Vijay Sai Reddy Next Plan: వైసీపీలో అసలేం జరుగుతోంది. ఒక్కొక్కరుగా పార్టీ వీడుతుండటం ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలను పంపుతోంది? విజయసాయి పార్టీని వీడ్డంలోని ప్రధాన సమస్య ఏంటి? లోగుట్టు ఏ రామకృష్ణుడెరుక? జగన్ నిజంగానే సాయిరెడ్డిని దూరం పెట్టారా? లేక ఎవరైనా ఇందుకు కారణమవుతున్నారా? మరీ ముఖ్యంగా విజయసాయి కి అధిష్టానంతో వచ్చిన గ్యాప్స్ ఏంటి? ఆయనపై వస్తోన్న గ్యాసిప్స్ ప్రభావమెంత?
గతంలో సాయిరెడ్డి పొజిషన్ పార్టీలో నెం. 2
త్వరలో మీడియా పెడతానన్న ప్రకటన చేయనున్న సాయిరెడ్డి?వివిధ కేసుల్లో జగన్ తో పాటు A1, A2 గా మాత్రమే కాదు.. ఒకానొక రోజుల్లో సాయి రెడ్డి పొజిషన్ కూడా ఫ్యాన్ పార్టీలో నెంబర్ టూగానే ఉండేది. ఆయన రేంజే వేరు. సోషల్ మీడియా మొత్తాన్ని ముందుండి నడించడమే కాదు.. తనదైన స్టైల్లో ప్రత్యర్ధి పార్టీల పై మరీ ముఖ్యంగా చంద్రబాబు రాజకీయ చాతుర్యంపై నెగిటివ్ కామెంట్లు గుప్పించి వాటిని వైరల్ చేసినంతటి నెట్ వర్క్, నెట్ వర్త్ విజయసాయి రెడ్డి సొంతం.
సాయి గప్ చుప్ వెనక సజ్జల ఉన్నారా?
అలాంటి విజయసాయి రెడ్డి.. ఇప్పుడు గప్ చుప్ కావడం వెనక.. సజ్జల ఉన్నారా? ఆయన ఏమని సలహాదారు అయ్యారో.. ఆపై సకల మంత్రిత్వ శాఖల మంత్రిగా ప్రతి అంశంపై మాట్లాడ్డం మొదలు పెట్టారో.. జగన్ కీ సాయిరెడ్డికీ మధ్య అంతరం పెరిగిపోతూ వచ్చిందా? అన్న కామెంట్లు సోషల్ మీడియాలో తెగ పేలుతున్నాయ్.
సజ్జల ఎంట్రీతో జగన్ తో సాయిరెడ్డికి గ్యాప్?
సజ్జల రాకతోనే విజయసాయి రెడ్డికి జగన్ కీ మధ్య దూరం పెరిగిందనీ. నెంబర్ టూలో ఉన్న తన పొజిషన్ కాస్తా.. త్రీ- ఫోర్- ఫైవ్.. అంటూ పడిపోతూ వచ్చిందనీ. ఈరోజున సాయి రెడ్డి చేసిన మెయిన్ కామెంట్ ఏంటంటే.. తనలాంటి వారు బయటకొచ్చేస్తే.. జగన్ కి వచ్చే నష్టమేమీ లేదనడంలో అర్ధమేంటన్న టీకా తాత్పర్యాలను వెలికి తీస్తున్నారు కొందరు పొలిటికల్ ఎనలిస్టులు.
నాలాంటివారు బయటకొస్తే జగన్ పార్టీకొచ్చే నష్టమేం లేదున్న సాయిరెడ్డి
అంతే కాదు తనకు తాను నాయకత్వ సామర్ధ్యం లేని వారిగా చెప్పుకోవడం చూస్తుంటే.. ఇది ఆయనలోంచి వచ్చిన మాటా? లేక ఇప్పటి వరకూ పార్టీలో సజ్జల బ్యాచ్ ద్వారా సర్వం కోల్పోయి.. వారి హిప్నటిజానికి లోనైన.. విజయసాయి రెడ్డి తనకు తెలీకుండా తానే అంటోన్న మాటలా? అర్ధం కావడం లేదంటున్నారు మరికొందరు.
