Mrunal Thakur: ఇండస్ట్రీకి ఎప్పుడు, ఎలా వచ్చాం అన్నది ముఖ్యం కాదు. ఎంతవరకు ఎదిగాం. స్టార్ గా ఎన్నాళ్లు ఉన్నాం అనేది ముఖ్యం. దానికోసమే ప్రతి ఒక్కరు కష్టపడుతూ ఉంటారు. టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. కొందరికి స్టార్ డమ్ త్వరగా వచ్చింది. ఇంకొందరికి లేట్ గా వచ్చింది. కానీ, వారందరూ కూడా ఇండస్ట్రీలో స్థిరంగా నిలబడాలని కోరుకుంటున్నవారే. అలా టాలీవుడ్ లో పాతుకుపోవాలని చూస్తున్న హీరోయిన్స్ లో మృణాల్ ఠాకూర్ ఒకరు.
ఒక స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ఒక హీరోయిన్ ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు మృణాల్ పడింది అని చెప్పొచ్చు. సీరియల్ నటిగా కెరీర్ ను ప్రారంభించి.. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూసింది. బాలీవుడ్ నుంచి ఆ చాన్స్ రాలేదు కానీ, సీతారామం సినిమాతో టాలీవుడ్ ఆమెను ఆహ్వానించింది. సీత పాత్రలో మృణాల్ నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పొచ్చు. అందం, అభినయం కలబోసిన రూపంతో తెలుగువారిని ఆకట్టుకుంది. ఆ ఒక్క సినిమా ఆమె జీవితాన్ని మార్చేసింది. తెలుగువారికి సీతగానే గుర్తుండిపోయింది.
ఇక ఈ సినిమాస్ తరువాత ఎలా పడితే అలా సినిమాలు చేయకుండా చాలా జాగ్రత్తగా కథలను ఎంచుకొని నటించడం మొదలు పెట్టింది. అలా హాయ్ నాన్న చేసింది. అది కూడా మంచి హిట్ అందుకుంది. ఇక ఈ రెండు భారీ హిట్స్ తరువాత హ్యాట్రిక్ హిట్ కోసం ఫ్యామిలీ స్టార్ అంటూ విజయ్ దేవరకొండ తో రొమాన్స్ చేసింది. కానీ, ఈ సినిమా మాత్రం అమ్మడికి పరాజయాన్ని చవిచూపించింది. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు డెకాయిట్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నది. పండే ప్రతి బియ్యపు గింజ మీద తినేవారి పేరు రాసి ఉంటుంది అన్నట్లు.. సినిమాలో ఆ పాత్ర ఎవరికి రాసి పెట్టీ ఉంటే చివరకు వారి వద్దకే వెళ్తుంది.
అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ లో మొదట శృతి హాసన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇద్దరి జంట కూడా చూడముచ్చటగా ఉంది. కానీ, కొన్ని కారణాల వలన ఈ సినిమా నుంచి శృతి తప్పుకోవడం.. మృణాల్ రావడం వెంటనే జరిగిపోయాయి. ఏదిఏమైనా ఈ పాత్రలో మృణాల్ కూడా బావున్నట్లే కనిపించింది. అడివి శేష్ సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఇది లవ్ స్టోరీ కాదు అని చెప్పడమే కాకుండా.. ప్రేమించిన అమ్మాయిని చంపడానికి బయల్దేరిన హీరో అని గ్లింప్స్ లో చూపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఇదేదో కొత్త కథలా ఉందే అనే టాక్ వచ్చేసింది.
ఫ్యామిలీ స్టార్ తరువాత మృణాల్ తెలుగు సినిమా చేయలేదు. ఇప్పుడు అమ్మడి ఆశలన్నీ డెకాయిట్ మీదనే పెట్టుకుంది. ఇది హిట్ అయితేనే.. తెలుగులో మరిన్ని మంచి కథలు అమ్మడి దగ్గరకు వెళ్తాయి. అందుకే ఈసారి మృణాల్ మొత్తం శేష్ పైనే ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో మృణాల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది.. ఎలాంటి అవకాశాలను చేజిక్కించుకుంటుంది అనేది చూడాలి.