Sankranthiki Vasthunnam: బాలీవుడ్‌లో యాక్షన్ హీరోలు సైతం అప్పుడప్పుడు ఫ్యామిలీ కథలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అలాంటి సినిమాలు చాలావరకు హిట్ అయ్యాయి కూడా. అయితే వారు సొంతంగా రాసుకున్న కథలకంటే టాలీవుడ్‌లో తెరకెక్కిన ఫ్యామిలీ సినిమాలను రీమేక్ చేసి హిట్లు కొట్టిన హీరోలే ఎక్కువ. అందులో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి వారు కూడా ఉంటారు. అలా ప్రస్తుతం ఒక బీ టౌన్ స్టార్ హీరో కన్ను అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాపై పడినట్టు సమాచారం. సంక్రాంతి సందర్భంగా విడుదలయిన ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగడంతో ఈ మూవీని హిందీలో రీమేక్ చేసి ఇదే రేంజ్‌లో సక్సెస్ సాధించాలని చూస్తున్నాడట ఓ సీనియర్ హీరో.
స్టార్ హీరో కన్ను
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రమే ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. 2025 జనవరిలో పలు చిత్రాలు విడుదలయినా కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’కు వచ్చినంత ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా ఏ ఇతర సినిమాకు రాలేదు. అలా విడుదలయ్యి దాదాపు నెలన్నర అవుతున్నా ఇంకా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్, అందులో వెంకటేశ్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఈ మూవీని హిందీలో రీమేక్ చేయాలని సీనియర్ హీరో అక్షయ్ కుమార్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
అతడే డైరెక్టర్
బీ టౌన్ స్టార్ హీరో అయిన అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఒరిజినల్ కథలకంటే రీమేక్స్, బయోపిక్స్‌తోనే ఎక్కువగా హిట్స్ సాధించాడు. తెలుగు, తమిళం తేడా లేకుండా ఎన్నో హిట్ సినిమాలను హిందీలో రీమేక్ చేశాడు అక్షయ్. అలా ఇప్పుడు ఈ హీరో కన్ను ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాపై పడిందని సమాచారం. మామూలుగా ఇలాంటి రీమేక్స్ చేయాలని అనుకున్నప్పుడు ఒరిజినల్‌లో తెరకెక్కించిన దర్శకుడికే మొదటి ప్రాధాన్యత ఇస్తాడు అక్షయ్. వాళ్లు రీమేక్‌ను డైరెక్ట్ చేయడానికి ఒప్పుకోకపోతే అప్పుడు వేరే ఆప్షన్స్ వెతుక్కుంటాడు. అలా ‘సంక్రాంతికి వస్తున్నాం’ రీమేక్‌ను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో అక్షయ్ ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: ఓటీటీ కంటే ముందుగానే టీవీల్లోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’.. డైట్ అండ్ టైమ్ వచ్చేసింది..
సల్మాన్ కాదు
‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) సినిమా ప్రమోషన్స్ సమయంలో ఈ మూవీని హిందీలో సల్మాన్ ఖాన్‌తో రీమేక్ చేస్తే బాగుంటుందని, సల్మాన్ ఇమేజ్‌కు ఈ కథ బాగా సెట్ అవుతుందని స్టేట్‌మెంట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). దీంతో ఎప్పటికైనా ఈ మూవీని సల్మాన్‌తో అనిల్ రావిపూడి రీమేక్ చేస్తాడని అనుకున్నారంతా. కానీ ఉన్నట్టుండి ఈ రీమేక్ రైట్స్ కోసం అక్షయ్ కుమార్ రంగంలోకి దిగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వరుసగా రీమేక్స్‌లో నటించడంతో అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ కూడా కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. మరి ఈ ‘సంక్రాంతికి వస్తున్నాం’ రీమేక్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.