Saif AliKhan..బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif AliKhan) ఇటీవల అనూహ్యంగా కత్తి దాడికి గురై అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా ఆయన విషయంలో జరిగిన ఈ విషయం చాలా సంచలనంగా మారింది. జనవరి 16 తెల్లవారుజామున ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు.. కత్తితో దాడి చేసి సైఫ్ అలీఖాన్ ను గాయపరిచారు. దీంతో ఆయన శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. వెన్నెముకపై తీవ్రగాయం కావడంతో పాటు మెడపై గాయాలు కూడా ఉన్నాయి. దాడి జరిగిన వెంటనే ఆయనను.. తన నివాసం ఉన్న బాంద్రా నుంచి లీలావతి హాస్పిటల్ కు ఆయన ఏడేళ్ల కుమారుడు తీసుకెళ్లారు. ఆయనకు డాక్టర్లు శస్త్ర చికిత్స నిర్వహించి, ఆయన వెన్నెముకలో విరిగిన కత్తి భాగాన్ని తొలగించడం జరిగింది. ప్రస్తుతం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్యం కూడా కుదుటపడిందని వైద్యులు తెలిపారు.
మెడి క్లెయిమ్ చేసిన సైఫ్ అలీఖాన్..
దాదాపు వారం రోజులుగా సైఫ్ అలీ ఖాన్ హాస్పిటల్లో ఉండగా.. ఆ బిల్లు మొత్తం రూ.36 లక్షలు అయిందని కథనాలు చెబుతున్నాయి. దీనికి తోడు సైఫ్ అలీ ఖాన్ రూ.35.95 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినట్లు ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ నివా బుపా తెలిపినట్లు సమాచారం. ఇకపోతే సైఫ్ అలీ ఖాన్ క్లెయిమ్ చేసిన దాంట్లో రూ.25 లక్షలు మాత్రమే అప్రూవ్ చేసినట్లు వెల్లడించింది. పూర్తి చికిత్స తర్వాత చెల్లించిన చివరి బిల్లును సమర్పించిన తర్వాతనే మిగిలిన మొత్తాన్ని కూడా సెటిల్ చేస్తామని నివా బుపా తెలిపినట్లు సమాచారం. దీనికి తోడు ఒక స్టార్ సెలబ్రిటీ కి త్వరగా మెడికల్ క్లెయిమ్ మంజూరు చేయడంపై.. అభ్యంతరాలు వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సైఫ్ అలీ ఖాన్ హెల్త్ ఇన్సూరెన్స్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు చికిత్స ఖర్చు, డిస్చార్జ్ వివరాలు కూడా వెల్లడించాలని కోరినట్లు సమాచారం.
సైఫ్ అలీఖాన్ క్లెయిమ్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ..
తాజాగా ఈ వ్యవహారంపై ముంబైకి చెందిన వైద్య నిపుణుల సంస్థ ‘అసోసియేషన్ ఆఫ్ మెడికల్ కన్సల్టెంట్స్’ సైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ను ప్రశ్నించింది. సైఫ్ ఇన్సూరెన్స్ ని త్వరగా ఆమోదించిన విధానాన్ని ప్రశ్నిస్తూ.. వైద్య నిపుణుల సంస్థ.. ఇన్సూరెన్స్ రెగ్యురేటరీ సంస్థ అయిన ‘ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (IRDAI)కు లేఖ కూడా రాసింది. “మిస్టర్ సైఫ్ అలీ ఖాన్ కు తన బీమా పాలసీ కింద నగదు రహిత చికిత్స కోసం రూ.25 లక్షలు మంజూరు చేయబడ్డాయని వార్తలు ఇటీవల రావడంతో మేము అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాము. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ సాధారణ పాలసీదారునితో పోల్చుకుంటే.. సైఫ్ అలీ ఖాన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు, ఉన్నత స్థాయి వ్యక్తులు.. కార్పొరేట్ పాలసీలు ఉన్న రోజులకు అనుకూలమైన నిబంధనలు, అధిక నగదు రహిత చికిత్స పరిమితులను పొందుతున్నారు. కానీ సాధారణ పౌరులకు మాత్రం తగినంత కవరేజ్ లభించక వారు ఇబ్బంది పడుతున్నారు అంటూ వైద్య సంస్థలు తెలిపింది. అంతేకాదు సామాజిక హోదాతో సంబంధం లేకుండా బీమా అందరికీ రక్షణగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపిన ఈ సంస్థ పౌరులతో సమానంగానే సెలబ్రిటీలను కూడా చూసేలా చూసుకోవాలని ఐఆర్డిఏఐ ని సంస్థ అభ్యర్థించింది. ఏది ఏమైనా సైఫ్ అలీ ఖాన్ సెలబ్రిటీ కాబట్టి ఇంత త్వరగా డబ్బులు మంజూరు చేశారని, ఒకవేళ సామాన్యులకైతే ఇంత త్వరగా చేసేవారా అంటూ కూడా ఐ ఆర్ డి ఏ ఐ ను వైద్య సంస్థ ప్రశ్నించింది. మరి దీనిపై అటు సైఫ్ అలీ ఖాన్ కూడా ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.