Dwarf Teacher Woman Electrician| జీవితం వడ్డించిన విస్తరాకులా అందరికీ ఉండదు. కొందరు అదృష్టవంతులు మాత్రమే ధనిక కుటుంబాల్లో పుట్టి.. పూర్గిగా అందం, ఆరోగ్యాలతో జీవిస్తారు. కానీ పేదరికంలో పుట్టి జీవితం ఎన్ని కష్టాలు, పరీక్షలు పెట్టినా పోరాడేవారు.. పోరాడి విజయం సాధించేవారు చాలా అరుదు. ఒకవేళ ఆర్థిక కష్టాలు లేకపోయినా.. అంగవైకల్యం లేదా అందవిహానంగా పుట్టి సమాజంలో వివక్షకు గురవుతూ ఉంటారు మరికొందరు. అలాంటి వారిలో కూడా కొందరు ఎన్ని అవమానాలు ఎదురైనా సాహసించి కార్యదీక్షకులవుతారు. ఇలా జీవితంలో కష్టాలతో పోరాడి విజేతలుగా నిలిచిన వారు అందరికీ ఆదర్శ ప్రాయం. అలాంటి వారిలో ఇద్దరు మహిళలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మరుగుజ్జు టీచర్ రీటా రాణి..
తండ్రిలాగా పోలీసు అధికారి కావాలని ఆమె కలలు కన్నారు. కానీ 3 అడుగులకే పరిమితమైన మరుగుజ్జు దేహంతో ఆ కల కలగానే మిగిలిపోయింది. అయినప్పటికీ, రీటా రాణి (52) ఇప్పుడు అనేక మంది అధికారులను సమాజానికి అందిస్తున్న ఓ ఆదర్శ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. విద్యార్థులకు ఎంతో ఇష్టమైన సోషల్ సైన్స్ టీచరు.
బిహార్లోని గయ జిల్లా ధన్వాన్ గ్రామానికి చెందిన రీటా రాణి మరుగుజ్జుతనం చూసి కంగారుపడిన తల్లిదండ్రులు దేశంలోని పెద్ద ఆసుపత్రులతోపాటు విదేశంలోనూ చూపించారు. చిన్నతనంలోనే వాస్తవాన్ని అంగీకరించిన ఆమె, సహ విద్యార్థుల నుంచి, బంధువుల నుంచి ఎదురైన అవమానాలను సహిస్తూ మరింత దృఢమైన మహిళగా రూపొందారు. ముందు ప్రైవేట్ స్కూళ్లలో పిల్లలకు రీటారాని బోధించే వారు. ఎత్తు తక్కువగా ఉండడంతో బోర్డు పై రాసేందుకు బల్లపై ఎక్కి మరీ శిక్షణ ఇస్తున్నారు. మనసు ఉంటే మార్గం లభిస్తుంది అనేది రీటా రాణి నిరూపించారు. ఆమె అంగవైకల్యం, మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు కూడా బోధిస్తున్నారు. 1992లో పిల్లలకు విద్యాబోధన ప్రారంభించిన రీటా రాణికి 2010లో ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం లభించింది.
Also Read: అయ్య బాబోయ్.. ఆ చేప ధర 22 కోట్లా? ఇదీ అసలు నిజం!
ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా రాణిస్తూ బిహార్ సీఎం నీతీశ్ కుమార్, కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీ వంటి ప్రముఖుల చేతుల మీదుగా అనేక జాతీయ, రాష్ట్రస్థాయి సత్కారాలు అందుకున్నారు. వివాహ ప్రస్తావనలు వచ్చినప్పటికీ, అవివాహితగా మిగిలిన రీటా రాణి, సమాజానికి మదర్ థెరెసా లాగా సేవ చేయాలన్నది తన లక్ష్యమని చెప్పారు.
మహిళా ఎలెక్ట్రీషియన్ సీతాదేవి
మహిళా సాధికారతకు ప్రతిరూపం సీతాదేవి. గయ జిల్లా దిఘీ తాలాబ్కు చెందిన ఈమె ‘ఎలెక్ట్రీషియన్ సీతాదేవి’ అని స్థానికంగా ప్రసిద్ధి. ఏ మాత్రం చదువుకోని సీతాదేవి.. ఈ ప్రాంతంలోనే బెస్ట్ ఎలెక్ట్రీషియన్ గా పేరు సంపాదించారు. కానీ ఇదంతా ఆమె తన కుటుంబాన్ని పోషించుకోవడానికి చేస్తున్నారు. జీవితం అంటే సులువు కాదు మరి.
25 ఏళ్ల క్రితం సియారామ్ ప్రసాద్ అలియాస్ సర్దార్ జీతో ఆమెకు వివాహం జరిగింది. సియారామ్ ప్రసాద్ రోడ్డుపై ఒక విద్యుత్ పరికరాల రిపేర్ షాపు నడిపేవాడు. వీరిద్దరికీ నలుగురు పిల్లలు జన్మించారు. కానీ ఆ తరువాతే వీరికీ అసలు సమస్యలు మొదలయ్యాయి. సియా రామ్ ప్రసాద్ కు తీవ్ర అనారోగ్యం కావడంతో ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. నలుగురు పిల్లల పోషణా భారం ఎలా? అని సీతాదేవి బాధపడేది. సియా రామ్ ప్రసాద్ కు లివర్ సమస్య. ఆయన చికిత్స్ కోసం అప్పులు చేయాల్సి వచ్చేది. కాలం గడిచే కొద్దీ సియా రామ్ ప్రసాద్ కు కంటి చూపు కూడా మందగించింది. దీంతో సీతాదేవి తనే ఏదైనా పనిచేసుకొని కుటుంబ పోషణ చేయాలని భావించింది. అప్పుడు తన భర్తనే గురువుగా ఎంచుకుంది. ఆయన వద్ద క్రమంగా బల్బులు, కూలర్లు, ఫ్యాన్లు, ఇస్త్రీ పెట్టె, వాషింగ్ మెషీన్ రిపేరు చేయడం నేర్చుకుంది. ఈ రోజు సీతాదేవి ప్రతి రోజు ఇంటి పనులు చేసి మరీ.. తన భర్త షాపుతో రిపేర్లు చేసుకుంటోంది.
ఇలాంటి నారీ మణులను జీవితంలో చిన్న కష్టాలకే కుంగిపోయే వారు ఆదర్శంగా తీసుకోవాలి.