కాకినాడ, కూతురు విషయం, ఉమనైజర్ వంటి ఆరోపణలపై ఒంటరిపోరు
ఇదిలా ఉంటే, సాయిరెడ్డే స్వయంగా తనపై వచ్చిన కాకినాడ ఆరోపణలు, కూతురు అల్లుడి వ్యాపార వ్యవహారాల తదితరాలు, ఉమనైజర్ వంటి ఆరోపణలు వంటి వాటితో దాదాపు ఒంటరిపోరు చేయాల్సి వచ్చిందనీ. తాను కష్టకాలంలో ఉన్న దశలో పార్టీ నుంచి కనీస మద్దతు లభించలేదనీ. దీంతోనే ఆయనలో ఛీ.. ఈ రాజకీయాలనే వదిలేయాలన్న జీవితకాలపు వైరాగ్యం వచ్చిందనీ వివరిస్తారు కొందరు.
తనకంటూ ఒక మీడియా వ్యవస్థ లేక పోవడమూ కారణమా?
అలాంటిదేమీ లేదు.. ఆయన రాజకీయాల్లో చేరాల్సిన ఎత్తులన్నీ చేరినా.. రావాల్సిన చెడ్డపేరు, ఆరోపణలన్నీ వచ్చేశాయనీ. దీనంతటికీ కారణం తనకంటూ ఒక మీడియా సపోర్టు లేక పోవడం వల్లేననీ. దానికి తోడు భారతీ డైరెక్షన్లో నడిచే మీడియా ఉందిగా అంటూ జగన్ అన్న మాటల ద్వారా కూడా ఆయన తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారనీ.. ఇలా ఎన్నాళ్లని తనలో తాను ప్రశ్నించుకున్నారనీ.. అందుకే అధినేత జగన్ మాట సైతం కాదని.. తన వాయిస్ అంటూ ఒకటి బయటకు వెళ్లేలా మీడియా సంస్థ స్థాపించాల్సిఉందని భావించారనీ.. అందుకే ఆయన రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టి మీడియా సంస్థ ఒకటి పెట్టి తనపై వచ్చిన ఆరోపణలకు తగిన సమాధానం చెప్పాలనుకుంటున్నారనీ అంటారు ఇంకొందరు.
మీడియా పెడతారా? అని అడిగితే ఆలోచిస్తా! అన్న సాయి రెడ్డి
ఇదిలా ఉంటే.. ఇదే అంశం మీద మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన్నుంచి లేదన్న మాట రాకుండా.. ఆలోచిస్తా! అనడం చూస్తుంటే.. ఆయన మీడియా విషయంలో పూర్తిగా వెక్స్ అయిపోయారనీ. అందుకే ఇంతటి భారీ డెసిషన్ తీసుకోవల్సి వచ్చిందనీ క్రోనాలజీ ఒకటి చెప్పుకొస్తున్నారు.
స్వయంకృతమా? లేక సజ్జల ద్వారా ఏర్పడ్డ అగాథమా??
అది స్వయంకృతమో, లేక సజ్జల ద్వారా ఏర్పడ్డ అగాథమో.. లేక తనకే మొహం చెల్లక పోవడమో.. తెలీదుగానీ ఇటీవలి కాలంలో జగన్ని కలిసింది కూడా చాలా చాలా తక్కువ. ఎన్నికల ముందు తర్వాతి పరిణామ క్రమాలు కూడా ఆయన్ను ఇరకాటంలో పడేశాయనీ అంటారు. ఇన్నాళ్ల పాటు నామినేటెడ్ పోస్టులు మాత్రమే అనుభవించిన తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి.. ఇక్కడ జెండా పాతలేక పోవడమూ.. విజయసాయిని తీవ్రంగా బాధించిందనీ. అందుకే ఆయన తాను కంప్లీట్ పొలిటీషియన్ కాలేక పోయానన్న డైలమాలో పడ్డారనీ. అందుకే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకునేంత భారీ నిర్ణయం తీసుకున్నారనీ అంటారు.
