Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘కల్కి 2898 ఏడి’ (Kalki 2898 AD). ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంటుందని నిర్మాతలు ఎప్పుడో ప్రకటించారు. అయితే ప్రభాస్ బిజీ షెడ్యూల్ వల్ల ఇప్పటిదాకా ఈ సీక్వెల్ పట్టాలెక్కలేదు. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు సినిమా షూటింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని, ప్రభాస్ లేకుండానే షూటింగ్ మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది.
ప్రభాస్ లేకుండానే షూటింగ్
సలార్, కల్కి 2898 ఏడి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమాలలో ‘కల్కి 2898 ఏడి’ సీక్వెల్ కూడా ఒకటి. కానీ ఈ మూవీ అసలు ఎప్పుడు పట్టాలెక్కుతుంది ? అనే విషయంపై క్లారిటీ లేదు. సీక్వెల్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతుందని ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు నిర్మాత అశ్వినీ దత్. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ‘కల్కి 2′ గురించి మాట్లాడుతూ ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీంతో త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉందని అందరూ అనుకున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ప్రస్తుతం ఫౌజీ, ది రాజా సాబ్రా, స్పిరిట్ వంటి సినిమాలపై దృష్టి పెట్టారు.
ఈ నేపథ్యంలోనే నిర్మాత అశ్విని దత్ ఈ సినిమా షూటింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కల్కి 2898 ఏడి’ సీక్వెల్ కు సంబంధించిన ఓ కీలక సీక్వెన్స్ ని త్వరలోనే చిత్రీకరించబోతున్నారు. ఈ షూటింగ్ లో కమల్ హాసన్ తో పాటు అమితాబ్ బచ్చన్ కూడా పాల్గొంటారని సమాచారం. అయితే ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆయన లేని సన్నివేశాలను షూట్ చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నారట. కాబట్టి ప్రభాస్ ఈ షెడ్యూల్లో షూటింగ్లో పాల్గొనే ఛాన్స్ లేదని అంటున్నారు. అయితే ఇదివరకే మేకర్స్ ‘కల్కి 2898 ఏడి’ సీక్వెల్ కి సంబంధించిన 60 శాతం షూటింగ్ పూర్తయిందని వెల్లడించిన సంగతి తెలిసిందే.
కల్కి 2898 ఏడి’ సీక్వెల్ పై నిర్మాత అప్డేట్
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిర్మాత అశ్విని దత్ మాట్లాడుతూ ‘కల్కి 2’ వచ్చే సంవత్సరం విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చారు. రెండో పార్ట్ మొత్తంలో కమల్ హాసన్ హైలెట్ గా నిలుస్తారని, ప్రభాస్ – కమల్ హాసన్ మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని చెప్పారు. అంతేకాకుండా దీపికా, అమితాబ్ పాత్రలకు కూడా మంచి ప్రాధాన్యత ఉంటుందని, వీళ్ళు నలుగురే ఈ సినిమాకు మెయిన్ అని అన్నారాయన.
‘కల్కి 2898 ఏడి’ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ అత్యంత భారీ బడ్జెట్లో నిర్మించారు. ఈ మూవీ గత ఏడాది రిలీజ్ అయ్యి, 1000 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. అంతేకాదు ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు దక్కింది. ఇందులో కమల్ సుప్రీమ్ యాస్కిన్ గా, ప్రభాస్ బౌంటీ హంటర్ గా, అలాగే కర్ణుడిగా కనిపించి ఆకట్టుకున్నారు. దీంతో సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.