Movie Collections Dropped:సంక్రాంతి సినిమాల తర్వాత పెద్ద స్టార్ సినిమాలు విడుదలకు రాకపోవడం, అటు వచ్చిన కొన్ని సినిమాలు కూడా సరిగా ఆడకపోవడంతో ఆడియన్స్ థియేటర్లకు రావడానికి మక్కువ చూపించడం లేదు. దీంతో థియేటర్లకు భారీ నష్టం వాటిల్లుతోంది. అయితే ఇప్పుడు ఇలాంటి సమస్యల కారణంగా పీవీఆర్ ఐనాక్స్ కి ఏకంగా 25 శాతం మేర నష్టాలు వచ్చినట్లు తెలిపింది. నాల్గవ త్రైమాసికంలో రూ.125.3 కోట్ల నికర నష్టాన్ని అందుకోగా.. ఇది మూడవ త్రైమాసికంలో రూ. 35.5 కోట్ల లాభంతో పోల్చుకుంటే, ఇబ్బందికర పరిణామం అని పీవీఆర్ తాజాగా స్పష్టం చేసింది.
పీవీఆర్ ఐనాక్స్ కు రూ.125 కోట్లు నష్టం..
పీవీఆర్ ఐనాక్స్ కంపెనీ యాజమాన్యం మాట్లాడుతూ..”ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ కి అసలు కలిసి రావడం లేదు. నార్త్ లో సరైన సినిమాలు ఏవి కూడా రిలీజ్ కావడం లేదు. అటు అస్థిరమైన రిలీజ్ లతో సినిమా క్యాలెండర్ పూర్తిగా నిరాశపరిచింది. పెద్దపెద్ద స్టార్ల సినిమాలు విడుదల కావడం లేదు. అటు చిన్న సినిమాలు విడుదలైనా..కంటెంట్ లేకపోవడం వల్ల మల్టీప్లెక్స్ లకు ఆడియన్స్ రావడం లేదు. దీని ఫలితంగా కంపెనీకి స్థూల బాక్సాఫీస్ ఆదాయంలో దాదాపు తొమ్మిది శాతం ఆదాయం తగ్గింది” అంటూ కంపెనీ స్పష్టం చేసింది. ఇకపోతే మల్టీప్లెక్స్ ఆపరేటర్ కార్యకలాపాల నుండి ఆదాయం నాలుగో క్వార్టర్లో 27.3% తగ్గి, రూ.1249.8 కోట్లకు చేరుకుంది. మూడో త్రైమాసికంలో రూ.1,717.3 కోట్లు ఉండగా.. ఇప్పుడు చాలా నష్టం వాటిల్లింది. పైగా 14 శాతం మేరా సినిమాల విడుదలలు తగ్గిపోవడం కూడా ఈ నష్టానికి కారణమని కంపెనీ స్పష్టం చేసింది. ఇకపోతే గత త్రైమాసికంలో రూ.1759.1 కోట్ల నుండి ఈ త్రైమాసికానికి రూ.1311.2 కోట్లకు రెవెన్యూ తగ్గింది. ఆదాయం తగ్గినా కానీ ఐనాక్స్ ఖర్చులను చాలా వరకు తగ్గించుకోగలిగింది. మూడో త్రైమాసికంలో రూ. 1712.8 కోట్లతో పోల్చుకుంటే నాలుగో త్రైమాసికంలో మొత్తం ఖర్చులు 13.67% తగ్గి రూ.1478.7 కోట్లకు చేరుకున్నాయి.
స్టార్ల సినిమాల కోసం ఎదురుచూడాల్సిందే..
ఇకపోతే టాలీవుడ్ నుండి బడా చిత్రాలు రావడానికి ఇంకా సమయం పట్టేటట్టే ఉంది. ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) ‘రాజా సాబ్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. హార్రర్ , కామెడీ జానర్ లో రాబోతున్న ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ మారుతి (Maruthi)దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది అని చెప్పాలి. ఎన్టీఆర్ (NTR ), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్లో వస్తున్న ‘డ్రాగన్’ మూవీతో పాటూ రామ్ చరణ్ (Ram Charan), బుచ్చిబాబు సనా (Bucchibabu sana) కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’, మహేష్ బాబు(Maheshbabu ), రాజమౌళి (Rajamouli ) కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎమ్బి 29 సినిమాల కోసమే ఇప్పుడు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఈ సినిమాలలో ఇప్పుడు ఏ ఒక్క సినిమా విడుదలైన మళ్లీ థియేటర్లు కళకళలాడతాయి అనడంలో సందేహం లేదు. మరి ఆరోజు ఎప్పుడు వస్తుందో అని అటు థియేటర్ యాజమాన్యం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ALSO READ:Balakrishna Injured: బాలయ్య తలకు గాయం.. ఎన్టీఆర్ రియాక్షన్, అసలు ఏమైంది?