ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా.. మీ అమ్మ నాన్నను చంపేస్తానంటూ ఓ యువకుడు యువతిని లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. హైదరాబాద్ హయత్ నగర్ లో చెరుకుపల్లి విజయ్ అనే వ్యక్తికి ఇన్ స్టాగ్రామ్ లో ఓ అమ్మాయి పరిచయమైంది. ఆ విద్యార్థిని బీఎస్సీ నర్సింగ్ చదువుతుండగా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. దీంతో ఆ యువతిని ప్రేమించాలని వేధింపులకు గురిచేయడంతో పోలీసులను ఆశ్రయించింది.
Also read: సీఎం చంద్రబాబు సోదరుడు రామమూర్తి నాయుడు కన్నుమూత
ఇద్దరూ సరదాగా కలిసి ఉన్న సమయంలో దిగిన ఫోటోలను, వీడియోలను అందరికీ చూపిస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతే కాకుండా తనను బలవంతంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. చాలా సార్లు కాలేజీలో వెంటబడి కొట్టాడని, బంధువులు అందరికీ ఫోన్ చేస్తూ మీ బిడ్డని చంపుతా అని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన కుటుంబానికి ప్రాణహని ఉందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
తమ ఇంటికి వచ్చి అడ్డుపడిన తన తండ్రి మీద దాడికి దిగాడని చెప్పింది. తనకు తెలిసిన కొంత మంది అమ్మాయిలను కూడా ఇలాగే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని యువతి ఆరోపించింది. గతంలో కూడా నాగార్జునసాగర్ లో కంప్లైంట్ ఇవ్వగా అక్కడ కూడా కేసు అయ్యిందని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆన్ లైన్ లో ఏర్పడిన పరిచయాలతో యువత ఇబ్బందుల్లో పడుతున్నారు. కొంతమంది మధ్య ఆ పరిచయాలు ప్రేమలు, అక్రమ సంబంధాలకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో గొడవలు జరిగి విడిపోవడం, కేసులు పెట్టుకోవడం వరకూ వెళుతున్నాయి. కాబట్టి పోలీసులు ఆన్ లైన్ పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని యువతకు సూచిస్తున్నారు.