విశాఖ ఇంఛార్జి పోస్టు నుంచి తప్పించడంతో అవమానకరం?
తనకు తాను అసమర్ధుడిగా భావించడానికి వెనక విశాఖ ఇంచార్జి పోస్టుల నుంచి తప్పించడం కూడా ఒక కారణంగా చెబుతారు ఆయన వెంట తిరిగేవారు. ఇలా తనపై ఒక నమ్మకం లేక. తన సామర్ధ్యం నిరూపించేందుకు అనువుగా ఒక మీడియా పెట్టాలంటే అందుకూ అధినేత ఒప్పుకోక.. ఇంతటి ఆర్ధిక- సామాజిక- రాజకీయ ప్రయాణం చేసి ఏం ఉపయోగం? జీవితకాలం ఈ అవును- కాదు అంటూ తల ఊపడంతోనే సరిపెట్టుకోవల్సిందేనా? మనకంటూ ఒక వ్యక్తిత్వమూ, వ్యక్తిగత జీవితమూ అవసరం లేదా? మరీ ముఖ్యంగా నెల్లూరు సందు గొందుల నుంచి ఢిల్లీ వరకూ ఇంతటి ఆర్ధిక మేథావిగా రాజకీయ నాయకుడిగా పేరు ప్రఖ్యాతలుండి.. ఈ డూడూ బసవన్న బతుకు ఎంత కాలం?
మనకంటూ ఒక వ్యక్తిత్వమూ, వ్యక్తిగత జీవితమూ అవసరం లేదా?
తనకంటూ ఒక పర్సనల్ కమ్ పొలిటికల్ ఒపీనియన్ ఉండొద్దా? మరీ ముఖ్యంగా తమ చేతుల్లో మీడియా ఉంది కదా అని ప్రతోళ్లూ తానొక అవినీతిపరుడ్ననీ, అబద్దాల కోరుననీ, ఇంకా హీనంగా మహిళా వ్యామోహం అధికంగా ఉన్నవాడనీ అవాకులు చవాకులు పేలుతుంటే చూస్తూ ఊరుకోవల్సిందేనా? తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్న వాళ్లందరికీ తానెవరో చాటి చెప్పనక్కర్లేదా? జగన్ ది ఏం పోయిందీ.. ఆ నిందారోపణలు వచ్చింది తనపైనేగా.. అందుకే అధినేతను ఇంతగా విబేధించి మరీ ఆ బంధాలన్నిటినీ తెంచుకుని విజయసాయిరెడ్డి బయటకొచ్చేశారనీ అంటారు మరికొందరు.
త్వరలో మీడియా పెడతానన్న ప్రకటన చేయనున్న సాయిరెడ్డి?
విజయసాయిగారూ మీరు బీజేపీలో చేరబోతున్నారా? అన్న ప్రశ్నకైనా.. ఆయన లేదని అన్నారు కానీ.. మీడియా పెడతారా? అన్న ప్రశ్నకు మాత్రం ఆలోచిస్తానని అనడం బట్టీ చూస్తే.. త్వరలో ఒక మీడియా వ్యవస్థ ఏర్పాటు చేసే ప్రకటనైతే సాయిరెడ్డి నుంచి ఉండొచ్చని గట్టిగా నమ్ముతున్నారు చాలా మంది. ఇలాగైనా తనకూ జగన్ కు గ్యాప్ సృష్టించిన వారిపైనా, తనపై ఇన్నేసి గాసిప్స్ క్రియేట్ చేసిన వారందరిపైనా విజయసాయి గట్టిగానే రివేంజ్ తీసుకునేలా కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు వీరంతా.