Congress: రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నుంచి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో పార్టీ నేతలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తోంది. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికలను దగ్గరుండి పరిశీలించారు కాంగ్రెస్ పెద్దలు. ఈ క్రమంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జుల సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారాయన. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల ఫలితాలకు బాధ్యత మీరే వహించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ కొత్త పేర్లను ఓటర్ల జాబితాలో చేర్పిస్తోందన్నారు. ఈ తరహా మోసాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవాలని సూచించారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంపికలో ప్రతిపక్ష నేతకు విలువే లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఖర్గే. ఇకపై బూత్ స్థాయి వరకు ఇన్‌ఛార్జులు వెళ్లి కష్టపడి పని చేయాలన్నారు. బూత్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌చార్జిలదేనని తేల్చి చెప్పారు. పార్టీ అనుబంధ విభాగాలను భాగస్వామ్యం చేసుకుంటూ సమన్వయంతో అడుగులు ముందుకు వేయాలన్నారు.
క్షేత్రస్థాయికి వెళ్తేనే పార్టీకి మంచి ఫలితాలు వస్తాయన్నారు కాంగ్రెస్ చీఫ్. పార్టీకి ఉపయోగపడే కార్యకర్తలను గుర్తించాలన్నారు. పార్టీలో చేర్చుకునే నేతల విషయంలో తొందరపాటు ఏ మాత్రం వద్దన్నారు. పార్టీ భావజాలంతో ఏకీభవించే వారిని మాత్రమే చేర్చుకోవాలన్నారు. లేదంటే రేపటి రోజున గెలిచిన ఆయా నేతలు పార్టీ విడిచి వెళ్లే అవకాశముందని గుర్తు చేశారు.
ALSO READ: రైతులకు శుభవార్త.. ఆ రోజు అకౌంట్ ఇలా చెక్ చేసుకోండి?
ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో వచ్చిన ఫీడ్ బ్యాక్ నేపథ్యంలో నేతలను హెచ్చరించారు పార్టీ చీఫ్. బుధవారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయం ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారాయన. కష్టకాలంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే సైద్ధాంతిక నిబద్ధత కలిగిన వ్యక్తులను తీసుకు రావాలన్నారు.
బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, కష్ట సమయాల్లో పని చేసినవారిని దూరం పెట్టకూడదన్నారు. కొత్తగా వచ్చినవారు తొందరపడి వేరే పార్టీలోకి వెళ్తే మొదటికే నష్ట వస్తుందన్నారు. అలాంటి వారికి దూరంగా ఉండాలని పదేపదే ప్రస్తావించారు. మార్పు కోసం ఢిల్లీ ప్రజలు ఓటు వేశారన్నారు. వనరులు లేకపోయినా పోరాటం చేయడంలో రాష్ట్ర నాయకత్వం చేసిన కృషిని మరువలేమన్నారు.
రాబోయే ఐదేళ్లు ప్రజలకు సంబంధించిన అంశాలను నేతలు లేవనెత్తాలన్నారు. పనిలో పనిగా అమెరికా నుంచి భారతీయులను అవమానకర తీరిలో పంపడం ఆపడాన్ని ఆక్షేపించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ విఫలమయ్యారన్నారు. అమెరికా విధించిన సుంకాలను వ్యతిరేకించడంలో ప్రధాని సైలెంట్ ఉండటాన్ని తూర్పారబట్టారు. ఇది దేశానికే కాకుండా భారతీయులందరినీ అవమానించడమేనన్నారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే.