Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘పెద్ది’ పై.. ఇప్పుడు సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ భారీ హైప్ నెలకొంది. రామ్ చరణ్ గత చిత్రం ‘గేమ్ ఛేంజర్’ అంచనాలను అందుకోలేక నిరాశపరిచిన నేపథ్యంలో, ‘పెద్ది’తో ఆయన తిరిగి ఫామ్‌లోకి వస్తాడనే ఆశలు బలంగా ఉన్నాయి. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఒక రూరల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోంది. ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మెగా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చింది. అయితే, ఈ పోస్టర్‌లో చరణ్ లుక్‌ను ‘పుష్ప’లో అల్లు అర్జున్ లుక్‌తో పోల్చి కొంత ట్రోలింగ్ జరిగినప్పటికీ, ఫస్ట్ షాట్ గ్లింప్స్ ఈ విమర్శలన్నింటినీ తిప్పికొట్టేలా ఉంటుందని ఇన్‌సైడ్ టాక్. ఏప్రిల్ 6, 2025న రామ నవమి సందర్భంగా విడుదల కానున్న పెద్ది ఫస్ట్ షాట్ గ్లింప్స్ అంచనాలను మించి ఉంటుందని సమాచారం. అయితే.. లేటెస్ట్‌గా చరణ్ ఈ సినిమాలో ఊహించని పాత్రలో కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది.
మరుగుజ్జుగా రామ్ చరణ్?
‘పెద్ది’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రెండు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ఒక దాంట్లో నోటిలో చుట్ట పెట్టుకొని, ముక్కుపోగుతో పవర్ ఫుల్‌గా కనిపించాడు చరణ్. ఇక రెండో లుక్‌లో రామ్ చరణ్ బ్యాట్ పట్టుకొని కనిపించాడు. ఈ స్టిల్ చూసిన తర్వాత అభిమానులు మరియు నెటిజన్ల నుండి వస్తున్న కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ పోస్టర్‌లో చరణ్ షార్ట్‌గా కనిపిస్తున్నట్టుగా చెబుతున్నారు. చెర్రీ చేయి చిన్నగా కనిపిస్తుందని.. దీంతో ఈ చిత్రంలో రామ్ చరణ్ మరుగుజ్జు పాత్రలో కనిపించే అవకాశం ఉందని కొందరు ఊహాగానాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఉప్పెన చూసిన తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సానా తన సినిమాల్లో హీరోలకు ఏదో ఒక లోపం చూపించే స్టైల్‌ను ఫాలో అవుతున్నాడనే కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు చరణ్ మరుగుజ్జుగా కనిపించే అవకాశాలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే.. ఇది కేవలం ఊహాగానాలు మాత్రమే. దీనిపై నిజమైన క్లారిటీ ఏప్రిల్ 6, 2025న రామ నవమి సందర్భంగా విడుదల కానున్న గ్లింప్స్‌తోనే రానుంది.
చిట్టిబాబుకి మించి?
గతంలో ‘రంగస్థలం’లో సినిమాలో చిట్టిబాబుగా చెవిటి పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు రామ్ చరణ్. పేరుకే చిట్టిబాబు కానీ, చరణ్ కటౌట్‌తో సుకుమార్ చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ‘పెద్ది’లో బుచ్చిబాబు కూడా అలాంటి ప్రయోగమే చేస్తున్నాడా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఒకవేళ చరణ్ మరుగుజ్జుగా కనిపిస్తే మాత్రం.. మరోసారి ఆయన నుంచి చిట్టిబాబుకి మించిన పర్ఫార్మెన్స్ చూడబోతున్నామనే చెప్పాలి. అసలే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా అంటున్నారు. అందులోను పారాలింపిక్స్ నేపథ్యం అని కూడా అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. చరణ్ మరుగుజ్జుగా కనిపించనున్నాడనే వార్తలో నిజమున్నట్టుగా చెప్పాలి. మరి చరణ్ మరుగుజ్జు పాత్రను ఎలా పోషిస్తాడు, బుచ్చిబాబు ఆ లోపాన్ని బలంగా ఎలా మలుస్తాడు అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.