవుతున్న మండలి స్థానాల్లో ఒకటి రాధా కు ఇచ్చేలా హామీ లభించినట్లు తెలుస్తోంది. దీంతో.. త్వరలో భర్తీ అయ్యే సీట్లలో రాధాకు ఛాన్స్ ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: నాగబాబుపై ట్రోలింగ్స్.. కూటమిలో సెగలు మొదలయ్యాయా?
ఇదిలా ఉంటే.. సామాజిక న్యాయం పేరుతో నాగబాబు లాంటివారికి పదవి కట్టబెట్టడం సరికాదని సోషల్ మీడియాలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నాయకులు.. ఆయన్ని మంత్రిమండలిలోకి తీసుకుంటే ఇకపై పార్టీ కోసం పోరాటం చేయబోమని తెగేసి చెబుతున్నారు. మంత్రి పదవికి అర్హులైన ఎంతోమందిని వదిలేసి అసలు ఎమ్మెల్యే కూడా కాని వ్యక్తిని నెత్తిని పెట్టుకోవడం ఏంటని వారి ప్రశ్న. కేబినేట్ అంటే జబ్బర్దస్త్ షో అనుకుంటున్నారా అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఈ విమర్శలు చంద్రబాబుకే పరిమితం కాలేదు.. పవన్‌పై కూడా జనసైనికులు మండిపడుతున్నారు. వారసత్వ రాజకీయాలకు దూరమంటూనే టీడీపీ, వైసీపీ సరసన చేరిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్నపుడు పార్టీని వీడకుండా వైసీపీ వేధింపులను తట్టుకొని నిలబడిన వారు చాలా మంది ఉన్నారని గుర్తు చేస్తున్నారు పవన్ అభిమానులు. జనసేన అంటే కులాలకు, మతాలకు, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని కాలర్ ఎగరేసి చెప్పుకునే వాళ్లమని.. ఇప్పుడు ఆ పేంటెంట్ పోతుందంటున్నారు. నాగబాబుకు జాక్ పాట్ తగిలినా.. కూటమికి దెబ్బ తగులుతుందా అనే చర్చి ఇప్పుడు నడుస్తోంది. ఈ వివాదానికి చంద్రబాబు, పవన్ ఎలా చెక్ పెడతారో అని చూడాలి.