Music Director : నమ్మకమైన వ్యక్తి కదా అని కాస్త అజాగ్రత్తతో ఉంటే, ఓ మ్యూజిక్ డైరెక్టర్ ను బురిడీ కొట్టించాడు ఆఫీసు బాయ్. తాజాగా ప్రముఖ హిందీ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ చక్రవర్తి (Pritam Chakraborty) ఆఫీస్ బాయ్ ను దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంచక్కా 40 లక్షల బ్యాగ్ తో చెక్కేశాడు సదరు వ్యక్తి.
40 లక్షలు దొంగతనం… ఆఫీసు బాయ్ అరెస్ట్
బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ చక్రవర్తి మ్యూజిక్ స్టూడియో నుండి రూ.40 లక్షల దొంగతనం జరిగింది. ఈ కేసులో ముంబై పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అనుమానితుడు ఆశిష్ బుటిరామ్ సాయల్. అతని వయసు 32. స్టూడియోలో ఆఫీస్ అసిస్టెంట్‌గా పని చేశాడు. జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఫిబ్రవరి 4న దొంగతనం జరిగినట్లు సమాచారం అందుకున్న మలాడ్ పోలీస్ స్టేషన్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. స్టూడియోలోని సీసీటీవీ ఫుటేజీలో నిందితుడి ముఖం స్పష్టంగా కనిపించలేదు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు కాందివాలి, మలాడ్, చార్కోప్, వెర్సోవా, మార్వ్ రోడ్, మాల్వానీ, సమతా నగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న 150 నుండి 200 సీసీటీవీ రికార్డింగ్ లను పరిశీలించారు.
ఫుటేజ్‌లో సాయల్ స్టూడియో నుండి బయలుదేరి, కండివాలికి రిక్షాలో వెళుతున్నట్లు కనిపించింది. ఆ తర్వాత అతను చాలా గంటలు నడిచి చార్కోప్ చేరుకున్నాడు. అక్కడి నుండి మార్వే రోడ్‌కు మరో రిక్షాలో, తర్వాత మాల్వానీ చేరుకున్నాడు. సమతా నగర్‌కు మరో రిక్షాలో చేరుకునే ముందు కొంతసేపు అక్కడే ఉన్నాడు. ఆ ప్రాంతంలోనే తిరుగుతూ వెర్సోవాకు రిక్షా ఎక్కాడు. బయలుదేరే ముందు సాయల్ దాదాపు ఎనిమిది గంటలు రిక్షాల్లో ప్రయాణించాడు.
సాంబా జిల్లాలో అతన్ని పట్టుకోవడానికి పోలీసులు టెక్నికల్ సర్వేలైన్ ను ఉపయోగించారు. రైల్వే రోడ్ ప్రాంతంలో ఒక బృందం అతన్ని గుర్తించి అరెస్టు చేసింది. అధికారులు అతని నుంచి దాదాపు రూ.34 లక్షల నగదు, రూ.2.87 లక్షల విలువైన ఐఫోన్, మ్యాక్‌బుక్‌ను స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన డబ్బుతోనే అతను వాటిని కొనుక్కున్నట్టు సమాచారం. ప్రస్తుతం అతన్ని కోర్టులో హాజరుపరచడానికి ముంబైకి తిరిగి తీసుకువచ్చారు.
అసలేం జరిగిందంటే?
ఫిబ్రవరి 4న మధ్యాహ్నం 2 గంటలకు గోరేగావ్‌లో ఉన్న ప్రీతమ్ చక్రవర్తి మ్యూజిక్ స్టూడియో, యూనిమస్ రికార్డ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఈ దొంగతనం జరిగింది. నిర్మాత మధు మంతెన గోరేగావ్‌లోని లింక్ రోడ్ లోని చక్రవర్తి స్టూడియోకు ఓ బ్యాగ్ లో డబ్బు పంపాడు. అతని మేనేజర్ వినిత్ ఛేడా ఆ బ్యాగ్‌ను ఆఫీసులో పెట్టాడు. తరువాత అది కనిపించకుండా పోయింది. చక్రవర్తికి ఇవ్వడానికి సాయల్ బ్యాగ్‌ను తీసుకెళ్లాడని వేరే అసిస్టెంట్స్ ఛేడాతో చెప్పారని తెలుస్తోంది. సాయల్ నమ్మకమైన ఉద్యోగి కాబట్టి బ్యాగ్ ను తెచ్చి ఇస్తాడని తాను భావిస్తున్నానని చక్రవర్తి పోలీసులకు చెప్పాడు. కానీ అతను తిరిగి రాకపోవడంతో, ఛేడా మలాడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.