Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గేమ్ ఛేంజర్. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా జనవరి 10 న రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది. దాదాపు మూడేళ్లు ఈ సినిమా కోసం ఎదురుచూసారు మెగా ఫ్యాన్స్. అంత హైప్ పెట్టుకొని సినిమా చూడడం వలనో ఏమో కానీ.. గేమ్ ఛేంజర్ ప్రేక్షకులకు ఎక్కలేదు.
శంకర్ సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెల్సిందే. ఇక అలాంటి శంకర్.. చరణ్ తో సినిమా తీస్తున్నాడు అంటే ఒక జెంటిల్ మ్యాన్, ఒక ఒకే ఒక్కడు, ఒక భారతీయుడు లెవెల్లో ఉంటుందని ఊహించుకున్నారు. కానీ, గేమ్ ఛేంజర్ లో కొంతమంది కథ లేదని, ఇంకొంతమంది అసలు ఇప్పటి సినిమా కాదని పెదవి విరిచారు.
ఇక ఈ సినిమా కోసం దిల్ రాజు కొన్ని కోట్లు పెట్టాడు. శంకర్ ఏది అడిగితే అది ఇచ్చాడు. ఒక్క పాటకు రూ. 10 కోట్లు పెట్టించాడు. ఆ సాంగ్ నే నానా హైరానా. శంకర్ సాంగ్స్ ఎలా ఉంటాయో అందరికీ తెల్సిందే. అందులో ఉండే విజువల్స్ కే మతులు పోతాయి. ఇక ఈ సినిమాలో నానా హైరానా సాంగ్ కోసం.. ఆ విజువల్స్ కోసం శంకర్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు.
Bunny Vasu: కొత్త బ్యానర్.. అల్లు అరవింద్ ఆ పని చేయనివ్వడం లేదు.. బన్నీవాసు సంచలన వ్యాఖ్యలు
దిల్ రాజు సైతం నో అనే మాట ఎత్తకుండా ఒక సాంగ్ కు రూ. 10 కోట్లు అంటే ఇచ్చేశాడు. చివరకు ఆ సాంగ్ ను సినిమాలో పెట్టలేదు. లెంత్ ఎక్కువ అయ్యింది సాంగ్ మొత్తని కట్ చేశారు. నానా హైరానా లిరికల్ సాంగ్ వచ్చినప్పుడే టాప్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆ విజువల్స్, చరణ్ లుక్, కియారా అందం. థియేటర్ లో ఈ సాంగ్ చూస్తే కన్నులవిందు అనుకున్న వారికి నిరాశే మిగిలింది.
ఇక తాజాగా నానా హైరానా వీడియో సాంగ్ ను మేకర్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. నిజంగా సాంగ్ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. రూ 10 కోట్లు ఖర్చుపెట్టి తీసిన ఈ సాంగ్ కళ్ళు చెదిరే లొకేషన్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. మొదటి షాట్ లోనే చరణ్ గుర్రం పై రావడం.. సిక్స్ ప్యాక్ చూపించడం.. మగధీర వైబ్స్ గుర్తుచేస్తుంది. ఇక కియారా అందం గురించి అస్సలు చెప్పనవసరం లేదు.
సరస్వతిపుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ ఒక ఎత్తు అయితే.. కార్తీక్, శ్రేయా ఘోషల్ వాయిస్ మరో ఎత్తు అని చెప్పాలి. ఇక చరణ్, కియారా వేసినవి చిన్న చిన్న స్టెప్స్ అయినా కూడా ఎంతో అందంగా కనిపించాయి. ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ లో శంకర్ మార్క్ లేదని పెదవి విరుస్తున్న ప్రేక్షకులు.. ఈ సాంగ్ విజువల్స్ చూసి ఇది శంకర్ మార్క్ అని చెప్పుకొస్తున్నారు. ఈ సాంగ్ కనుక సినిమాలో ఉండి ఉంటే పెద్ద స్క్రీన్ పై ఈ విజువల్స్ అన్ని ప్రేక్షకులకు మరింత కనువిందు చేసేవి అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.