Mrunal Thakur: మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) పరిచయం అవసరం లేని పేరు. నటిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం తెలుగు సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. మరాఠీ బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ మంచి సక్సెస్ అందుకున్న ఈమెకు బాలీవుడ్ వెండితెరపై సినిమాలలో నటించే అవకాశం కూడా లభించింది. ఇలా పలు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేసిన మృణాల్ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు. ఇక తెలుగులో ఈమె సీతారామం (Sita Ramam)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు.
బ్రాండెడ్ మోజులో పడొద్దు..
ఇలా మొదటి సినిమాతోనే ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మృణాల్ అనంతరం ఫ్యామిలీ స్టార్ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుత కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఒక జీవిత సత్యాన్ని తెలియజేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీల నుంచి మొదలుకొని సాధారణ వ్యక్తులు కూడా ఖరీదైన బ్రాండెడ్ వస్తువులను ఉపయోగించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకు అనుగుణంగానే లక్షల్లో డబ్బులు ఖర్చు చేస్తూ ఖరీదైన బట్టలు, చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉంటారు.
లక్షలు ఖర్చు చేయడం ఇష్టం ఉండదు…
ఇలా లగ్జరీ జీవితం గురించి మృణాల్ మాట్లాడుతూ బిగ్ సీక్రెట్ బయటపెట్టారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్లు వేసుకునే చెప్పుల నుంచి మొదలుకొని వారు వేసుకునే బట్టలు వాచ్ ఖరీదు లక్షల్లో ఉంటాయి. ఇలాంటి వాటిపైనే సెలబ్రిటీలు భారీ స్థాయిలో ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటివన్నీ తనకు ఇష్టం ఉండదని మృణాల్ ఠాకూర్ వెల్లడించారు. తాను బట్టల కోసం డబ్బులు ఏమాత్రం ఖర్చు చేయనని తెలిపారు. ఇప్పటివరకు నేను కొన్న వాటిలో ఖరీదైన డ్రస్సు ధర కేవలం రూ. 2 వేల మాత్రమే అంటూ ఈమె షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.
చిరిగిన బట్టలు బూట్లు వేసుకున్నా పర్లేదు కానీ, ఉండడానికి ఒక ఇల్లు & భవిష్యత్తు పైన భరోసాకి ఒక నాలుగు సెంట్ల భూమి మాత్రం కొనుక్కోండి!
— Actress Mrunal Thakur 👌 pic.twitter.com/LkXNeUuQdz
— Srikanth (@yskanth) June 2, 2025
ఇక తాను ఏదైనా ఈవెంట్ కోసం వెళ్లేటప్పుడు వేసుకునే దుస్తులన్నీ ఫ్యాషన్ డిజైనర్లు ఇచ్చేవేనని తెలిపారు. నిజానికి నాకు దుస్తుల కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయడం ఇష్టం ఉండదు. లక్షల రూపాయలు పెట్టి బట్టలు కొనుక్కొని వాటిని బీరువాలో దాచడం వల్ల ఎలాంటి ఉపయోగం రాదని, బ్రాండెడ్ దుస్తుల మోజులో పడి డబ్బులను వృధా చేయకండని తెలిపారు. అలా చేయటం నాకు అసలు నచ్చదు. చిరిగిన బట్టలు, చిరిగిన బూట్లు వేసుకున్న పర్లేదు కానీ ఎవరు బ్రాండెడ్ మోజులో పడొద్దు, అక్కడ పెట్టే డబ్బులు భూమిపైన, ఇంటిపైన పెట్టుబడిగా పెడితే భవిష్యత్తుకు భరోసా ఉంటుంది అంటూ మృణాల్ ఠాకూర్ ఈ సందర్భంగా చెప్పిన ఈ వ్యాఖ్యలపై ఎంతోమంది అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇది మాత్రం జగమెరిగిన జీవిత సత్యం అంటూ కామెంట్లు చేస్తున్నారు.