Nayanatara: లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు నయనతార(Nayanatara). సౌత్ సినీ ఇండస్ట్రీలోనే కాదు ఇప్పుడు నార్త్ లో కూడా పాగా వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండడం తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ (Netflix ) నయనతార జీవితంపై ఒక డాక్యుమెంటరీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ‘నయనతార:బియాండ్ ది ఫెయిరీటేల్’ పేరుతో వస్తున్న ఈ డాక్యుమెంటరీ త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే నయనతార వ్యక్తిగత జీవితంతో పాటు సినీ జీవితం, ప్రేమ, పెళ్లి ఇలా ప్రతి విషయం కూడా పొందుపరిచారు.
ఆ క్షణం అతడి ప్రేమలో పడిపోయా..
ఈ క్రమంలోనే తాజాగా ఈ డాక్యుమెంటరీ నుంచి ట్రైలర్ విడుదల అవ్వగా.. ఇందులో ఎన్నో విషయాలు అందరిని అబ్బురపరుస్తున్నాయి. అందులో ఒకటి నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ (Vighnesh shivan) తో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేయడం. నయనతార మాట్లాడుతూ..” పాండిచ్చేరిలో ఒక మారుమూల ప్రాంతంలో సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. అక్కడ హీరో విజయ్ సేతుపతి (Vijay sethupathi) మీద కొన్ని సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఆ సమయంలో నేను దూరంగా విఘ్నేష్ శివన్ ను గమనిస్తున్నాను. మోముపై చెరగని చిరునవ్వు, సన్నివేశాన్ని వివరించే తీరు, దర్శకుడిగా అతని ప్రత్యేకమైన పనితీరు నన్ను మరింతగా ఆకట్టుకున్నాయి. ఆ క్షణంలోనే నేను అతని ప్రేమలో పడిపోయాను” అంటూ తన ప్రేమ గురించి వెల్లడించింది నయనతార. దీంతో ఈమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
నయనతార ప్రేమ, పెళ్లి..
ఒక నయనతార పెళ్లి విషయానికి వస్తే.. 2021 మార్చి 25వ తేదీన నయనతార విఘ్నేష్ శివన్ నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక తర్వాత 2022 జూన్ 9వ తేదీన మహాబలిపురంలోని షెరటాన్ గ్రాండ్ రిసార్ట్ లో చాలా ఘనంగా వివాహం చేసుకుంది ఈ జంట. ఈ వివాహానికి అజిత్, రజనీకాంత్, షారుక్ ఖాన్, డైరెక్టర్ అట్లీ, బోనీకపూర్, రాధికా శరత్ కుమార్, విజయ్ సేతుపతి, కార్తీతో పాటు తదితర సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇకపోతే వివాహం అనంతరం ఈ జంట సరోగసి ద్వారా ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చారు. ఉయిర్ , ఉలగం అని నామకరణం కూడా చేశారు. ఇకపోతే ఈ సరోగసి సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది ఈ జంట. వాస్తవానికి మన దేశంలో సరోగసి పద్ధతికి అనుమతి లేదు. ఇక దుబాయ్ మహిళ ద్వారా పిల్లలకు జన్మనిచ్చామని తెలిపిన ఈ జంట అంతకుముందే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని తెలిపారు.
నయనతార ఎఫైర్స్ లిస్ట్..
ఇక నయనతార ఎఫైర్ లిస్ట్ విషయానికి వస్తే.. ‘వల్లవన్’ సినిమా షూటింగ్ సమయంలో.. ఆ సినిమా డైరెక్టర్, సహనటుడు ఆయన శింబు (Simbu)తో ప్రేమలో పడింది అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది కాలానికి వీరిద్దరూ విడిపోయినట్లు సమాచారం. అంతేకాదు ఆ తర్వాత నయనతార, శింబు సినిమాలో నటించనని కూడా తేల్చి చెప్పింది. ఇక కొద్ది రోజులు సినిమాలకే పరిమితమైన ఈమె ఆ తర్వాత ‘విల్లు’ షూటింగ్ సమయంలో ప్రభుదేవా(Prabhudeva) తో ప్రేమలో పడినట్లు వార్తలు వినిపించాయి. అంతేకాదు 2010లో ప్రభుదేవా స్పందిస్తూ..” నయనతార నేను వివాహం చేసుకోబోతున్నాము” అంటూ కూడా ప్రకటించారు. ఆ సమయంలో పెళ్లి చేసుకోవడానికి నయనతార కూడా తన కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టి, క్రిస్టియన్ అయిన ఈమె హిందువుగా మతం కూడా మార్చుకుంది. అయితే 2012లో నయనతార.. తామద్దరం విడిపోయామని ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది.