Manisharma:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి (Chiranjeevi) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చిరంజీవి ఒకవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూనే.. మరొకవైపు తన బ్లడ్ బ్యాంక్ ద్వారా.. రక్త శిబిరాలు కూడా ఏర్పాటు చేసి అవసరమైన వారికి రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చిరంజీవి పేరుపైన బ్లడ్ బ్యాంక్ ఉన్న విషయం తెలిసిందే. అత్యంత కీలకము అనిపించిన సందర్భాలలో ఈ బ్లడ్ బ్యాంకు నుంచి ఎంతోమందికి రక్తం ఉచితంగా అందివ్వబడింది. ముఖ్యంగా మెగాస్టార్ అభిమానులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఈ బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేసి తమ మంచి మనసును చాటుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మణిశర్మ(Manisharma ) రక్తదానం చేసి చిరంజీవి పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇకపోతే మణిశర్మ ఇలా రక్తదానం చేయడం రెండవసారి కావడం విశేషం.
చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేసిన మణిశర్మ..
ఈ సందర్భంగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ మాట్లాడుతూ.. “ఎప్పటినుంచో నేను ఈ బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేయాలి అనుకుంటున్నాను. నేను నా సంగీతాన్ని చిరంజీవి చిత్రాలకు అందించడం ద్వారా.. ఆయనపై నాకున్న అభిమానాన్ని చాటుకున్నాను. ఇప్పుడు రక్తదానం చేయడం అనేది మరింత సంతోషంగా అనిపిస్తోంది. దీనిని నా వంతు కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. ఇప్పటికే లక్షలాదిమంది ఇందులో భాగమయ్యారు. అందులో నేను ఒక బొట్టు లాగా చేరడం మరింత ఆనందాన్ని కలిగించింది. ఇలాంటి మంచి కార్యక్రమంలో అందరూ భాగం కావాలి” అంటూ మణిశర్మ పిలుపునిచ్చారు. ప్రస్తుతం మణిశర్మ రక్తదానం చేశారని తెలిసి, అటు అభిమానులు ఇటు నెటిజన్లు కూడా ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మణిశర్మ కెరియర్..
మణిశర్మ విషయానికి వస్తే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దిగ్గజ సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ మణిశర్మగా ప్రసిద్ధి పొందారు. తెలుగు, తమిళ్ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేసిన ఈయన దాదాపు 200కు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. సాలూరు రాజేశ్వరరావు దగ్గర నుంచి వందేమాతరం శ్రీనివాస్ వరకు మేటి సంగీత దర్శకుల దగ్గర పనిచేసిన అనుభవం మణిశర్మకి ఉంది. ఇక సీనియర్ హీరోలను మొదలుకొని యంగ్ హీరోల వరకు చాలామంది హీరోలతో పని చేశారు. ఇక మణిశర్మ బాల్యం విషయానికి వస్తే.. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జన్మించారు. చిన్నప్పుడే ఇంట్లో ఉన్న హార్మోనియం పెట్టెను ఎలా వాయించాలో తెలియకపోయినా వాయించేవారు. ఆయన తండ్రి యనమండ్ర నాగ యజ్ఞ శర్మ మంచి వయోలిన్ కళాకారుడు. సినిమాలో పనిచేయాలని కోరికతో భార్యతో సహా మద్రాస్ వెళ్లిపోయారు. కాబట్టి మణిశర్మ పెరిగింది అంతా మద్రాస్ లోనే. చిన్నప్పుడే కొడుకు ఆసక్తిని గమనించిన ఆ తల్లిదండ్రులు వయోలిన్ తో పాటు గిటార్, మాండోలిన్ కూడా నేర్పించారు. తర్వాత రికార్డింగ్లో వయోలిన్, గిటార్ కంటే కీబోర్డ్ వాయించే వాళ్లకి ఎక్కువ చెల్లిస్తూ ఉండడంతో తండ్రి సలహా మేరకు దానిని కూడా నేర్చుకున్నారు. 1982లో 18 సంవత్సరాల వయసులో చదువు పూర్తిగా మానేసి , సంగీత ప్రపంచంలోకి వెళ్లిపోయారు మణిశర్మ.