Mohan Babu:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకుంది మంచు కుటుంబం(Manchu Family) . క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ కుటుంబం నుండే గొడవలు తలెత్తడంతో కుటుంబం పరువు కాస్త రోడ్డున పడింది అని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తండ్రి కొడుకుల (Mohan babu – Manchu Manoj) గొడవలో జర్నలిస్టులపై మోహన్ బాబు (Mohan babu) దాడి చేయగా ఆయనపై కేసు నమోదయింది. ఈ మేరకు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా .. హైకోర్టు ఈయన పిటిషన్ కొట్టి వేసింది. ఆ తర్వాత హైకోర్టు నిర్ణయాన్ని కాదని మోహన్ బాబు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా .. తాజాగా ఆయనకు సుప్రీంకోర్టు భారీ ఊరట కలిగించింది అని చెప్పవచ్చు. జర్నలిస్టులపై దాడి కేస్ లో భాగంగా మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోరడంతో.. మోహన్ బాబుకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఈ విషయం తెలిసి అటు మంచు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటు మోహన్ బాబుకి కూడా ఈ విషయం పెద్ద ఊరట కలిగించింది అని చెప్పవచ్చు.
జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి..
అసలు విషయంలోకి వెళ్తే.. గత ఏడాది చివర్లో మోహన్ బాబు ఇంట్లో నివాసం ఉంటున్న మంచు మనోజ్ పై మోహన్ బాబు మనుషులు దాడి చేశారట. ఈ మేరకు గాయాలతో మంచు మనోజ్, తన భార్య మౌనిక రెడ్డి (Mounika Reddy) సహాయంతో హాస్పిటల్ లో చేరడంతో, ఈ విషయం కాస్త ఒక్కసారిగా బయటపడింది. ఆ తర్వాత అటు మోహన్ బాబు, ఇటు మంచు మనోజ్ పరస్పర కంప్లైంట్ లు ఇచ్చుకున్నారు. ఇకపోతే తన కుటుంబం నుండి తనకు ప్రాణహాని ఉందని, మంచు మనోజ్ డీజీపీ, డీజీలను కలిసి జల్పల్లిలో ఉన్న తన తండ్రి ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. అదే సమయంలో మోహన్ బాబు ఇంటి వద్ద సెక్యూరిటీ మంచు మనోజ్ ను లోపలకు అనుమతించలేదు. దీంతో పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఇక అక్కడ గేట్లు బద్దలు కొట్టుకొని మరీ మనోజ్ ఇంట్లోకి వెళ్లిపోయారు. అదే సమయంలో మీడియా కూడా మోహన్ బాబును ప్రశ్నించే ప్రయత్నం చేసింది. కోపంతో ఊగిపోయిన మోహన్ బాబు జర్నలిస్టుల దగ్గర ఉన్న టీవీ మైక్ లాక్కొని వారి బుర్రలు పగలగొట్టారు. ఈ నేపథ్యంలోనే జర్నలిస్టులు ఇద్దరూ మోహన్ బాబు నుండి తమకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత పలుమార్లు విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు పంపించినా.. మోహన్ బాబు విచారణకు హాజరు కాలేదు. పైగా హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు మోహన్ బాబు. దీంతో హైకోర్టు ఆయన ముందస్ బెయిల్ పిటీషన్ను రద్దు చేసింది. ఇక ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించగా .. తాజాగా ఆయనకు బెయిల్ లభించింది.