Murali Mohan:ప్రముఖ సినీ నటుడు, రాజకీయవేత్త, నిర్మాత మురళీమోహన్ (Murali Mohan) కు అరుదైన గౌరవం లభించింది . ఆయనను ‘ఎన్టీఆర్ పురస్కారం’ వరించింది. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలను పురస్కరించుకొని.. మై హోమ్ అవతార్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని రవీంద్ర భారతిలో సోమవారం రోజు ఎన్టీఆర్ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ ఎన్టీఆర్(Sr.NTR) వారసులు నందమూరి రామకృష్ణ (N.Ramakrishna) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ కు ఎన్టీఆర్ పురస్కారం అందజేయడం జరిగింది.
నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ..
ఈ సందర్భంగా నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. “అంకితభావం, క్రమశిక్షణ, సేవా దృక్పథం కలిగిన మహానీయుడు ఎన్టీఆర్. ఆయన పురస్కారం అందుకోవడానికి సినీ నటుడు మురళీమోహన్ అన్ని విధాలా అర్హుడు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఐక్యత కోసం ఎంతో కృషి చేశారు. ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తున్నాము” అంటూ నందమూరి రామకృష్ణ తెలియజేశారు.
మురళీమోహన్ మాట్లాడుతూ..
ఎన్టీఆర్ పురస్కారం అందుకున్న మురళీమోహన్ మాట్లాడుతూ..” ఎన్టీఆర్ ను నేను ఆరాధ్య దైవంగా భావిస్తాను. ఆయన కుమారుడు రామకృష్ణ చేతుల మీదుగా ఈ ఎన్టీఆర్ పురస్కారం అందుకోవడం మరింత ఆనందంగా ఉంది” అంటూ కామెంట్లు చేశారు . ఇకపోతే ఈ సభను ప్రారంభించడానికి ముందు సినీ జర్నలిస్టులు ఎస్.వి.రామారావు రూపొందించిన విశ్వవిజేత ఎన్టీఆర్ జీవిత లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జే రాధాకృష్ణ, ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.
మురళీమోహన్ జీవిత విశేషాలు..
మురళీమోహన్ విషయానికి వస్తే.. 1940 జూన్ 24న మాగంటి మురళీమోహన్ జన్మించారు. ఈయన నటుడు గానే కాకుండా రాజకీయ నాయకుడిగా, నిర్మాతగా, వ్యాపార కార్యనిర్వాహకుడిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. 1973లో తొలిసారి అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన ‘జగమే మాయ’ అనే సినిమాలో నటించారు. ఇక తర్వాత దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) దర్శకత్వంలో 1974లో వచ్చిన ‘తిరుపతి’ అనే సినిమాతో గుర్తింపు సొంతం చేసుకోవడం జరిగింది. ఇక చలనచిత్ర పరిశ్రమలో దాదాపు రూ.350 కి పైగా సినిమాలలో నటించిన మురళీమోహన్ జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థలలో వివిధ హోదాలలో పనిచేశారు .అంతేకాదు 2015 లో ఎన్నికలు జరిగే వరకు కూడా తెలుగు చలనచిత్ర కళాకారుల సంఘానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. నటుడు గానే కాకుండా ఈయన తన సోదరుడు కిషోర్ తో కలిసి ‘జయభేరి ఆర్ట్స్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. నిర్మాతగా ఆయన మొదటి చిత్రం రాజా చంద్ర దర్శకత్వం వహించిన ‘వారాలబ్బాయి’. ఇక ఈ జయభేరి ఆర్ట్స్ బ్యానర్ పై ‘అతడు’ సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ నిర్మాణ సంస్థ ద్వారా మూడు నంది అవార్డులు కూడా అందుకున్నారు. ఇక రాజకీయ రంగంలో కూడా మంచి హోదాను అనుభవించారు. 2014లో 16వ లోక్సభ ఎన్నికలలో రాజమండ్రి నుండి పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. ఇక ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. ఇక సీరియల్స్ లో కూడా కీలకపాత్రలు పోషించిన విషయం తెలిసిందే.